How to Apply for Mudra Loan: ఏదైనా వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నా, పెట్టుబడి లేక నీరసపడేవాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు. లోన్‌ కోసం బ్యాంక్‌కు వెళితే, ఏదైనా ఆస్తిని గ్యారెంటీగా అడుగుతారు. ఆస్తులు ఉంటే లోన్‌ కోసం తిరగాల్సిన ఖర్మ మాకేంటని ప్రశ్నిస్తారు సదరు వ్యక్తులు. మీరూ ఈ లిస్ట్‌లో ఉంటే, మీకో గుడ్‌ న్యూస్‌. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ (PMMY) మీ కోసమే. ఈ పథకం కింద, మీరు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వకపోయినప్పటికీ, బ్యాంక్‌ మీకు రూ.20 లక్షల లోన్‌ ఇస్తుంది.


మన దేశంలో సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలు, పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, పూచీకత్తు లేని రుణాలు అందించేందుకు PMMY స్టార్ట్‌ చేశారు. ఈ స్కీమ్‌ కింద ఇచ్చే లోన్లనే ‘ముద్ర రుణాలు’ అని పిలుస్తారు. ముద్ర (MUDRA) అంటే - "మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ". సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా నిధులను అందించి, వాటిని అభివృద్ధి చేయటం ముద్ర లక్ష్యం. ఈ స్కీమ్‌ను 2015 ఏప్రిల్‌లో ప్రారంభించారు.


పథకం వివరాలు
గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ వ్యాపారం/పరిశ్రమ ప్రారంభించినా ముద్ర రుణం పొందొచ్చు.
సొంతంగా/భాగస్వామ్యంతో ఇప్పటికే వ్యాపారం/పరిశ్రమ ప్రారంభించిన వాళ్లు లేదా కొత్తగా ప్రారంభించబోయే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి లోన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు.
ముద్ర లోన్‌ పొందడానికి రుణగ్రహీత ఎలాంటి పూచీకత్తు/గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 
లోన్‌ మంజూరైతే, ‘ముద్ర కార్డు’ ద్వారా ఆ డబ్బును సులభంగా వినియోగించుకోవచ్చు. 
ముద్ర రుణంపై వడ్డీ రేటును లోన్‌ ఇచ్చే బ్యాంకు/ఆర్థిక సంస్థ నిర్ణయిస్తుంది. అయితే, ఆ వడ్డీ రేట్లు అందుబాటులోనే ఉంటాయి. 
లోన్‌ రీపేమెంట్‌లోనూ సౌలభ్యం ఉంటుంది. 
తీసుకున్న లోన్‌ ఇంకేదైనా పెట్టుబడి రాయితీ పథకంతో ముడిపడినట్లయితే, అదే రాయితీ ముద్ర లోన్‌కు కూడా వర్తిస్తుంది.


ఎలాంటి వ్యాపారాలకు ఇస్తారు?
తేనెటీగల పెంపకం, కోళ్ల ఫారాలు, చేపల పెంపకం
పండ్లు, కూరగాయలు వ్యాపారులు, టిఫిన్ సెంటర్లు, భోజనం హోటళ్లు
లారీ, క్యాబ్, ఆటో డ్రైవర్లు, రిపేర్ షాపులు, మెషీన్ ఆపరేటర్లు, చేతివృత్తుల పరిశ్రమలు
టైలరింగ్ షాపులు, బ్యూటీ పార్లర్లు, ఇంకా మరెన్నో స్వయం ఉపాధి కార్యకలాపాలు


ముద్ర రుణాలు - రకాలు
వ్యాపారం/పరిశ్రమ స్థాయిని బట్టి శిశు (Shishu), కిశోర్ (Kishor), తరుణ్ (Tarun) అనే విభాగాల్లో ముద్ర లోన్లు ఇస్తారు.
శిశు విభాగంలో రూ. 50,000 వరకు; కిశోర్‌ విభాగంలో రూ.50,000 - రూ.5,00,000 వరకు; తరుణ్‌ విభాగంలో రూ.5,00,000 - రూ.20,00,000 వరకు లోన్‌ పొందొచ్చు.


వడ్డీ రేట్లు
శిశు విభాగం రుణాలకు 1-12% శాతం వరకు వడ్డీ ఉంటుంది. గ్రామీణ బ్యాంకులు 3.5%, NBFCలు 6% వడ్డీకి లోన్‌ ఇస్తున్నాయి.
కిషోర్ విభాగం రుణాలపై వడ్డీ 8.6% నుంచి స్టార్‌ అవుతుంది.
తరుణ్ విభాగంలో తీసుకునే లోన్‌పై 11.15-20% మధ్య లోన్‌ రేట్‌ ఉంటుంది.


అర్హతలు
18 ఏళ్ల వయసు నిండిన భారత పౌరులు
వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి సృష్టించగలవాళ్లు
మంచి సిబిల్‌ స్కోర్‌
వ్యాపారం/పరిశ్రమలో అనుభవం & నైపుణ్యం


కావలసిన పత్రాలు
ఆధార్‌ వంటి వ్యక్తిగత గుర్తింపు పత్రం
అడ్రస్ ప్రూఫ్
2 పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోలు
వ్యాపార వివరాలతో కూడిన కొటేషన్
వ్యాపార సంస్థ కార్డు, చిరునామా, లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు


దరఖాస్తు చేయటం ఎలా?
రుణం ఇచ్చే బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే, ఉద్యమమిత్ర వెబ్‌సైట్‌ www.udyamimitra.in ద్వారా దరఖాస్తు చేయాలి.


మరో ఆసక్తికర కథనం: పది పాసైతే చాలు, టాప్‌-500 కంపెనీల్లో ఛాన్స్‌ - మీ కలను నిజం చేసే 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్'