Loan Eligibility For A Salaried Person: ప్రస్తుత సమాజంలో బతుకుతున్న ప్రతి వ్యక్తికి కొన్ని కోర్కెలు కచ్చితంగా ఉంటాయి. అందమైన ఇల్లు, ఆకర్షణీయమైన ఇంటీరియర్‌, షికారు తిరగడానికి ఒక కారు, లేటెస్ట్‌ మోడల్‌ మొబైల్‌ ఫోన్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్‌ అవుతుంది. లక్ష్మీకటాక్షం ఉన్న వ్యక్తులకు కోర్కెలు ఈడేరతాయి, ధనయోగం లేనివారికి కలగా మిగిలిపోతాయి. వీళ్లు కాకుండా మూడో వర్గం ఒకటుంది. ఆ వర్గంలోని వ్యక్తులు అప్పు చేసి ఆశలు నెరవేర్చుకుంటారు. 


అయితే, రుణం తీసుకోవడానికి చాలా షరతులు వర్తిస్తాయి. అన్నింటి కంటే ప్రధానమైనది, సదరు వ్యక్తి క్రెడిట్ స్కోర్ (Credit Score) బాగుండాలి. రుణం తీసుకునే సామర్థ్యాన్ని, సౌలభ్యాన్ని క్రెడిట్‌ స్కోర్‌ సూచిస్తుంది. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు తక్కువ వడ్డీ రేటుకే ఎక్కువ మొత్తం లోన్‌ లభిస్తుంది. దీర్ఘకాలిక రుణ చరిత్ర (Credit History), ఉద్యోగ అనుభవం ఉంటే రుణం తీసుకునే సామర్థ్యం మరింత బలం పుంజుకుంటుంది.


రూ. 50 వేల జీతం ఉన్న వ్యక్తి ఎంత గృహ రుణం తీసుకోవచ్చు?
మంచి క్రెడిట్‌ స్కోర్‌, ఉద్యోగం ఉన్న వ్యక్తులకు గృహ రుణం (Home Loan), వ్యక్తిగత రుణం (Personal Loan) రెండూ అందే ద్రాక్ష అవుతాయి. అయితే, ఈ రెండు రకాల రుణాలకు వడ్డీ రేట్లు భిన్నంగా ఉంటాయి. మీ నెలవారీ జీతం రూ. 50 వేల వరకు ఉంటే... ఏడాదికి 7 శాతం వడ్డీ రేటుకు ‍‌(క్రెడిట్ స్కోర్ బాగుంటే) & 15 సంవత్సరాల రుణ కాల వ్యవధితో మీరు దాదాపు 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు గృహ రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం, బ్యాంక్‌లు ఇంటి విలువలో 80 శాతం నుంచి 90 శాతం వరకు డబ్బును లోన్‌గా ఇస్తున్నాయి. ఇది పోగా మిగిలిన 10 శాతం నుంచి 20 శాతం మొత్తాన్ని డౌన్ పేమెంట్‌ లేదా అడ్వాన్స్‌ రూపంలో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి, డౌన్‌ పేమెంట్‌ లేదా అడ్వాన్స్‌ చెల్లింపు కోసం మీ దగ్గర ముందుగానే కొంత డబ్బు సిద్ధంగా ఉండాలి.


ఎంత వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు?
మీ నెలవారీ జీతం రూ. 50,000 వరకు ఉండి, వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటే, కనీసం 9 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాన్ని పొందొచ్చు. పర్సనల్‌ లోన్ తీసుకునే ముందు... ఇంటి ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, పెట్టుబడులు పోను ఎంత మిగులుతుందో లెక్కించాలి. ఆకస్మిక వ్యయాల కోసం కూడా కొంత మొత్తాన్ని పక్కనబెట్టాలి. ఇప్పుడు మిగిలిన డబ్బుతో నెలవారీ కిస్తీలు (EMIs) చెల్లించగలరో, లేదో చెక్‌ చేసుకోవాలి. ఖర్చులన్నీ పోను EMI కట్టగలరన్న నమ్మకం ఉంటే పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. బ్యాంక్‌ రూల్‌ ప్రకారం, వ్యక్తిగత రుణం తీసుకునే వ్యక్తికి ప్రతి నెలా కొంత ఆదాయం ఉండాలి, దానికి సంబంధించిన రుజువులను బ్యాంక్‌కు సమర్పించాలి.


ఎక్కువ బ్యాంకులు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులకు రుణాలు ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వయోపరిమితి మారవచ్చు. మీ క్రెడిట్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే, లోన్‌ పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం పొందాలంటే బ్యాంక్‌ మీ నుంచి కొన్ని పత్రాలు అడుగుతుంది. 


రుణం తీసుకునే ముందు మీ సొంతంగా కొంత పరిశోధన చేస్తే ఉపయోగంగా ఉంటుంది. ఏ బ్యాంక్‌ లేదా NBFCలో (Non Banking Financial Company) తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి, బ్యాంక్‌కు ఏయే డాక్యుమెంట్లు ఇవ్వాలి, ఎక్కడ డాక్యుమెంటేషన్‌ తక్కువగా ఉంటుంది, ఎక్కడ జాప్యం లేకుండా లోన్‌ జారీ అవుతుంది, ఎంత వడ్డీ రేటుపై ఎంత EMI చెల్లించాలి వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. 


మరో ఆసక్తికర కథనం: మీ పెట్టుబడి ఎప్పుడు రెట్టింపవుతుంది? రాబడి గుట్టు విప్పే కీలక రూల్‌ ఇది