Loan against PPF: సురక్షితమైన పెట్టుబడి సాధనాలు వెతికేవారికి పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (Public Provident Fund) ఒక మంచి ఆప్షన్! పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. పైగా ఆకర్షణీయమైన వడ్డీరేట్లు ఉంటాయి. రాబడిపై ఎలాంటి పన్ను ఉండకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.


PPFలో ఎంత జమ చేయాలి!


పీపీఎఫ్‌లో (PPF) రెండు రకాలుగా పెట్టుబడి పెట్టొచ్చు. ఏకమొత్తంలో డబ్బు జమ చేయొచ్చు. లేదంటే ప్రతి నెలా రూ.500 నుంచి రూ.1,50,000 వరకు డిపాజిట్‌ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే వడ్డీ నష్టపోకుండా ఐదేళ్ల చొప్పున ఒకటి కన్నా ఎక్కువసార్లు కాల వ్యవధి పెంచుకోవచ్చు.


PPFలో ఎంత రుణం ఇస్తారు?


ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా డబ్బులు అవసరమైతే పీపీఎఫ్‌ చందా దారులు రుణం తీసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పీపీఎఫ్‌ జమ చేయడం మొదలు పెట్టిన మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఏడాది వరకు రుణ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన మొత్తంలో 25 శాతం వరకు రుణం ఇస్తారు. ఇండియా పోస్టు, ఎస్‌బీఐ వంటి సంస్థలు ఇదే విషయం చెబుతున్నాయి.


PPF వడ్డీరేటు ఏంటి?


పీపీఎఫ్ రుణాలపై వడ్డీ స్వల్పంగానే ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీరేటు కన్నా ఒక శాతం మాత్రమే అధికంగా వసూలు చేస్తారు. ఉదాహరణకు పీపీఎఫ్‌పై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీరేటు అమలు చేస్తోంది. దానిపై ఒక శాతం అధికంగా అంటే 8.1 శాతం వరకు తీసుకున్న రుణంపై వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి వడ్డీరేటు నిర్ణయించారంటే చెల్లింపు పూర్తయ్యేంత వరకు అదే ఉంటుంది.


PPFలో లోన్‌ చెల్లించకపోతే?


రుణం మంజూరు చేసిన 36 నెలల్లోపు అసలు మొత్తాన్ని చెల్లించాలి. తీసుకున్న నెల మొదటి రోజు నుంచే వడ్డీ మొదలవుతుంది. అసలును ఏక మొత్తంలో లేదంటే రెండు దఫాలుగా చెల్లించొచ్చు. లేదనుకుంటే 36 నెలల పాటు నెలసరి వాయిదాలు కట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 36 నెలల్లోపు రుణాన్ని పూర్తిగా చెల్లించకపోతే లేదా పాక్షికంగా మాత్రమే చెల్లిస్తే ఒక శాతంగా ఉన్న వడ్డీరేటు 6 శాతంగా మారుతుంది. రుణం మొత్తానికీ ఇదే వర్తిస్తుంది.


PPFలో విత్‌డ్రా చేసుకోవచ్చా?


పీపీఎఫ్ ఖాతాదారులు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 3-6 ఏళ్ల మధ్యన రుణ సదుపాయం ఉంటుందని తెలుసు. అందుకే ఏడో ఏడాది నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకొనేందుకు అనుమతిస్తారు. అయితే చందాదారులు గమనించాల్సిన విషయం ఒకటుంది. ప్రజల్లో డబ్బు ఆదా చేసే అలవాటు పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే తక్కువ శాతమే రుణం మంజూరు చేస్తుంటారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే రుణం తీసుకొనేందుకు అనుమతిస్తారు.