How To Apply Ladli Laxmi Yojana Scheme : దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరిగింది. సామాజిక పరంగా పరిణతి పెరుగుతోంది. అయినా ఆడపిల్ల పుట్టిందంటే కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ చిన్న చూపు చూస్తున్నారు. బాలికా విచక్షణ పాటిస్తున్నారు. దక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతదేశంలో ఈ జాడ్యం మరీ ఎక్కువ. అందుకే కేంద్ర సౌజన్యంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాడ్లీ యోజన (లాడ్లీ మహాలక్ష్మీ - Ladli Laxmi Yojana)ను తీసుకొచ్చాయి. లింగ నిష్పత్తి, బాలికల విద్యాశాతం పెంచేందుకు రూ.1.30 లక్షల వరకు నగదు బహుమతిగా ఇస్తున్నాయి.
మొదట అక్కడే
లాడ్లీ పథకం మొదట హరియాణాలో ఆరంభించారు. 2005లో అక్కడీ స్కీమ్ మొదలైంది. 2007లో మధ్యప్రదేశ్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, బిహార్, చత్తీస్‌గఢ్, గోవా, ఝార్ఖండ్ అమలు చేశాయి. 2005, జనవరి 1 తర్వాత జన్మించిన బాలికలు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా బాలికలకు ఉచిత విద్య అందిస్తారు. ఉన్నత విద్యకు సాయం చేస్తారు. ఒకవేళ మధ్యలోనే బడి మానేస్తే పథకం నుంచి పేరు తొలగిస్తారు. కొన్ని రాష్ట్రాలు పెళ్లి ఖర్చుల కోసం లక్ష రూపాయల వరకు అందిస్తున్నాయి.
ప్రభుత్వమే పెట్టుబడి
ఈ పథకం ప్రయోజనాలు రాష్ట్రాలను బట్టి మారుతున్నాయి. ఉదాహరణకు హరియాణాలో ఏటా రూ.5000 వరకు బాలిక కుటుంబానికి ఇస్తారు. వీటిని ఐదేళ్ల పాటు కిసాన్ వికాస్ పత్రాల్లో జమ చేస్తారు. ఒక కుటుంబంలో గరిష్ఠంగా ఇద్దరు బాలికలకు వర్తిస్తుంది. మధ్య ప్రదేశ్‌లో బాలికల పేరుతో ప్రభుత్వమే ఏటా రూ.6000 విలువైన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లను కొనుగోలు చేస్తుంది. రూ.30,000 సమకూరేలా వరుసగా ఐదేళ్లు కొంటుంది. ఆరో తరగతిలో రూ.2000, తొమ్మిదిలో రూ.4000, 11లో రూ.6000, 12లో రూ.6000 ఇస్తుంది. 11- 12వ తరగతి వరకు నెలకు రూ.200 చొప్పున అదనంగా రూ.4000 అందజేస్తారు. 21 ఏళ్ల వయసులో పెళ్లి చేస్తే రూ.లక్ష మొత్తాన్ని ఒకేసారి అందిస్తారు.
చేరడం సులువే
లాడ్లీ లక్ష్మీ యోజనలో ఎవరైనా సులువుగా చేరొచ్చు. స్థానిక అంగన్‌వాడీలో పేర్లు నమోదు చేయించుకుంటే చాలు. ఇందుకోసం నివాస ధ్రువపత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం, బ్రాంచ్ పేరు, అకౌంట్ నంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫొటో ఇవ్వాలి. ఆన్‌లైన్ ద్వారానూ పేరు నమోదు చేసుకోవచ్చు. ఆడపిల్లలను దత్తత తీసుకున్న కుటుంబాలకూ ఈ పథకం వర్తిస్తుంది. ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఈ స్కీమ్ ఉండదు.