KYC For Insurance: కొత్త సంవత్సరం నుంచి, అంటే జనవరి 1, 2023 నుంచి చాలా విషయాల్లో రూల్స్‌ మారాయి. వాటిలో ముఖ్యమైనది, పెద్ద మార్పు ఒకటి ఉంది.


నూతన సంవత్సరం తొలి రోజు నుంచి మన దేశంలో ఏ వ్యక్తి అయినా, ఏ రకమైన బీమా పాలసీ తీసుకోవాలన్నా తమ KYC ‍‌(Know Your Customer) పత్రాలు సమర్పించడం తప్పనిసరి. KYC పత్రాలను సంబంధింత బీమా కంపెనీకి లేదా బ్యాంకుకు అందజేయాలి. అది కూడా, పాలసీని కొనుగోలు చేసే సమయంలోనే తప్పనిసరిగా ఇవ్వాలి. 


అన్ని రకాల బీమాలకూ వర్తింపు
'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (IRDAI - ఇర్డాయ్‌).. ఆరోగ్య బీమా, వాహన బీమా, గృహ బీమా, జీవిత బీమా, ప్రయాణ బీమా మొదలైన అన్ని రకాల బీమా పాలసీలను కొత్తగా కొనుగోలు చేయడానికి KYC సమర్పించాలన్న నిబంధనను తప్పనిసరి చేసింది. గత ఏడాది (2022) డిసెంబర్‌ 31వ తేదీ వరకు.. ఆరోగ్య బీమాల విషయంలో క్లెయిమ్‌ వాల్యూ ఒక లక్ష రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ ఉంటేనే KYC డాక్యుమెంట్స్‌ సమర్పించారు. అంతేకాదు, 2022లో, క్లెయిమ్‌ ఎంత విలువ ఉన్నా జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్‌ తప్పనిసరి కాదు. పాలసీదారు ఐచ్చికంగా ఇస్తే బీమా సంస్థలు లేదా బ్యాంకులు తీసుకునేవి, లేదంటే లేదు. 2023 జనవరి 1 నుంచి పాత నిబంధనలను ఇర్డాయ్‌ రద్దు చేసింది, మరికొన్ని రూల్స్‌ను మార్చింది.


మారిన నియమాలు అన్ని రకాల బీమాలకు వర్తిస్తాయి. 2023 జనవరి 1వ తేదీ నుంచి, బీమా సంస్థలు తమ కస్టమర్ల నుంచి KYC పత్రాలను సేకరించవలసి ఉంటుంది. అది కూడా క్లెయిమ్‌ చేసే సమయంలో కాకుండా, పాలసీని కొనుగోలు చేసే సమయంలోనే ఇవ్వాలి. 2023 జనవరి 1వ తేదీ నుంచి పునరుద్ధరించుకునే (Renewal) అన్ని రకాల బీమాల కోసం కూడా KYC పేపర్లను పాలసీదార్లు సమర్పించడం తప్పనిసరి.


రూల్స్‌ ఎందుకు మార్చారు?
గతంలో లేని కొత్త రూల్స్‌ ఇప్పుడు ఎందుకు తెచ్చారని ప్రశ్నించుకుంటే, పాలసీదార్ల ప్రయోజనం కోసమే నిబంధనలు మార్చారు. ఇకపై, పాలసీ క్లెయిమ్ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థల దగ్గర కస్టమర్ల పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. బీమా కంపెనీలకు కూడా ఇందులో ప్రయోజనం ఉంటుంది. రిస్క్‌ అంచనా, పాలసీ ధరల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడంలో KYC వివరాలు సహాయపడతాయి. మోసపూరిత క్లెయిమ్‌ల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.


కోవిడ్-19 వ్యాక్సిన్ 3 డోసులు తీసుకున్న పాలసీదార్లకు సాధారణ & ఆరోగ్య బీమా పాలసీల పునరుద్ధరణ మీద డిస్కౌంట్లు ఇవ్వడం గురించి ఆలోచించాలని బీమా కంపెనీలకు నియంత్రణ అథారిటీ (IRDAI) సూచించింది. కొవిడ్-19 సంబంధిత క్లెయిమ్‌లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జీవిత & జీవితేతర బీమా కంపెనీలను కోరింది.


కోవిడ్ హాస్పిటలైజేషన్ విషయంలో, లిస్టెడ్ ఆసుపత్రులు రోగుల నుంచి ముందస్తు నగదు వసూలు చేయకుండా నిర్ధరించుకోవాలని బీమా రెగ్యులేటర్ బీమా సంస్థలను కోరింది
బీమా పాలసీ ప్రకారం నగదు రహిత చికిత్స విధానం ఉన్నప్పటికీ, మొదటి & రెండో కోవిడ్ వేవ్స్‌ సమయంలో చికిత్స చేసేందుకు కొన్ని లిస్టెడ్‌ ఆసుపత్రులు ముందస్తు నగదు డిపాజిట్లు అడిగాయి, ఇది తప్పు
పాలసీదార్లకు జాప్యం లేకుండా కోవిడ్ సంబంధిత సహాయం అందించేందుకు బీమా సంస్థలు వార్ రూమ్‌ని సృష్టించాలి
మోసపూరిత చికిత్సలను కేసులను తగ్గించడానికి, లిస్టెడ్‌ ఆసుపత్రుల్లో ప్రోటోకాల్‌ ప్రకారం చికిత్స జరుగుతోందా, లేదా పరిశీలించాలని బీమా సంస్థలను రెగ్యులేటర్‌ కోరింది