Income Tax Saving Tips: వాస్తవానికి భారతీయులు చాలా కన్జర్వేటివ్ ఆలోచనలు కలిగి ఉంటుంటారు. నెలంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో అధిక శాతం పన్నులకు పోవటాన్ని మనలో చాలా మంది జీర్ణించుకోలేము. అయితే తెలివిగా పన్ను చట్టంలో అందిస్తున్న వివిధ మార్గాలను విరివిగా ఉపయోగించుకోవటం ద్వారా చెల్లించాల్సిన పన్నును భారీగా ఆదా చేసుకోవచ్చనే అవగాహన తక్కువ మందికి ఉంటుంది. ఈ క్రమంలో మన కుటుంబ సభ్యులైన భార్య పిల్లలు, తల్లిదండ్రులు మనకు ఎలా దోహదపడతారో ఇప్పుడు తెలుసుకుందాం..


దేశంలోని టాక్స్ పేయర్స్ తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి రోజు జూన్ 30, 2024. ఈ క్రమంలో చివరి క్షణాల్లో పెట్టుబడులు చేయటం ద్వారా చాలా మంది తమ పన్ను చెల్లింపు మెుత్తాలను తగ్గించుకోవాలని చూస్తున్నారు. సాధారణంగా టాక్స్ పేయర్స్.. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)లో డబ్బును డిపాజిట్ చేయడం, సుకన్య సమృద్ధి యోజన(SSY)లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపుల కోసం ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ వీటితో పాటు పన్ను ఆదాకు వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. 


వివిధ పన్ను మినహాయింపు మార్గాలు..


1. మీ తల్లిదండ్రులు ఆదాయపు పన్ను పరిధిలోకి రానట్లయితే.. మీరు ఇంటి ఖర్చుల కోసం వారి నుంచే రుణం తీసుకొని దానిపై వడ్డీ చెల్లించవచ్చు. ఇలా తల్లిదండ్రుల నుంచి తీసుకున్న డబ్బుపై వడ్డీని క్లెయిమ్ చేసుకోవటం ద్వారా పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇక్కడ పన్ను మినహాయింపు పొందడానికి.. వడ్డీని చెల్లించిన తర్వాత ధృవీకరించబడిన ధృవీకరణ పత్రాన్ని పొందడం మర్చిపోవద్దు. ఎందుకంటే దానిని సమర్పించిన తర్వాత మాత్రమే మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24B కింద గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇలా మినహాయింపు పొందవచ్చు. 


2. తల్లిదండ్రులను అద్దెదారులుగా చూపించటం ద్వారా కూడా టాక్స్ ఆదా చేసుకోవచ్చు. వారికి అద్దెను చెల్లించటం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(13A) కింద HRAపై పన్ను మినహాయింపులను పొందవచ్చు. 


3. ఇంట్లోని తల్లిదండ్రులకు పెద్ద వయస్సు రీత్యా అవసరాల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయటం ద్వారా కూడా మీరు పన్ను రాయితీని పొందవచ్చు. ఇక్కడ చట్టప్రకారం ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ క్రమంలో తల్లిదండ్రుల వయస్సు 65 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నట్లయితే రూ.25,000 వరకు చెల్లించిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే వారి వయస్సు 65 ఏళ్లు దాటినట్లయితే పాలసీకి ప్రీమియం రూపంలో చెల్లించిన మెుత్తంలో ఏడాదికి రూ.50 వేల వరకు పన్ను మినహాయింపులను పొందవచ్చు.   


4. పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80డి కింద తల్లిదండ్రుల వైద్య ఖర్చులపై కూడా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసేందుకు అర్హులు. దీని కోసం మీ తల్లిదండ్రుల వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలా ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.50 వేలు పన్ను మినహయింపులను పొందవచ్చు. 


5. టాక్స్ చెల్లింపుదారుని పిల్లలు ప్రీ-నర్సరీ లేదా నర్సరీ చదువుతున్నట్లయితే వారికి చెల్లించే స్కూల్ ఫీజులపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఈ మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయోజనాన్ని గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు పొందవచ్చు.  


6. పన్ను చెల్లింపుదారులు తమ భార్య లేదా భర్తతో చేసే కొన్ని ఉమ్మడి లావాదేవీలు సైతం ఆదాయపుపన్నును ఆదా చేయటంతో సహాయపడతాయి. ఈ క్రమంలో వారు జాయింట్ హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కునేందుకు ప్లాన్ చేసుకోవటం పన్ను ఆదాకు ఉన్న ఒక మార్గం. ఇందుకోసం సదరు భూమిని వారు తమ ఇద్దరిపై రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పన్ను చెల్లింపుదారుడు తన జీవిత భాగస్వామితో కలిసి హోమ్ లోన్‌పై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.  


7. ఇక్కడ జాయింట్ హోమ్ లోన్ నుంచి రెట్టింపు పన్ను ప్రయోజనం పొందుతారు. 80సి కింద ప్రిన్సిపల్ అమౌంట్‌పై మీరిద్దరూ రూ. 1.5-1.5 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 24 ప్రకారం రెండు ఆసక్తులపై రూ. 2-2 లక్షల పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ విధంగా మీరు రూ. 7 లక్షల వరకు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే గరిష్ఠంగా పొందే పన్ను ప్రయోజనం టాక్స్ పేయర్ తీసుకున్న హోమ్ లోన్ మెుత్తంపై ఆధారపడి ఉంటుంది. 


8. టాక్స్ పేయర్ స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడులను చేయటం ద్వారా వచ్చే మూలధన లాభాలపై రూ.లక్ష వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఇక్కడ మీ భార్యకు సంపాదన తక్కువగా ఉన్నా లేకపోతే ఆమె గృహిణి అయినట్లయితే ఆమెకు కొంత డబ్బు ఇచ్చి దానిని ఆమె పేరుపైనే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం ద్వారా ఆమె పొందే లాభాలపై రూ.లక్ష వరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. 


9. పన్ను చెల్లింపుదారులు తమ జీవితభాగస్వామితో కలిసి సంయుక్తంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం ద్వారా కూడా పన్ను మినహాయింపును ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ 8 ఏళ్ల పాటు ఎడ్యుకేషన్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపు ఆదాయపు పన్ను సెక్షన్ 80E కింద అందుబాటులో ఉంటుంది.