Overdraft Limits And Fees: ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అనేది బ్యాంకులు & ఆర్థిక సంస్థలు అందించే క్రెడిట్ సర్వీస్‌. మీ అకౌంట్‌లో రూపాయి బ్యాలెన్స్ లేకపోయినా.. మీ కరెంట్ లేదా సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. బ్యాంక్‌ను మీరు ఉపయోగించుకోగల పరిధిని ఇది పెంచుతుంది. మీ అకౌంట్‌ బ్యాలెన్స్‌కు మించి ఉపసంహరించుకునే మొత్తాన్ని "ఓవర్‌డ్రాఫ్ట్‌"గా పరిగణిస్తారు.

ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ద్వారా మీరు వాడుకోదగిన మొత్తం బ్యాంకుతో మీకున్న సంబంధంపై ఆధారపడి ఉంటుంది. మీకు ఇచ్చే ఓవర్‌డ్రాఫ్ట్‌ డబ్బుపై బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. అయితే, ఆమోదించిన మొత్తంపై కాకుండా మీరు ఉపయోగించుకున్న మొత్తంపై మాత్రమే వడ్డీ తీసుకుంటాయి. ఉదాహరణకు.. బ్యాంక్‌ మీకు రూ.50,000 ఓవర్‌డ్రాఫ్ట్‌కు అనుమతించినప్పుడు మీరు కేవలం రూ.20,000 మాత్రమే వాడుకుంటే, ఈ రూ.20,000కు మాత్రమే వడ్డీ చెల్లించాలి. 

ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఫీచర్స్‌

క్రెడిట్ పరిమితి: ముందుగా నిర్ణయించిన పరిమితి ఆధారంగా ఓవర్‌డ్రాఫ్ట్ మంజూరు అవుతుంది. ప్రతి కస్టమర్‌కు బ్యాంకుతో వారి సంబంధాన్ని బట్టి ఓవర్‌డ్రాఫ్ట్‌ మొత్తం మారవచ్చు.

వడ్డీ రేటు: ఓవర్‌డ్రాఫ్ట్‌పై వడ్డీని ప్రతిరోజూ లెక్కించి, నెలాఖరులో ఖాతాకు బిల్ చేస్తారు. ఓవర్‌డ్రాఫ్ట్‌ను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, చెల్లించాల్సిన వడ్డీని అసలుకు యాడ్‌ చేస్తారు, తర్వాతి వడ్డీని ఆ మొత్తంపై లెక్కిస్తారు.

జీరో రీపేమెంట్ ఛార్జీలు: సాధారణంగా, బ్యాంక్‌ లోన్‌ తీసుకున్నాక, గడువు కంటే ముందుగానే చెల్లిస్తే ప్రి-పేమెంట్ ఛార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తాయి. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంపై ఎటువంటి రీ-పేమెంట్‌ ఛార్జీలు ఉండవు. 

EMI లాంటి రీ-పేమెంట్‌ లేదు: ఓవర్‌డ్రాఫ్ట్ తిరిగి చెల్లించడానికి EMIలు అవసరం లేదు. మీరు రుణం తీసుకున్న మొత్తాన్ని, మీ దగ్గర డబ్బు అందుబాటులో ఉన్నప్పుడల్లా తిరిగి చెల్లించవచ్చు. ఒకసారి ఎంత రీపే చేయాలో మీరు ఎంచుకోవచ్చు. అయితే, రుణదాత తిరిగి చెల్లించమని సూచిస్తే నిబంధనల ప్రకారం చెల్లించాలి.

కనీస నెలవారీ చెల్లింపు: ఓవర్‌డ్రాఫ్ట్‌కు కనీస నెలవారీ చెల్లింపు లేదు. మీరు తీసుకున్న రుణం మొత్తం, ఆమోదం పొందిన పరిమితిలోపలే ఉండాలి. ఓవర్‌డ్రాఫ్ట్‌ను వెంటనే తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఆలస్యం చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌కు ఇబ్బంది కలిగించవచ్చు.

ఉమ్మడి ఓవర్‌డ్రాఫ్ట్‌ ఫెసిలిటీ: మీరు మరొకరితో (సహ-దరఖాస్తుదారుడి) కలిసి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి రుణానికి & దానిని సకాలంలో తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరు రుణగ్రహీతలు సమానంగా బాధ్యత వహిస్తారు. ఒకరు డిఫాల్ట్ అయితే, మరొకరు ఆ డబ్బు మొత్తానికి బాధ్యత వహించాలి. ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఒక వ్యక్తి డీఫాల్ట్‌ అయినా దాని పరిణామాలను ఇద్దరూ భరించాలి.

ఓవర్‌డ్రాఫ్ట్ ఫీజ్‌: ఖాతాదారు ఖాతా బ్యాలెన్స్ సున్నాకి చేరుకున్నప్పుడు కూడా బిల్లులు & ఇతర ఖర్చులను కవర్ చేయడానికి ఓవర్‌డ్రాఫ్ట్‌ ఫెసిలిటీ వీలు కల్పిస్తుంది. ఒక బ్యాంక్‌, తన కస్టమర్‌కు ఈ స్వల్పకాలిక రుణాన్ని అందించినప్పుడు ఫీజ్‌ వసూలు చేస్తుంది. సాధారణంగా, ఇందులో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించినందుకు వన్‌టైమ్‌ ఫీజ్‌, డ్రా చేసిన మొత్తంపై వడ్డీని చెల్లించాలి. 

మరో ఆసక్తికర కథనం: ఇల్లు కొనాలా లేదా అద్దెకు తీసుకోవాలా?- తెలివైన వాళ్లు ఏం చేస్తారు?