Sukanya Samriddhi Yojan Details In Telugu: మన దేశంలో ఏ ఇంట్లో అయినా అమ్మాయి పుడితే, సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఆ ఇంటికి వచ్చిందని భావిస్తారు. ఆ చిన్ని దేవతను అల్లారుముద్దుగా చూసుకుంటారు, ఆమె భవిష్యత్‌ గురించి కలలు కంటారు. చిన్నితల్లి చదువు నుంచి వివాహం వరకు, సాధ్యమైనంతవరకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు, మరింత కష్టపడి పని చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు, ఆడపిల్ల భవిష్యత్‌ కోసం ఆ తల్లిదండ్రులు పడే కష్టంలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా భరిస్తోంది. పేరెంట్స్‌ మీద భారాన్ని తగ్గించేందుకు కొన్ని సంక్షేమ పథకాలు నిర్వహిస్తోంది.


ఆడపిల్ల కనే పెద్ద కలలకు రెక్కలు ఇచ్చేలా, భారత ప్రభుత్వం, 10 ఏళ్ల క్రితం సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojan)ను ప్రజలకు పరిచయం చేసింది. ఈ పథకం (SSY) వచ్చాక, ఈ పదేళ్లలో కాలంలో, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. SSY ఖాతాల సంఖ్య & మదుపు చేస్తున్నవారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఖాతా మెచ్యూరిటీ సమయంలో వచ్చే పెద్ద మొత్తం డబ్బు ఆమె ఉన్నత చదువు కోసం లేదా వివాహం కోసం ఉపయోగపడుతుంది. అంటే, ఈ స్కీమ్‌ మీ కుమార్తె కోసం సంపద సృష్టిస్తుంది (Wealth Generator).


సుకన్య సమృద్ధి యోజన ప్రయోజనాలు 
2025 జనవరి 22తో, సుకన్య సమృద్ధి యోజన ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఈ స్కీమ్‌ను ఇష్టపడే వారికి కొదవ లేదు. దీనిలో ఉన్న అత్యంత పెద్ద ప్రయోజనం దీని రాబడి. ఏ ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకం ‍‌(small savings scheme)లో లేనివిధంగా, SSY డిపాజిట్లపై ప్రభుత్వం 8.20 శాతం వార్షిక వడ్డీ రేటును ఇస్తోంది. అంటే, ఇతర పొదుపు పథకాల కంటే ఇది మెరుగైన రాబడిని ఇస్తుంది. 


10 ఏళ్ల వయస్సు లోపు బాలికల కోసం పోస్టాఫీసులో ఈ పథకం కింద ఖాతా తెరవవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు ఆ ఖాతాను ఆపరేట్ చేయవచ్చు. ఈ ఖాతాలో ప్రతి సంవత్సరం కనిష్టంగా రూ. 250 - గరిష్టంగా రూ. 1.50 లక్షలు జమ చేయవచ్చు. ఖాతా తెరిచిన 15 సంవత్సరాల వరకు ఖాతాలో డబ్బు జమ చేయవచ్చు. ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. మీ కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తర్వాత, ఈ ఖాతా నుంచి డబ్బులో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. 


అధిక రాబడితో పాటు ఆదాయ పన్ను ప్రయోజనాలకు కూడా ఇది ఇస్తుంది. SSY పెట్టుబడులపై, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80C కింద, ఒక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.



సుకన్య సమృద్ధి యోజనలో కంటే గొప్ప మార్గం అన్వేషించాలి
సుకన్య సమృద్ధి యోజన మంచి రాబడిని ఇస్తున్నప్పటికీ, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాని మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాల తర్వాత బాలికల ఉన్నత విద్యకు ఇది మంచి ఆప్షన్‌ కాదు. ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత డబ్బు విత్‌డ్రా చేయడం వల్ల మెరుగైన రాబడి రాదు. అదే సమయంలో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా ఇంతకంటే మంచి రాబడిని పొందవచ్చు & అవసరమైతే మధ్యలో డబ్బును విత్‌డ్రా చేయడంలోనూ ఎటువంటి సమస్య ఉండదు. గత 10 సంవత్సరాల్లో విద్యా వ్యయం చాలా పెరిగింది. కాబట్టి, గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షలకు మాత్రమే డిపాజిట్ చేయడం సరికాదు, దీనిని పెంచాలి.


మరో ఆసక్తికర కథనం: సీనియర్‌ సిటిజన్స్‌కు భారీ శుభవార్త - అటల్ పెన్షన్ యోజన కింద నెలనెలా రూ.10 వేలు!