Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), ఫిబ్రవరి 01వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమర్పించనున్నారు. ప్రస్తుతం, దేశంలోని అందరి దృష్టి ఈ బడ్జెట్ పైనే ఉంది. సామాన్యులు, శ్రీమంతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ప్రతీ ఒక్కరు బడ్జెట్ డే కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojna)కి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో పెద్ద ప్రకటన చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక భద్రతను పెంపొందించే చొరవలో భాగంగా, ఈ పథకం కింద పొందే కనీస పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం, అటల్ పెన్షన్ యోజన (APY) నెలవారీ పెన్షన్ కనీస మొత్తం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఉంది. ఒక వ్యక్తి ఎంత పెన్షన్ పొందుతారు అనే విషయం అతని కాంట్రిబ్యూషన్ మీద ఆధారపడి ఉంటుంది.
నెలవారీ పింఛను రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు
అటల్ పెన్షన్ యోజన కింద ప్రస్తుతం అందుతున్న పెన్షన్‌ను పెంచే ప్రతిపాదనకు కేంద్ర సర్కారు ఆమోదం తెలిపే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మినిమమ్ గ్యారెంటీ మొత్తాన్ని రూ. 10,000కు పెంచే ప్రతిపాదన చివరి దశలో ఉందని, బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని ఆ కథనాలను బట్టి తెలుస్తోంది.
అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అమలవుతున్న పింఛను పథకం. దీని లక్ష్యం.. పేదలకు & అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారికి వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందించడం. 2015-16 సంవత్సరంలో, 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేసిన వారికి, ఇప్పుడు, నెలవారీ పెన్షన్ రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు లభిస్తోంది.
APY ఇతర ప్రయోజనాలు, వివరాలు
అటల్ పెన్షన్ యోజనలోని అతి పెద్ద ఫీచర్ డెత్ బెనిఫిట్స్ కలిగి ఉండడం. ప్రమాదవశాత్తు లబ్ధిదారుడు మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్స్ అందుతాయి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు అటల్ పెన్షన్ యోజన కింద అకౌంట్ ప్రారంభించవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకున్న వ్యక్తి పేరిట బ్యాంకులో లేదా పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా (savings account) ఉండాలి. సేవింగ్స్ ఖాతా & ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా ఉండాలి. పథకం ప్రయోజనాలను పొందడానికి, పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్‌ను తీసుకోవచ్చు లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, ఫారంలో సంబంధిత వివరాలను పూరించి పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి. చివరగా.. ఆధార్ కార్డు జిరాక్స్ సహా ఇతర అవసరమైన పత్రాలతో కలిపి ఆ ఫారాన్ని సమర్పించాలి.
2022 అక్టోబర్ 01 తర్వాత ఆదాయ పన్ను చెల్లించిన లేదా చెల్లిస్తున్న వ్యక్తులు APYలో చేరడానికి అనర్హులు.
మరో ఆసక్తికర కథనం: భారత బడ్జెట్‌లో బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్థి - తేదీలు, సమయాల్లో విప్లవాత్మక మార్పులు