Revolutionary Changes In Union Budget Dates And Times: కేంద్ర బడ్జెట్ 2025 సమర్పణకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 01 ఫిబ్రవరి 2025, ఉదయం 11 గంటలకు, దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) మోదీ ప్రభుత్వ 14వ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు, యావత్ దేశం ముందుకు తీసుకొస్తారు. అయితే, కేంద్ర బడ్జెట్‌ను ఏటా ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టాలన్న సాంప్రదాయం గతంలో లేదు, కాలనుగుణంగా మార్పులు జరిగాయి. ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టాలని మన దేశంలో ఎప్పుడు నిర్ణయించారో తెలుసా, దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?.
ఉదయం 11 గంటల టైమ్‌ను ఎవరు సెట్ చేశారు?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, ఫిబ్రవరి చివరి పనిదినం (సాధారణంగా ఫిబ్రవరి 28వ తేదీ) నాడు సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ సమర్పించడం ప్రారంభించారు. భారతదేశం - యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య సమయ వ్యత్యాసం కారణంగా ఈ సమయాన్ని ఎంచుకున్నారు. భారతదేశ సమయం బ్రిటిష్ వేసవి సమయం కంటే 5.30 గంటలు ముందు ఉంటుంది. మన దగ్గర సాయంత్రం 5 గంటలకు (IST) బడ్జెట్‌ను సమర్పించడం అంటే, బ్రిటన్‌లో పగటిపూట ప్రకటించడం అని అర్ధం.
కానీ, 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) ఈ పద్ధతిని మార్చారు. వందల ఏళ్లు పోరాడి స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత కూడా బ్రిటిషర్ల పద్ధతులు మనకు ఎందుకుని ప్రశ్నించారు. 1998 - 2002 మధ్యకాలంలో భారత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా, భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పించడం ప్రారంభించారు. బడ్జెట్‌లో ఉన్న సమాచారాన్ని పార్లమెంట్ సభ్యులు అర్ధం చేసుకునే సమయం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ సమయాన్ని ఎంచుకున్నారు. అలా.. 2016 వరకు, ఆర్థిక మంత్రులందరూ ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించారు.
బడ్జెట్ తేదీ ఫిబ్రవరి 01వ తేదీకి ఎందుకు మారింది?
దాదాపు 20 ఏళ్ల పాటు, కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం నాడు సమర్పించారు. 2017లో ఈ సాంప్రదాయం మారింది. 2017 నుంచి, ఫిబ్రవరి 01న బడ్జెట్ ప్రవేశపెడతామని అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్‌ను సమర్పిస్తే, ఏప్రిల్ 01 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి కొత్త విధానాలను రూపొందించడానికి కేంద్రానికి తగినంత సమయం లభించడం లేదని జైట్లీ వివరించారు. ఫిబ్రవరి 01న బడ్జెట్‌ను ప్రవేశపెడితే, సర్కారుకు తగిన సమయం దొరుకుందని వెల్లడించారు. ఏప్రిల్ 01న బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారణం ఇదే.
2017 నుంచి, ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ సమయాన్ని, తేదీని మార్చింది బీజేపీ ప్రభుత్వాలే కావడం విశేషం.
మరో ఆసక్తికర కథనం: ఆర్థిక సంస్కరణల నుంచి పన్ను విధానాల వరకు - ఈ బడ్జెట్‌లో గమనించాల్సిన కీ పాయింట్స్