Buying or Renting A Home: పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కొనాలా లేదా నెలకు చిన్న మొత్తంలో చెల్లిస్తూ అద్దెకు తీసుకోవాలా?. ఏది తెలివైన పని, ఏది కాదు అనే సందిగ్ధం తరచుగా ప్రజలను వెంటాడుతుంది. చాలా మంది, ఇల్లు కొని తమకంటూ ఒక స్థిర నివాసం ఉందని భావిస్తారు. నెలనెలా అద్దె చెల్లించే ఇబ్బంది నుంచి తప్పించుకుంటారు. మరికొందరు, అద్దె ఇంట్లో ఉంటూ, మిగిలిన డబ్బును వేరే చోట పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడిపై రాబడి సంపాదిస్తారు. ఈ ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్లు?.
నివాస ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్
ఇటీవలి కొన్ని రిపోర్ట్స్‌ను బట్టి, సొంత ఇల్లు కొనాలనే కోరిక ప్రజల్లో పెరిగింది. ధరల పెరుగుదల దీనికి కారణమని చెప్పవచ్చు. మన దేశంలోని 13 పెద్ద నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ (Residential property)కి డిమాండ్ పెరిగిందని గతేడాది జులై-సెప్టెంబరు మధ్య ఉన్న డేటా వెల్లడించింది. ఇది, ఏడాది ప్రాతిపదికన 7 శాతం పెరుగుదలను చూపుతోంది. ఇల్లు అద్దెకు తీసుకోవడంలో ఏడాది ప్రాతిపదికన 3.1 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.
సొంత ఇంటి కోసం పెరుగుతున్న ఆరాటం
భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరును ఉదాహరణగా చూద్దాం. బెంగళూరు మహా నగరంలో, ప్రతి త్రైమాసికానికి (3 నెలలకు) రెసిడెన్షియల్ ప్రాపర్టీ డిమాండ్ 18.2 శాతం చొప్పున పెరుగుతుండగా, ఇంటి అద్దె డిమాండ్ 2.8 శాతం తగ్గింది. సొంత ఇల్లు కొనుక్కోవడానికి ప్రజల ఆరాటాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. దిల్లీ, ముంబై వంటి మహా నగరాల్లోనూ ఇదే పరిస్థితి. సొంత ఇంటి డిమాండ్‌తో పోలిస్తే, ప్రజలు ఇప్పుడు అద్దెకు ఇల్లు తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు దీనినీ గుర్తుంచుకోండి
బెల్వెడెరే అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీ మేనేజింగ్ పార్టనర్ ఆశిష్ పడియార్ చెప్పిన ప్రకారం... అద్దెకు ఇల్లు తీసుకోవడం మంచిదా లేదా కొనడం మంచిదా అనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్‌లు, దేశీయ మార్కెట్‌ను విశ్లేషించిన తర్వాత, ఇళ్ల కొనుగోలుకు ప్రజల్లో డిమాండ్ పెరిగినట్లు గుర్తించారు. అద్దెలు పెరుగుతుండటంతో ప్రజలు సొంత ఇంటిపై ఆసక్తి చూపుతున్నారు. మొదటిసారి ఇల్లు కొనే చాలా మంది కొనుగోలుదారులు గృహ రుణ (Home Loan) తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏమిటంటే... మన దేశంలో ఆస్తుల అద్దె ఆదాయం 3-3.5 శాతం ఉండగా, గృహ రుణంపై వడ్డీ 8.25-50 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక వడ్డీకి ఇల్లు కొంటే ప్రయోజనం ఉండదు.
నిర్ణయం తీసుకునే ముందు వేయాల్సిన లెక్క ఇదీ
రెంట్ హౌస్ అయితే ఎంత అద్దె చెల్లించాలి, సొంత ఇల్లు అయితే ఎంత EMI చెల్లించాలి అనే లెక్క వేసి చూడండి. ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉంటే ఇల్లు అద్దెకు తీసుకోవడం అర్థవంతంగా ఉంటుంది. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు, రుణ మొత్తాన్ని సాధ్యమైనంత కనిష్టంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే, లోన్ అమౌంట్ పెరిగితే ఆ రుణంపై చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది, ఫైనల్‌గా EMI పెరుగుతుంది. దీర్ఘకాలంలో, మీ చెల్లించే డబ్బు మీ ఆస్తి విలువను మించిపోతుంది.
మరో ఆసక్తికర కథనం: మీ కుమార్తెకు కలలకు రెక్కలు ఇవ్వండి, సంపదను గిఫ్ట్‌గా అందించండి - సూపర్ స్కీమ్ ఇది