Income Tax Notice: 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో, ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ల ఫైలింగ్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు, దాదాపు 6.82 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేశారు. వీరిలో కొందరికి ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసులు అందాయి. రిటర్న్‌లో తప్పుడు మినహాయింపులు చూపిన, తప్పుడు క్లెయిమ్‌లు చేసిన, పూర్తి వివరాలు ఇవ్వని వాళ్లకు డిపార్ట్‌మెంట్ నోటీసులు అందాయి.
నోటీసులు స్వీకరించిన వాళ్లలో జీతం తీసుకునే పన్ను చెల్లింపుదార్లు (salaried employees) కూడా ఉన్నారు. ITRలో వాళ్లు క్లెయిమ్ చేసిన డిడక్షన్స్, ఎగ్జమ్షన్స్‌కు సంబంధించిన రుజువులు కోరుతూ ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్లకు నోటీసులు పంపింది. డిపార్ట్‌మెంట్ అడిగిన ప్రకారం సరైన రుజువులు చూపించకపోతే, చట్ట ప్రకారం చర్యలు తప్పవు. టాక్స్ కట్టకుండా తప్పించుకోవడానికి అడ్డదార్లు తొక్కినవాళ్లకు జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడొచ్చు.
నోటీసు వస్తే ఏం చేయాలి?
ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసు వస్తే, ముందు టెన్షన్ పడొద్దు. ఐటీ డిపార్ట్‌మెంట్ ఆ నోటీసులో ఏ విషయాల గురించి అడిగిందో క్షుణ్నంగా అర్ధం చేసుకోండి. దీనికి తోడు, ఆ నోటీసుకు కచ్చితంగా సకాలంలో స్పందించాలి. నిర్లక్ష్యంగా వదిలేసినా, ఆలస్యంగా సమాధానం ఇచ్చినా పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. ఐటీఆర్‌లో పేర్కొన్న వివరాలకు సంబంధించి, ఆదాయ పన్ను విభాగం ఏవైనా ప్రూఫ్ డాక్యుమెంట్లు అడిగితే వాటిని సమర్పించండి. చెల్లింపులకు సంబంధిత రసీదులు, ఓచర్లు, ఇన్‌వాయిస్‌లు, ఇతర పత్రాలన్నీ కచ్చితంగా ఐటీ డిపార్ట్‌మెంట్‌కు పంపాలి.
రిప్లై ఇవ్వడానికి ఎంత టైమ్ ఇస్తుంది?
ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసు అందుకున్న తర్వాత, పన్ను చెల్లింపుదారు ప్రతిస్పందించడానికి సాధారణంగా 15 రోజుల సమయం ఉంటుంది. ఆ టైమ్‌లో మీరు అందుబాటులో ఉండని పరిస్థితి ఉన్నా, డిపార్ట్‌మెంట్ అడిగిన డాక్యుమెంట్లను తీసుకురాలేమని భావించినా, టైమ్ పిరియడ్ పెంచాలని లోకల్ అసెస్‌మెంట్ ఆఫీసర్‌కు రిక్వెస్ట్ పంపవచ్చు. పరిస్థితిని బట్టి, ఆ ఆఫీసర్ గడువు పొడించవచ్చు లేదా నిరాకరించవచ్చు.
రిప్లై ఎలా ఇవ్వాలి?
ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అందితే, డిపార్ట్‌మెంట్ అడిగిన అన్ని ప్రూఫ్ డాక్యుమెంట్స్‌ను చకచకా సిద్ధంగా పెట్టుకోవాలి. నోటీసుకు సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ సలహా కూడా తీసుకోవచ్చు. ముందుగా ఒక చిత్తు మీద మీ రిప్లై రాసుకోండి. దానిలో ఏవైనా సవరణలు ఉంటే చేసి, ఫైనల్ కాపీని రెడీ చేయండి. మీకు నోటీసు ఏ మార్గంలో వచ్చిందో (ఎలక్ట్రానిక్ పద్ధతిలో లేదా భౌతికంగా), అదే మార్గంలో మీ ఫైనల్ రిప్లై కాపీని, రుజువు పత్రాలను పంపండి.
మూన్‌లైటింగ్ కలకలం
ఈ ఏడాది, మూన్‌లైటింగ్ (Moonlighting) ద్వారా ఆదాయం సంపాదించిన ఉద్యోగుల్లో కొందరికి ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపింది. మెయిన్ జాబ్‌తో పాటు మరో జాబ్/జాబ్స్ చేస్తూ అదనపు ఆదాయం సంపాదించడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఈ పదం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. మూన్‌లైటింగ్ చేస్తున్న ఉద్యోగాల్లో కొందరు.. తమ అసలు ఉద్యోగ ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించారు గానీ, కొసరు ఉద్యోగాల నుంచి సంపాదించిన డబ్బును కలపలేదు. అలాంటి వాళ్లకు ఐటీ నోటీసులు అందాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే కాకుండా, 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల్లో సంపాదించిన డబ్బుకు కూడా లెక్కలు చెప్పమంటూ ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపింది.
మరో ఆసక్తికర కథనం: అదానీ విల్మార్ నుంచి బయటకొచ్చే ఆలోచనలో అదానీ, తన వాటా అమ్మేస్తాడట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial