Income Tax Return Filing 2024: ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 కోసం ఆదాయ పన్ను పత్రాలు సమర్పణ 2024 ఏప్రిల్ 01 నుంచి ప్రారంభమవుతుంది, జులై 31 (31 జులై 2024) వరకు సమయం ఉంటుంది. ఈ గడువులోగా ఆదాయాన్ని ప్రకటించలేకపోయిన వాళ్లు, ఆలస్య రుసుముతో, 2024 ఆగస్టు 01 నుంచి ITR ఫైల్ చేయవచ్చు, 2024 డిసెంబర్ 31 వరకు ఈ అవకాశం ఉంటుంది.
ITR ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్న వాళ్లు ముందుగా కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా, AIS - ఫామ్-26AS మధ్య తేడాలు అర్ధం చేసుకోవాలి. దీనివల్ల, ఫైలింగ్ పని మరింత సులభంగా మారుతుంది.
AIS అంటే ఏంటి? (What is AIS?)
ఆదాయ పన్ను విభాగం, 2021లో, కంప్లైయెన్స్ పోర్టల్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను (AIS) ప్రారంభించింది. ఇది వ్యక్తిగతం. ఒక టాక్స్ పేయర్ (Taxpayer), ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఆర్థిక లావాదేవీల గురించిన సమాచారం AISలో ఉంటుంది. ఒకవేళ మీరు ఏ సమాచారం గురించి మరిచిపోయినా, ఈ స్టేట్‌మెంట్ మీకు గుర్తు చేస్తుంది.
AISలో ఎలాంటి సమాచారం ఉంటుంది? (What information does AIS contain?)
టాక్స్ రిఫండ్, TDS లేదా TCS, వివిధ పెట్టుబడులపై వచ్చిన వడ్డీ, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, షేర్ లావాదేవీల వంటి చాలా అంశాలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తంలో మీకు వచ్చిన ఆదాయాలు AISలో కనిపిస్తాయి. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను మీరు వివరంగా పరిశీలిస్తే, ITR ఫైలింగ్ సమయంలో ఎలాంటి సమాచారం మిస్ కాదు. AIS డేటాను PDF, JSON, CSV ఫార్మాట్లలో యాక్సెస్ చేయవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫామ్ 26AS అంటే ఏంటి? (What is Form 26AS?)
ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లోని పన్ను మినహాయింపులు, వసూళ్లు, పాన్ గురించిన వివరాలను ఇది చెబుతుంది.
ఫామ్ 26ASలో ఎలాంటి సమాచారం ఉంటుంది? (What information does Form 26AS contain?)
ఫామ్ 26ASలో.. TDS, సెల్ఫ్ అసెస్‌మెంట్ టాక్స్, అడ్వాన్స్ టాక్స్, టాక్స్ రిఫండ్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, హై వాల్యూ ట్రాన్జాక్షన్లు, టాక్స్ డిడక్షన్ వంటి సమాచారం ఉంటుంది.
AISని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download AIS?)
- ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ లో యూజర్ ఐడీ (పాన్ నంబర్), పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ కావాలి.
- మెనూలో కనిపించే AIS మీద క్లిక్ చేయండి. మిమ్మల్ని మరొక పేజీలోకి రీడెరెక్ట్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి.
- కొత్త పేజీలో AIS ఓపెన్ అవుతుంది.
- అక్కడ, మీకు కావలసిన ఫైనాన్షియల్ ఇయర్‌ను ఎంచుకుని, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ చూడడానికి AIS బాక్స్‌లో క్లిక్ చేయండి. రిపోర్ట్ ఓపెన్ అవుతుంది.
- ఇందులో, పార్ట్-Aలో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పార్ట్-Bలో మీ లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫామ్-26AS ఎలా డౌన్‌లోడ్ చేయాలి? (How to download Form-26AS?)
- ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ లోకి లాగిన్ అవ్వండి.
- మెనూలో కనిపించే 'ఈ-ఫైల్' బటన్ మీదకు కర్సర్‌ను తీసుకెళ్లగానే మరో డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.
- అందులో, 'ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్' ఎంచుకోండి. అందులో 'వ్యూ ఫామ్ 26AS'పై క్లిక్ చేయండి.
- అక్కడ కనిపించిన బాక్స్‌లో 'కన్ఫర్మ్' బటన్ నొక్కండి. మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ కనిపించే బాక్స్‌లో టిక్ చేసి, 'ప్రొసీడ్'పై క్లిక్ చేయండి.
- ఇక్కడ, 'వ్యూ టాక్స్ క్రెడిట్' (ఫామ్ 26AS/ఆన్యువల్ టాక్స్ స్టేట్‌మెంట్) అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ ఎంచుకోండి. 'వ్యూ యాజ్' బాక్స్‌లో HTML సెలెక్ట్ చేయండి.
- ఫాం 26AS ఓపెన్ అవుతుంది. దానిని డౌన్‌లోడ్ చేయండి.
మరో ఆసక్తికర కథనం: దేశంలో జాబుల జాతర, ఒకే నెలలో EPFOలోకి 15 లక్షల మంది మెంబర్లు