Income Tax Return Filing 2024: ఈ నెల 15వ తేదీ తర్వాతి నుంచి ఆదాయ పన్ను పత్రాల దాఖలు చేస్తున్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌కు సంబంధించి, తమ వార్షికాదాయం పన్ను పరిధిలోకి రాకపోతే రిటర్న్ (ITR 2024) దాఖలు చేయాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తున్నారు. ఇది సగమే నిజం. ఒక వ్యక్తి (Individual) ఆదాయ పన్ను పరిధిలోకి రాకపోతే, ITR ఫైల్ చేయాలా, వద్దా అన్నది ఐచ్చికం. కానీ.. ఐటీఆర్ దాఖలు చేస్తే ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు.
ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా, మీ ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడం తప్పనిసరి కాదు. ప్రాథమిక మినహాయింపు పరిమితి అనేది ఆ వ్యక్తి ఎంచుకున్న ఆదాయ పన్ను విధానంపై ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో, 60 ఏళ్లలోపు వ్యక్తికి ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షలు. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి రూ. 3 లక్షలు. సూపర్ సీనియర్ సిటిజన్లకు ఈ లిమిట్ రూ. 5 లక్షలు. కొత్త పన్ను విధానంలో, ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు.
నిల్ లేదా జీరో రిటర్న్ అంటే ఏంటి?
మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాదని చెప్పడానికి లేదా పన్ను విధించదగిన ఆదాయం లేదని నిరూపించడానికి నిల్ లేదా జీరో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేస్తారు. దీనివల్ల, ఒక్క రూపాయి టాక్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. ఒక వ్యక్తి ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పుడు లేదా రిబేట్ తర్వాత పన్ను బాధ్యత సున్నాకు (0) తగ్గినప్పుడు నిల్ రిటర్న్ దాఖలు చేస్తారు. ఇలాంటి కేస్‌లో దాఖలు చేసిన రిటర్న్‌ను నిల్ ఐటీఆర్‌గా పిలుస్తారు.
నిల్ ఐటీఆర్ దాఖలు చేస్తే ప్రయోజనాలు ఉన్నాయా?
-- నిల్ ఐటీఆర్ సమర్పించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి, ఇది నిల్ రిటర్న్ సమర్పించడం తెలివైన పని.
-- ఆదాయ పన్ను రిటర్న్ మీ ఆదాయానికి అధికారిక రుజువుగా ఉపయోగపడుతుంది. మీకు నగదు రూపంలో జీతం వస్తుంటే దానికి సంబంధించిన రుజువులు మీ దగ్గర ఉండకపోవచ్చు. రిటర్న్ దాఖలు చేయడం ద్వారా ఆదాయ రుజువును మీరు సృష్టించొచ్చు.
-- బ్యాంక్‌ల విషయంలోనూ ఐటీఆర్ ఉపయోగపడుతుంది. గరిష్ట రుణం తీసుకోవడానికి సాయం చేస్తుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా కార్ లోన్.. ఏదైనా సరే, అన్ని చోట్లా బ్యాంకులు మిమ్మల్ని కనీసం రెండేళ్ల ఐటీఆర్ అడుగుతాయి.
-- క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు పే స్లిప్‌తో పాటు ఆదాయ రుజువుగా ఐటీఆర్ ఇవ్వాలి.
-- పన్ను వాపసు క్లెయిమ్ చేయడానికి నిల్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు. బ్యాంక్ లేదా ఏదైనా కంపెనీ మీ ఆదాయం నుంచి TDS కట్ చేస్తే, మీ ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే, నిల్ రిటర్న్ ఫైల్ చేయడం ద్వారా టాక్స్ రిఫండ్ పొందొచ్చు.
-- విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా రిటర్న్‌లు ఉపయోగపడతాయి. మీరు కెనడా, అమెరికా లేదా మరేదైనా దేశానికి వెళ్లాలనుకుంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ సమయంలో వీసా అధికారి మీ ఆదాయం లేదా నికర విలువను తెలుసుకోవడానికి ITRను అడుగుతారు.
పన్ను చెల్లించదగిన ఆదాయం లేనప్పటికీ, నిల్ ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఎలాంచి నష్టం ఉండదు. కానీ ఖచ్చితంగా కొన్ని ప్రయోజనాలు మాత్రం పొందొచ్చు. మీకు ఎప్పుడైనా ఆకస్మిక అవసరం వచ్చి బ్యాంక్ లోన్ కోసం వెళితే, ఆ పరిస్థితిల్లో నిల్ ఐటీఆర్ మీకు ఉపయోగపడుతుంది.
మరో ఆసక్తికర కథనం: బిల్ కట్టడమే కాదు, క్యాష్‌బ్యాక్ కూడా రావాలి - బెస్ట్ పేమెంట్ యాప్స్ ఇవి