Income Tax Return Filing 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌, వచ్చే నెలలో (జులై 2024), వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ సమర్పించనున్నారు. మోదీ 2.0 ప్రభుత్వంలో ఆమె ఐదు పూర్తిస్థాయి బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ సమర్పించారు. 2024 పూర్తి స్థాయి బడ్జెట్‌ కోసం ఇంకా నెల రోజుల సమయమే ఉంది. 


2020 బడ్జెట్‌లో తక్కువ పన్ను స్లాబ్‌లతో కొత్త పన్ను విధానాన్ని నిర్మల సీతారామన్‌ ప్రకటించారు. కాబట్టి, ఇప్పుడు కూడా పన్ను చెల్లింపుదార్లకు ఆమె కొంత ఉపశమనం కల్పిస్తారన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.


రాయిటర్స్ రిపోర్ట్‌ ప్రకారం, దేశంలో వినియోగ వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. 2023-24లో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం (Indian Economy Growth Rate 2023-24) వృద్ధి చెందగా, వినియోగ వృద్ధి రేటు (Consumption Growth Rate) మాత్రం ఇందులో సగమే ఉంది. అంటే... ప్రజలు వస్తువులు లేదా సేవల కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వస్తు & సేవల వినియోగం పెరిగితేనే ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుంది, లేకపోతే నత్తనడక నడుస్తుంది. కొన్ని వర్గాలకు వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించడం వల్ల వారికి డబ్బు ఆదాయ అవుతుంది. ఆ డబ్బును వినియోగం కోసం లేదా పొదుపు కోసం కేటాయిస్తారు. ఫలితంగా వినియోగ రేటు, దేశ ఆర్థిక వృద్ధి మెరుగుపడతాయి. కాబట్టి.. ప్రజల్లో వినియోగ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈసారి పన్ను రేట్లలో కోతలు ఉండొచ్చు.


పన్ను రేటు తగ్గిస్తే ఎక్కువగా లాభపడేది ఎవరు?


పాత పన్ను విధానంతో పాటు, 2020లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం కూడా ఇప్పుడు అమల్లో ఉంది. కొత్త విధానం ప్రకారం... రూ. 15 లక్షల వరకు ఉన్న వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు 5-20% టాక్స్‌ చెల్లించాలి. రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి 30% పన్ను వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఆదాయం రూ. 3 లక్షల నుంచి 15 లక్షలకు ఐదు రెట్లు పెరిగితే, వ్యక్తిగత పన్ను రేటు ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది అసమంజసంగా, చాలా ఎక్కువగా ఉందని టాక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. 


కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత... సంవత్సరానికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు పన్ను మినహాయింపులు పొందొచ్చని సమాచారం.


2024 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో మార్పులు?


2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో, మధ్య తరగతి ప్రజల ఆదాయం పెంచడం, వారి జీవితాలను మెరుగుపరచడంపై తన ప్రభుత్వం దృష్టి పెడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. కాబట్టి, ఆదాయ పన్ను రేటు తగ్గింపుపై ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి.


బడ్జెట్ 2024లో పన్నుల విషయంలో పరిశ్రమ వర్గాలు కూడా కొన్ని అంచనాలు పెట్టుకున్నాయి. పన్ను చెల్లింపుదార్లకు, ముఖ్యంగా చిన్న ఆదాయ వర్గాలకు పన్ను ఉపశమన చర్యలను ప్రకటించాలని ఆశిస్తున్నాయి. పన్నుల తగ్గిస్తే వినియోగం పెరిగి పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, 2024-25 పూర్తి బడ్జెట్‌లో, కనిష్ట శ్లాబ్‌లో ఉన్న వ్యక్తులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలని CII ప్రెసిడెంట్ సంజీవ్ పురి కూడా చెప్పారు.


మరో ఆసక్తికర కథనం: కుప్పకూలిన పసిడి రేటు, కొనేందుకు మంచి టైమ్‌! - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి