Best Payment Apps 2024 For Cashbacks And Rewards: కరెంట్ బిల్, ఎల్‌ఐసీ లేదా మరో బిల్.. ఇలాంటి వాటిని చెల్లించడానికి ఒకప్పుడు గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చున్నారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం ప్రారంభించిన ఈ డిజిటల్ యుగంలో, దాదాపుగా ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం ప్రారంభించారు. ఆన్‌లైన్ పేమెంట్స్ చేయడానికి కొన్ని అప్లికేషన్స్ (Apps) అవసరం. మన దేశంలో, బిల్ పేమెంట్స్ కోసం చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి మధ్య పోటీ పెరిగే సరికి, కస్టమర్లను నిలుపుకోవడానికి & కొత్త వాళ్లను ఆకర్షించడానికి నజరానాలు ఇస్తున్నాయి.
కొన్ని యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తే.. యూజర్లకు క్యాష్ బ్యాక్‌లు, స్క్రాచ్ కార్డ్‌లు, రివార్డ్ పాయింట్లు, ఇతర కూపన్స్‌ను ఆయా ఫిన్‌టెక్ కంపెనీలు బహుమతిగా అందిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్స్ ఇస్తున్నాయి. అలాంటి వాటి ద్వారా చెల్లింపులు చేస్తే కస్టమర్లకు కొంత క్యాష్ వెనక్కు (క్యాష్‌బ్యాక్) వస్తుంది, కొంత డబ్బు ఆదా అవుతుంది.
క్యాష్‌బ్యాక్స్ ఇస్తున్న టాప్-5 యాప్ ఇవి:
1. క్రెడ్ (Cred)
ప్రస్తుతం ఈ యాప్ బాగా పాపులర్ అయింది, ఫాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. దీని ద్వారా యూజర్లకు చాలా డిస్కౌంట్స్, ఆఫర్స్ అందుతున్నాయి. ముఖ్యంగా, క్రెడ్ ద్వారా క్రెడిట్ కార్డ్ పేమెంట్లు చేస్తే కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాదు, కొన్ని డిస్కౌంట్ కూపన్లు కూడా అందుతున్నాయి.
2. పేటీఎం (Paytm)
భారత ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేమెంట్ యాప్ ఇది. రీఛార్జ్, బిల్ చెల్లింపులు మొదలైన సేవలపై క్యాష్‌బ్యాక్ అందించడంలో ఈ కంపెనీకి చాలా పేరుంది. ఈ యాప్‌లో చాలా కూపన్‌లను పొందొచ్చు. ఫలితంగా షాపింగ్ సమయంలో డిస్కౌంట్లకు అర్హత లభిస్తుంది. పేటీఎం యాప్ ద్వారా... ఆన్‌లైన్ షాపింగ్ నుంచి విమాన టిక్కెట్ల బుకింగ్ వరకు అన్నింటిని ఒకే ఫ్లాట్‌ఫామ్ నుంచి చేయవచ్చు.
3. మొబిక్విక్ (Mobikwik)
మొబిక్విక్ యాప్ ద్వారా ఎవరికైనా చాలా సులభంగా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయొచ్చు. ఈ యాప్ తన యూజర్లకు ఆర్థిక సేవలను, ముఖ్యంగా క్రెడిట్ (రుణం) సర్వీసులను అందిస్తోంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు భారీ క్యాష్‌బ్యాక్, ఇతర ఆఫర్‌లను పొందుతున్నారు.
4. గూగుల్ పే (Google Pay)
ఈ రోజుల్లో గూగుల్ పే యాప్‌నకు కూడా చాలా జనాదరణ ఉంది. ఆన్‌లైన్ చెల్లింపుల విషయంలో సురక్షితమైన యాప్‌గా ఇది పేరు తెచ్చుకుంది. ఈ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై కస్టమర్లకు కొన్ని క్యాష్ బ్యాక్‌లు, స్క్రాచ్ కూపన్‌లు లభిస్తాయి. ఈ క్యాష్ బ్యాక్‌లను ఉపయోగించి, వినియోగదార్లు ఈ యాప్ ద్వారా కొన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. మంచి క్యాష్ బ్యాక్స్ ఇస్తున్న పేమెంట్ యాప్ ఇది. భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.
5. ఫోన్ పే (PhonePe)
ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని మరో ఆన్‌లైన్ చెల్లింపుల యాప్ ఫోన్ పే. ఈ యాప్‌ను భారత ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. రూ.10 పెట్టి బజ్జీలు తిన్నా ఫోన్ పే చేస్తున్నారు. ఈ యాప్ ద్వారా బిల్లుల చెల్లింపు మాత్రమే కాదు, ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు తక్షణమే డబ్బులు పంపొచ్చు. ఈ యాప్ కూడా కూపన్‌లు, క్యాష్ బ్యాక్‌లు సహా చాలా రకాల ఆఫర్‌లను అందిస్తోంది. వాటిని ఫోన్ రీఛార్జ్, ఇతర బిల్లుల చెల్లింపుల కోసం వాడుకోవచ్చు. ఫోన్ పే తన కస్టమర్లకు కొన్ని స్క్రాచ్ కార్డ్‌లను కూడా ఇస్తోంది. ఈ స్క్రాచ్ కార్డ్‌లను ఫాస్టాగ్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్, బిల్లు చెల్లింపులు వంటివాటికి ఉపయోగించుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: క్రెడ్, ఫోన్ పే నుంచి క్రెడిట్ కార్డ్ పేమెంట్లు బంద్!