Darshan Case Update: కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై కేసు అనేది రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. పోలీసుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన కొత్త విషయాలు బయటపడుతున్నాయి. రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేయించిన కేసులో దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లయినా కూడా పవిత్ర గౌడ అనే నటితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు దర్శన్. అదే సమయంలో పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నాడనే కారణంతో రేణుకా స్వామి అనే వ్యక్తిని హత్య చేయించాలని ప్లాన్ చేశాడు. తాజాగా ఈ కేసులో మరో కొత్త అప్డేట్ బయటికొచ్చింది. రేణుకా స్వామిని హత్య చేస్తున్న సమయంలో పవిత్ర గౌడ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.


పోస్ట్‌మార్టం రిపోర్ట్..


33 ఏళ్ల రేణుకా స్వామిని తన ఫ్యాన్స్‌తో కలిసి ప్లాన్ చేసి హత్య చేశాడు దర్శన్. ఇటీవల తన పోస్ట్‌మార్టం రిపోర్టులో అందరూ ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. చంపడానికి ముందు రేణుకా స్వామిని విపరీతంగా టార్చర్ చేశారని తెలిసింది. తనను కర్రలతో పాటు బెల్టులతో కూడా బాగా కొట్టారని పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా బయటికొచ్చింది. అంతే కాకుండా అంత గట్టిగా కొట్టడం వల్ల రేణుకా స్వామి ఎముకలు విరిగాయట. ప్రైవేట్ పార్ట్స్‌పై కూడా తీవ్రంగా కొట్టారట. మొత్తంగా రేణుకా స్వామి శరీరంపై దాదాపుగా 30కు పైగా గాయాలు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే తను చనిపోయాడని పోస్ట్‌మార్టంలో వెల్లడైంది. తాజాగా బయటపడిన మరో విషయం ఏంటంటే.. ఆ టార్చర్‌ను పవిత్ర గౌడ దగ్గరుండి చూసిందట.


క్రైమ్ స్పాట్‌లో ఇద్దరు..


పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడంతోనే ఈ గొడవ మొదలయ్యిందని కన్నడ మీడియా అంటోంది. దీంతో రేణుకా స్వామికి బుద్ధి చెప్పాలని దర్శన్, పవిత్ర గౌడ నిర్ణయించుకున్నారట. అందుకే వారి ఆదేశాల ప్రకారం కొందరు వ్యక్తులు.. రేణుకా స్వామి నివసించే చిత్రదుర్గ ఏరియా నుంచి అతడిని కిడ్నాప్ చేసి బెంగుళూరుకు దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక షెడ్‌కు తీసుకెళ్లారట. అదే సమయంలో రేణుకా స్వామి, దర్శన్ కూడా అక్కడికి చేరుకున్నారని తాజాగా బయటపడింది. ఆ వ్యక్తులతో పాటు దర్శన్ కూడా రేణుకా స్వామిని బాగా కొట్టి, కరెంట్ షాక్ కూడా ఇచ్చాడని సమాచారం.


ఆ పని కోసం రూ.50 లక్షలు..


రేణుకా స్వామి హత్య కేసులో పోలీసులు మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో దర్శన్, పవిత్ర గౌడ కూడా ఉన్నారు. ఈ పని చేయడం కోసం వారందరికీ రూ.50 లక్షలు ఇచ్చాడట దర్శన్. అందులో ముందుగా కిడ్నాప్, మర్డర్, శవాన్ని దాచేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రదోష్ అలియాస్ పవన్‌కు రూ.30 లక్షలు అందాయి. ఒకవేళ ఈ హత్య విషయం బయటికొస్తే తామే చేశామని తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు వెళ్లడం కోసం రాఘవేంద్ర, కార్తిక్ అనే ఇద్దరు వ్యక్తులు సిద్ధంగా ఉన్నారట. వారికి కూడా రూ.5 లక్షలను అందించాడట దర్శన్. అనుకున్నట్టుగానే వారిద్దరూ హత్య చేశామని పోలీసులకు చెప్పినా.. విచారణలో దర్శన్ పేరు బయటికొచ్చింది.


Also Read: కిరాణా షాప్‌ to హీరోయిన్‌ స్థాయికి - భర్తను వదిలి దర్శన్‌తో ప్రేమ.. పవిత్ర గౌడ గురించి రాస్తే ఒక పుస్తకం అవుతాది!