Vijay Birthday: కోలీవుడ్‌లో ఇళయదళపతిగా పేరు తెచ్చుకున్నారు విజయ్. ఎన్నో ఏళ్లుగా ఎన్నో సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నారు. కోలీవుడ్‌లో రీమేక్స్‌కు ఓకే చెప్పే హీరోల్లో విజయ్ ముందుండేవారు. ఆయన నటించిన 9 సూపర్ హిట్ రీమేక్స్ ఏంటో మీరూ చూసేయండి.


పెళ్లి సందడి - నినైతేన్ వంధాయ్


కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సూపర్ హిట్ క్లాసిక్ చిత్రమే ‘పెళ్లి సందడి’. ఈ మూవీని ‘నినైతేన్ వంధాయ్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు విజయ్. ఇందులో విజయ్ సరసన రంభ, దేవయాని నటించారు. కే సెల్వభారతీ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది.


పవిత్ర బంధం - ప్రియమానవలె


వెంకటేశ్, సౌందర్య కాంబినేషన్‌లో ఎన్నో హిట్లు ఉన్నాయి. అందులో ‘పవిత్ర బంధం’ ఒకటి. తెలుగులో ఈ మూవీ విడుదలయ్యి సూపర్ హిట్ అందుకున్న నాలుగేళ్ల తర్వాత దీనిని రీమేక్ చేశారు విజయ్. ‘ప్రియమానవలె’గా తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లారు. మరోసారి కే సెల్వభారతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్‌లో విజయ్ సరసన సిమ్రాన్ నటించారు.


బద్రి - బద్రి


పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ‘బద్రి’ సినిమా చాలా స్పెషల్. అందులో ఈ హీరో స్టైల్, గ్రేస్ వేరే లెవెల్ అని ప్రేక్షకులు ఇప్పటికీ చెప్పుకుంటారు. తెలుగులో పవన్‌తో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన పూరీ జగన్నాధ్.. తమిళంలో విజయ్‌తో దీనిని రీమేక్ చేశారు. అక్కడ కూడా దీనికి ‘బద్రి’ అనే టైటిల్‌నే ఫిక్స్ చేశారు. ఇందులో విజయ్ సరసన భూమిక, మోనాల్ హీరోయిన్లుగా నటించారు.


చిరునవ్వుతో - యూత్


త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ‘చిరునవ్వుతో’ మూవీ ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు ఫేవరెట్. వేణు తొట్టెంపూడి, షాహీన్ జంటగా నటించిన ఈ మూవీని జీ రామ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను ‘యూత్’ అనే టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు విజయ్. దీనిని విన్సెంట్ సెల్వా డైరెక్ట్ చేశారు. ఇందులో విజయ్ సరసన సంధ్య హీరోయిన్‌గా నటించారు.


నువ్వు నాకు నచ్చావ్ - వసీగర


వెంకటేశ్ కెరీర్‌లో ఎన్నో ఎవర్‌గ్రీన్ హిట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ‘నువ్వు నాకు నచ్చావ్’. త్రివిక్రమ్ రాసి విజయ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని కూడా తమిళంలో రీమేక్ చేశారు విజయ్. ‘వసీగర’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ రీమేక్‌ను మరోసారి కే సెల్వ భారీతనే డైరెక్ట్ చేశారు. ఇందులో విజయ్ సరసన స్నేహ హీరోయిన్‌గా నటించారు.


నీతో - సచిన్


విజయ్‌ను తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గర చేసిన సినిమాల్లో ‘సచిన్’ కూడా ఒకటి. అప్పటివరకు కమర్షియల్ హీరోగా నటించిన విజయ్.. ఈ మూవీతో లవర్ బాయ్‌గా మారారు. అయితే ఇది ‘నీతో’ అనే తెలుగు చిత్రానికి రీమేక్ అని చాలామందికి తెలియదు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, మహేక్ చాహల్ హీరోహీరోయిన్లుగా డెబ్యూ చేసిన ‘నీతో’ను తమిళంలో ‘సచిన్’ టైటిల్‌తో రీమేక్ చేశారు విజయ్. అయితే, ఈ మూవీ తమిళనాటలో మంచి కలెక్షన్స్ సాధించింది.


ఒక్కడు - గిల్లి


మహేశ్ బాబు, భూమిక, ప్రకాశ్ రాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన ‘ఒక్కడు’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. దీంతో దానిని ‘గిల్లి’ అనే టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు విజయ్. ఈ సినిమా విజయ్‌కు ఒక రేంజ్‌లో బాక్సాఫీస్ సక్సెస్‌ను అందించింది. అంతే కాకుండా 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అయినా కూడా అదే రేంజ్‌లో బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించింది ‘గిల్లి’.


అతనొక్కడే - ఆది


కళ్యాణ్ రామ్ కెరీర్‌లో మొదటి కమర్షియల్ సక్సెస్ అందించిన మూవీ ‘అతనొక్కడే’. ఈ మూవీని ‘ఆది’ అనే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు విజయ్. రమణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఎస్ఏ చంద్రశేఖర్ నిర్మించారు. విజయ్, త్రిష.. ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు.


పోకిరి - పోకిరి


తెలుగులో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పోకిరి’ని అదే టైటిల్‌తో తమిళంలో రీమేక్ చేశారు విజయ్. ‘ఒక్కడు’ రీమేక్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ‘పోకిరి’ కూడా అదే రేంజ్‌లో సక్సెస్ సాధించింది. తమిళనాడులోని థియేటర్లలో దాదాపు 200 రోజులు ఆడింది ‘పోకిరి’.



Also Read: క్రేజీ అప్‌డేట్‌, భారతీయుడు 2 ట్రైలర్‌ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్‌ - ఎప్పుడంటే..