Credit Card Payments Online: ఆన్‌లైన్‌ ద్వారా క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్ల విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) తీసుకొచ్చిన కొత్త రూల్‌తో కొన్ని ఫిన్‌టెక్ కంపెనీలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఫోన్‌ పే (PhonePe), క్రెడ్‌ (Cred), బిల్‌డెస్క్‌ (BillDesk), ఇన్ఫీబీమ్‌ అమెన్యూస్‌ (Infibeam Avenues) వంటి చెల్లింపుల సంస్థల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేంద్రీకృత బిల్లింగ్ నెట్‌వర్క్ ద్వారానే క్రెడిట్ కార్డ్ బిల్‌ చెల్లింపులు జరగాలని ఇటీవల RBI ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన 2024 జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.


మన దేశంలో, ప్రైవేట్‌ రంగంలోని ప్రధాన బ్యాంక్‌లు యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) కలిసి 5 కోట్లకు పైగా క్రెడిట్ కార్డ్‌లను జారీ చేశాయి. దేశంలో చలామణీలో ఉన్న క్రెడిట్‌ కార్డుల్లో సగానికి పైగా వాటా ఈ 3 బ్యాంకులదే. అయితే... ఈ ప్రైవేట్‌ బ్యాంకులు ఇంకా BBPS (Bharat Bill Payment System)కు అనుగుణంగా మారలేదు. ఆర్‌బీఐ కేంద్రీకృత చెల్లింపుల విధానంలోకి ఈ బ్యాంకులు రాకపోతే, కస్టమర్‌లు ఈ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ బిల్లులను క్రెడ్‌, ఫోన్‌ పే వంటి ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చెల్లించలేరు. ఆర్‌బీఐ కొత్త ఆదేశాన్ని పాటించడానికి బ్యాంక్‌లకు ఈ నెల 30 వరకే సమయం ఉంది.


భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్
జూన్ 30 లోపు అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను 'భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్' (BBPS) ద్వారా ప్రాసెస్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. విశేషం ఏంటంటే... ఫోన్‌ పే, క్రెడ్‌ వంటి ఫిన్‌టెక్ కంపెనీలు BBPSలో సభ్యులుగా ఉన్నాయి. అయితే... ఇవి క్రెడిట్ కార్డ్‌లను నిర్వహించట్లేదు. కాబట్టి, క్రెడిట్‌ కార్డ్‌లను జారీ చేసే బ్యాంకులు RBI కొత్త రూల్స్‌ పాటించడంలో విఫలమైతే ఈ ఫిన్‌టెక్‌ కంపెనీలు క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులను ప్రాసెస్‌ చేయలేవు.


డువు పొడిగింపు కోసం పరిశ్రమ అభ్యర్థన
ఫిన్‌టెక్ కార్యకలాపాలు సజావుగా కొనసాగాలంటే, రుణదాతలు (బ్యాంక్‌లు) ఈ నెల 30 లోగా RBI నిబంధనల కిందకు రావాలి. గడువు చాలా దగ్గరలో ఉంది కాబట్టి, మరో 90 రోజుల గడువు పొడిగించాలని పరిశ్రమ వర్గాలు కేంద్ర బ్యాంక్‌ను అభ్యర్థిస్తున్నాయి. 


ప్రస్తుతం, మన దేశంలో క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసేందుకు అనుమతి ఉన్న 34 బ్యాంకుల్లో 8 బ్యాంక్‌లు మాత్రమే BBPS ద్వారా బిల్లు చెల్లింపులు ప్రారంభించాయి. ఈ లిస్ట్‌లో... ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్‌, ఇండస్ఇండ్ బ్యాంక్, SBI కార్డ్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్డ్ ఉన్నాయి.


BBPS వ్యవస్థను RBI ఎందుకు తీసుకొచ్చింది?
అక్రమ చెల్లింపులకు ముకుతాడు వేయడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ కొత్త రూల్‌ పెట్టింది. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను, చెల్లింపు విధానాలను క్షుణ్నంగా పరిశీలించడానికి, మోసపూరిత లావాదేవీలను గుర్తించి, ఆపడానికి 'భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్' సెంట్రల్ బ్యాంక్‌కు సాయం చేస్తుంది. ఫలితంగా.. పేమెంట్‌ ట్రాన్జాక్షన్లను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించే & నియంత్రించే సామర్థ్యం RBIలో పెరుగుతుంది.


మరో ఆసక్తికర కథనం: సోమవారం నుంచి మార్కెట్‌లో కీలక మార్పులు - ఈ రెండు షేర్లపై ఓ కన్నేయండి