Income Tax Return Filing 2024: ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌కు సంబంధించి, గత ఏడాది కాలంలో కొన్ని మార్పులు జరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌ ఫైలింగ్‌ కోసం ఐటీ ఫామ్స్‌లో ఆదాయ పన్ను విభాగం కొన్ని అదనపు వివరాలను చేర్చింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2023-24కు కూడా అవే మార్పులు వర్తిస్తాయి. మీరు ITR ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లయితే, వాటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. 


వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) నుంచి వచ్చే ఆదాయాలు
వర్చువల్ డిజిటల్ అసెట్స్‌పై ‍‌(Virtual Digital Assets) వచ్చే ఆదాయంపై కట్టాల్సిన పన్నుకు సంబంధించి 2022 ఏప్రిల్‌ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై సెక్షన్ 194S కింద TDS వర్తిస్తుంది. VDA నుంచి వచ్చే ఆదాయాన్ని డిక్లేర్‌ చేసేలా ITR ఫామ్‌లో మార్పులు జరిగాయి. ఇప్పుడు, క్రిప్టో లావాదేవీలు చేసే టాక్స్‌ పేయర్లు, VDA నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలి. 


2023-24లో ఒక వ్యక్తి క్రిప్టో అసెట్స్‌ ద్వారా ఆదాయం ఆర్జిస్తే, ఆ అసెట్స్‌ కొనుగోలు తేదీ, ట్రాన్స్‌ఫర్‌ డేట్‌, కొనుగోలు వ్యయం, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలను నమోదు చేయాలి. దీంతో పాటు, ఫామ్‌ 26AS, AISను టాక్స్‌ పేయర్‌ సరిపోల్చుకోవాలి.


సెక్షన్‌ 80G కింద క్లెయిమ్ చేయడానికి ARN వివరాలు
2023-24 ఆర్థిక సంవత్సరంలో మీరు విరాళం (Donation) ఇచ్చి ఉంటే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద మినహాయింపు లభిస్తుంది. ఇందుకోసం విరాళానికి సంబంధించిన ARN నంబర్‌ను ITR ఫామ్‌లో ఇవ్వాలి. విరాళాలపై 50 శాతం క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


టాక్స్‌ కలెక్షన్‌ ఎట్‌ సోర్స్‌ (TCS) 
కొన్ని సందర్భాల్లో, పన్ను చెల్లింపుదారు నుంచి ముందస్తుగానే TCS (Tax Collected at Source) వసూలు చేస్తారు. టాక్స్‌ ఫైలింగ్‌ టైమ్‌లో దీనిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అలాగే, గత సంవత్సరాల్లో సెక్షన్ 89A కింద రిలీఫ్ క్లెయిమ్ చేసి, ఆ తర్వాత నాన్ రెసిడెంట్‌గా మారితే, అటువంటి మినహాయింపులపై పన్ను విధించదగిన ఆదాయ (Taxable Income) వివరాలను ITR ఫామ్‌లో చెప్పడం అవసరం.


89A రిలీఫ్‌ కోసం ఆదాయం వెల్లడి
ఫారిన్‌ రిటైర్మెంట్ బెనిఫిట్ అకౌంట్స్‌ ‍‌(Foreign Retirement Benefit Accounts) నుంచి ఆర్జించే ఆదాయంపై, భారతీయ పౌరులకు ఉపశమనం ఉంటుంది. దేశంలో, ఐటీ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించే రిటైర్మెంట్ బెనిఫిట్ అకౌంట్‌ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపును సెక్షన్ 89A అందిస్తుంది. ఈ తరహా ఉపశమనాన్ని క్లెయిమ్ చేయాలనుకుంటే, ఐటీఆర్‌ ఫారంలోని జీతం విభాగంలో వివరాలు సమర్పించాలి.


ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ (FIIs)
గత ఆర్థిక సంవత్సరంలో, ITR ఫామ్‌లో వచ్చిన మార్పుల్లో ఇది కూడా ఒకటి. ITR-3లోని బ్యాలెన్స్ షీట్‌లో ఈ తరహా ఆదాయాల గురించి అదనపు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు, స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్ధ 'సెబీ' ‍(SEBI)లో రిజిస్టర్‌ అయిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారు (FII) లేదా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (FPI), SEBI రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఐటీ ఫామ్‌లో సమర్పించాలి.


ఇంట్రా-డే ట్రేడింగ్‌ ఆదాయాలు వెల్లడి
ITR ఫామ్‌లో వచ్చిన ఇటీవలి మార్పు ప్రకారం, స్టాక్‌ మార్కెట్లు ఇంట్రాడే ట్రేడర్లు, ఇంట్రా-డే ట్రేడింగ్ ‍‌(Intra-day trading) నుంచి సంపాదించిన టర్నోవర్ & ఆదాయ సమాచారాన్ని వెల్లడించాలి. ఐటీఆర్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన 'ట్రేడింగ్ అకౌంట్‌' కింద వాటిని చూపాలి.


మరో ఆసక్తికర కథనం: రికరింగ్‌ డిపాజిట్లపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ తరహా వడ్డీ రేట్లు, ఈ బ్యాంకుల్లో ఆఫర్లు