PPO Number: ఉద్యోగులు తమ జీతంలో కొంత భాగాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో (EPF Account) డిపాజిట్ చేస్తారు. ఉద్యోగి రిటైర్‌ అయ్యే వరకు ఈ ఖాతాలో జమ చేసిన డబ్బు మొత్తం పదవీ విరమణ తర్వాత తీసుకోవచ్చు. లేదా, ఉద్యోగం మానేసే సమయంలో అకౌంట్‌ క్లోజ్‌ చేసి, ఆ డబ్బు తిరిగి పొందొచ్చు. విశ్రాంత ఉద్యోగులకు నిబంధనల ప్రకారం పెన్షన్ సౌకర్యం కూడా లభిస్తుంది. 


PPO నంబర్ అంటే ఏంటి?
EPFO (Employees' Provident Fund Organisation)లో రిజిస్టర్‌ అయిన ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా 12 అంకెల సంఖ్యను కేటాయిస్తారు. ఈ నంబర్‌ను పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (Pension Payment Order - PPO) అంటారు. ఈ నంబర్ సాయంతో పెన్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలను తనిఖీ చేయవచ్చు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌తో (EPS) అనుబంధంగా ఉంటుంది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌కు సంబంధించిన మొత్తం సమాచారం ఈ నంబర్‌లో దాగి ఉంటుంది. పింఛను పొందేందుకు PPO నంబర్‌ తప్పనిసరి. 


ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఫిర్యాదులు దాఖలు చేసేటప్పుడు, సంప్రదింపులు, లావాదేవీలు జరిపే విషయంలో రిఫరెన్స్ నంబర్‌గా PPO పని చేస్తుంది. ఒక బ్యాంక్ ఖాతా మూసివేసి, మరో బ్యాంక్ ఖాతా ద్వారా పెన్షన్ పొందేందుకు కూడా PPO నంబర్ తప్పనిసరి.


ఒకవేళ, మీ PPO నంబర్‌ పోయినా/ మరిచిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. PPO నంబర్‌ను సులభంగా కనిపెట్టొచ్చు.


PPO నంబర్‌ను కనిపెట్టే సులభమైన మార్గం:


- ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
- ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌ను ఎంచుకుని, పెన్షన్ పోర్టల్‌లోకి వెళ్లండి.
- ఇక్కడ 'నో యువర్ PPO నంబర్' ఆప్షన్‌ను ఎంచుకోండి.
- PPO నంబర్‌ పొందడానికి మీ PF నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
- మీరు ఇచ్చిన వివరాలన్నీ సరిగా ఉంటే, వెంటనే స్క్రీన్‌పై మీ PPO నంబర్‌ కనిపిస్తుంది. దానిని సేవ్‌ చేసుకోండి.


ఉమంగ్ యాప్‌ ద్వారా PPO నంబర్‌ను ఎలా కనిపెట్టాలి?


- మీ మొబైల్‌లో ఉమంగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- యాప్‌ ఓపెన్‌ చేశాక, అందులో EPFO ఆప్షన్‌ను ఎంచుకోండి.
- సర్వీసెస్‌ ఆప్షన్‌ ఎంచుకుని, 'నో యువర్ PPO నంబర్' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ PF ఖాతా నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
- వివరాలు సరిగ్గా ఉంటే, కొన్ని నిమిషాల్లో మీ PPO నంబర్‌ను అందుకుంటారు. 


EPFO టోల్ ఫ్రీ నంబర్ 1800 11 8005 కి కాల్ చేసి కూడా మీ PPO నంబర్‌ను పొందవచ్చు.


PPO నంబర్ ఎందుకు ముఖ్యమైనది?


- PPO నంబర్ ద్వారా మీ పెన్షన్ పేమెంట్‌ స్టేటస్‌ గురించి తెలుసుకోవచ్చు.
- పెన్షన్ పేమెంట్‌ స్లిప్ పొందొచ్చు.
- పెన్షన్‌కు సంబంధించిన ఏ సమస్యకైనా పరిష్కారం పొందొచ్చు.
- మీ వ్యక్తిగత సమాచారంలో ఏవైనా మార్పులు ఉంటే, PPO నంబర్ ద్వారా అప్‌డేట్ చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: రైతులు, వ్యాపారులకు క్షణాల్లో రుణం - ఏర్పాట్లు చేస్తున్న రిజర్వ్‌ బ్యాంక్‌