Income Tax Return Filing 2024: సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో.. నిర్మాణం పూర్తయిన ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ను కొనడానికి కొందరు మొగ్గు చూపితే, నిర్మాణంలో ఉన్న (Under Construction) ఇల్లు/ఫ్లాట్‌ కొనడానికి మరికొందరు ఇష్టపడతారు. ఈ విషయంలో ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి.


ఉదాహరణకు... ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఒక వ్యక్తి (Taxpayer) బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేశాడని అనుకుందాం. ఈ కేస్‌లో.. బ్యాంక్‌కు తిరిగి కట్టే అసలు (Principal amount) మీద, వడ్డీ (Interest) మీద విడివిడిగా ఆదాయ పన్ను మినహాయింపులు (Income tax exemptions) పొందవచ్చు. బ్యాంక్‌ రుణంపై తిరిగి చెల్లించే అసలుపై సెక్షన్‌ 80C కింద రూ. 1.50 లక్షల వరకు.. చెల్లించే వడ్డీపై సెక్షన్‌ 24B కింద రూ. 2 లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే ఏంటి పరిస్థితి?
బ్యాంక్‌ రుణం తీసుకుని నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ లేదా ఇంటిని కొనుగోలు చేసినప్పుడు కూడా ఇవే సెక్షన్లు వర్తిస్తాయా?. ఈ కేస్‌లో పన్ను మినహాయింపు తక్షణం వర్తించదు. హౌస్‌ లోన్‌ మీద EMI చెల్లింపు వెంటనే ప్రారంభమైనప్పటికీ, గృహ రుణం మీద చెల్లించే వడ్డీ మాత్రమే ఆ EMIలో ఉంటుంది, అసలులో ఒక్క రూపాయి కూడా EMIలో కలవదు. అంటే, మీరు ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ సమయంలో సెక్షన్‌ 80C కింద గృహ రుణం మినహాయింపును పొందలేరు. 


హౌసింగ్‌ లోన్‌లో అసలు మొత్తం కట్‌ కాకపోయినా EMI ద్వారా వడ్డీ కడుతూ వెళ్తారు. దానిని కూడా వెంటనే క్లెయిం చేసుకోలేరు. సెక్షన్‌ 24B కింద ఈ వడ్డీ మినహాయింపును పొందాలంటే ఇంటి నిర్మాణం పూర్తవ్వాల్సిందే. 


ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం పూర్తయి, సదరు ఆస్తిని మీరు స్వాధీనం చేసుకున్నట్లు ‘పొసెషన్‌ సర్టిఫికేట్‌’ (Possession Certificate) తీసుకున్న తర్వాత మాత్రమే రుణంలో అసలు మొత్తం EMI ద్వారా కట్‌ కావడం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు సెక్షన్‌ 24B కింద వడ్డీని కూడా క్లెయిం చేసుకునే అవకాశం వస్తుంది.


అప్పటి వరకు చెల్లించిన వడ్డీ పరిస్థితేంటి?
ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం ఎంతకాలం సాగితే అంతకాలం EMI రూపంలో వడ్డీని మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. ఇలా కట్టిన వడ్డీని, ఆ ఇంటి నిర్మాణం కంప్లీట్‌ అయిన తర్వాత 5 సమ భాగాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీ ఇంటికి ‘పొసెషన్‌ సర్టిఫికేట్‌’ పొందిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీని, నిర్మాణం పూర్తయిన తర్వాత చెల్లిస్తున్న వడ్డీని కలిపి మినహాయింపు పొందవచ్చు. అయితే, ఇక్కడో చిన్న షరతు ఉంది. సెక్షన్‌ 24B కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు క్లెయిమ్‌ చేసుకోదగిన వడ్డీ మొత్తం (పాతది, కొత్తది కలిపి) రూ. 2 లక్షలకు మించకూడదు.


ఈ కేస్‌లో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొని, ఐదేళ్ల తర్వాత దానిని స్వాధీనం (Possession) చేసుకున్నాడని భావిద్దాం. ఈ ఐదేళ్లలో EMI రూపేణా రూ.6 లక్షల వడ్డీ చెల్లించాడని అనుకుందాం. ఇల్లు నిర్మాణంలో ఉంది కాబట్టి, ఐటీ రిటర్న్స్‌లో ఈ ఐదేళ్లలో ఆ వడ్డీని మినహాయింపుగా పొందలేడు. ఈ వడ్డీని ఐదు సమభాగాలుగా చేసి, ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు ఆర్థిక సంవత్సరాల్లో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అంటే, ఏడాదికి రూ.1.20 లక్షలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల వడ్డీని చెల్లించాల్సి వస్తే... ఆ సంవత్సరంలో కట్టిన వడ్డీ మొత్తం రూ. 2.05 లక్షలు (రూ.85 వేలు + రూ.1.20 లక్షలు) అవుతుంది. సెక్షన్‌ 24B కింద రూ.2 లక్షలు మాత్రమే గరిష్ట పరిమితి కాబట్టి, ఇంత మొత్తాన్నే అతను క్లెయిమ్‌ చేసుకోవచ్చు, మిగిలిన 5 వేలకు మినహాయింపు వర్తించదు. 


ఒకవేళ మీరు కొత్త పన్ను విధానం ప్రకారం రిటర్న్‌ ఫైల్‌ చేయాలని అనుకుంటే ఎలాంటి సెక్షన్లూ వర్తించవు. పాత పన్ను విధానానికి మాత్రమే పన్ను మినహాయింపు సెక్షన్లు వర్తిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా పెరిగిన పసిడి డిమాండ్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే