Best Interest Rates On Recurring Deposits: ప్రతి నెలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, మంచి రాబడి సంపాదించాలనుకునే వ్యక్తులకు రికరింగ్ డిపాజిట్‌ (RD) ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌. మన దేశంలో కొన్ని బ్యాంక్‌లు ఆర్‌డీల మీద అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటి వల్ల, ప్రతి నెలా పెద్దగా ఆర్థిక భారం లేకుండా ఇన్వెస్ట్‌ చేస్తూనే, మెచ్యూరిటీ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బును తిరిగి తీసుకునే అవకాశాన్ని ఆర్‌డీలు ఇస్తాయి. 


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యెస్ బ్యాంక్ ప్రస్తుతం ఆఫర్‌ చేస్తున్న రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు (RD Interest Rates 2024) ఇవి:


స్టేట్‌ బ్యాంక్‌ RD వడ్డీ రేట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిలో 6.50% నుంచి 7% వరకు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటును చెల్లిస్తోంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు అందుబాటులో ఉంది. ఈ రేట్లు గతేడాది (2023) డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి.


కెనరా బ్యాంక్ RD వడ్డీ రేట్లు
ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) వడ్డీ రేటుతో సమానంగా  RD వడ్డీ రేటు కెనరా బ్యాంక్‌ అందిస్తోంది. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు 6.85% నుంచి 7.25% మధ్య వడ్డీని చెల్లిస్తోంది. 444 రోజుల ప్రత్యేక కాల వ్యవధి కోసం అత్యధికంగా వడ్డీ రేటును ప్రకటించింది. ఈ రేట్లు 2023 నవంబర్ 16 నుంచి అమల్లోకి వచ్చాయి.


పంజాబ్ నేషనల్ బ్యాంక్ RD వడ్డీ రేట్లు
PNB కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు దాదాపు సమానమైన వడ్డీ ఆదాయాన్ని ఇస్తోంది. 6 నెలల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్స్‌లో 6% నుంచి 7.25% మధ్య రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటును చెల్లిస్తోంది. 400 రోజుల ప్రత్యేక వ్యవధిపై అత్యధిక వడ్డీ ఆదాయాన్ని ఆఫర్‌ చేస్తోంది. ఈ రేట్లు ఈ ఏడాది జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి.


HDFC బ్యాంక్ RD వడ్డీ రేట్లు
HDFC బ్యాంక్, సాధారణ పౌరుల (60 సంవత్సరాల లోపు వయస్సున్న వ్యక్తులు) కోసం, 6 నెలల నుంచి 10 సంవత్సరాల టైమ్‌ పిరియడ్స్‌ మీద 4.50% నుంచి 7.10% వరకు ఆర్‌డీ రేట్లు అందిస్తోంది. అత్యధిక వడ్డీ రేటు 7.10%. ఇది 15 నెలల కాలానికి అందుబాటులో ఉంటుంది. ఈ రేట్లు 2023 జనవరి 24 నుంచి అమల్లో ఉన్నాయి.


ICICI బ్యాంక్ RD వడ్డీ రేట్లు
ICICI బ్యాంక్ కూడా, సాధారణ పౌరులకు 6 నెలల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధికి 4.75% నుంచి 7.10% మధ్య రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. దీంతోపాటు.. 15 నెలలు, 18 నెలలు, 21 నెలలు, 24 నెలల ప్రత్యేక కాల వ్యవధులపై అత్యధికంగా 7.10% వడ్డీ ఆదాయాన్ని ఆఫర్‌ చేస్తోంది. ఈ రేట్లు 2023 ఫిబ్రవరి 24 నుంచి అమల్లో ఉన్నాయి.


యెస్ బ్యాంక్ RD రేట్లు
యెస్ బ్యాంక్ 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు టెన్యూర్స్‌పై 6.10% నుంచి 7.75% వరకు ఆర్‌డీ రేట్లను అందిస్తోంది. 18 నెలలు, 21 నెలల కాలానికి అత్యధిక వడ్డీ రేటు 7.75% అందుబాటులో ఉంది. ఈ రేట్లు 2023 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి.


మరో ఆసక్తికర కథనం: ITR-1 ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్‌ చేయకూడదు?