Income Tax Return Filing 2024: మన దేశంలో కచ్చితంగా ఆదాయ పన్ను చెల్లించేది వేతన జీవులు. జీతంలో భాగంగా HRA పొందుతున్న వ్యక్తులు, తాము ఉంటున్న ఇంటికి అద్దె చెల్లిస్తుంటే, ఇలాంటి కేస్‌లో ఆదాయ పన్ను చట్టం ప్రకారం HRA మినహాయింపును (HRA Exemption) క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనివల్ల, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, పన్ను భారం తగ్గుతాయి.
ఈ డాక్యుమెంట్ లేకపోతే HRA క్లెయిమ్ చేయలేరు!
HRA మినహాయింపును క్లెయిమ్ చేయలాంటే అద్దె ఒప్పందం (Rent Agreement) ముఖ్యం. అయితే, అది ఒక్కటే సరిపోదు. ఇంటి అద్దె చెల్లించినట్లు కూడా రుజువులు కావాలి. కాబట్టి రెంట్ రిపిస్ట్స్ కూడా ముఖ్యం. మీ ITRలో HRA క్లెయిమ్ చేసి సమర్పించిన తర్వాత, మీ ఐటీఆర్‌ను పరిశీలించే అసెసింగ్ అధికారికి HRA విషయంలో అనుమానం వస్తే, అద్దె ఒప్పందంతో పాటు చెల్లించిన అద్దెకు సంబంధించిన రుజువులు సమర్పించమని అడిగే అవకాశం ఉంది.
ఒక టాక్స్‌పేయర్... అద్దె ఒప్పందంలో ఉన్నట్లు అద్దె డబ్బులు చెల్లించి ఉండొచ్చు/చెల్లించకపోవచ్చు. కాబట్టి, అద్దె మొత్తాన్ని నిజంగా చెల్లించినట్లు రెంట్ అగ్రిమెంట్ రుజువు చేయలేదు. అద్దె రసీదులు ఉంటేనే ఆ వ్యక్తి వాస్తవంగా ఎంత అద్దె చెల్లించాడో కచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి, అద్దె ఒప్పందం కుదుర్చుకునే వ్యక్తి ప్రతి నెలా చెల్లించిన అద్దెకు సంబంధించిన రసీదును కూడా భద్రపరచాలి. ఇవి, HRA మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌లా పని చేస్తాయి. అద్దె రసీదులు లేకపోతే మీ HRA క్లెయిమ్‌ను తిరస్కరించే అధికారం మదింపు అధికారికి ఉంది.
మరో ఆసక్తిర కథనం: వడ్డీ రేట్లపై రేపు కీలక నిర్ణయం - లోన్ EMI తగ్గుతుందా, పెరుగుతుందా?
వార్షిక అద్దె రూ.లక్ష దాటితే PAN కార్డ్ అవసరం
ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన అద్దె ఒక లక్ష రూపాయల కంటే తక్కువగా ఉంటే, ఇంటి యజమాని పాన్ (PAN) అవసరం లేదు. వార్షిక అద్దె మొత్తం లక్ష రూపాయలు దాటితే (నెల అద్దె రూ.8,334 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే) మాత్రం ఇంటి యజమాని పాన్ అవసరం అవుతుంది, ITRలో ఆ నంబర్‌ను వెల్లడించాలి. ఒకవేళ, ఆర్థిక ఏడాది మొత్తంలో చెల్లించిన అద్దె 6 లక్షల రూపాయలు దాటితే... అద్దె చెల్లించే వ్యక్తి అద్దె డబ్బుల నుంచి ప్రతి నెలా 10% TDS (Tax Deduction At Source) తీసివేయాలి.
ఒకవేళ ఇంటి ఓనర్‌కు పాన్ లేకపోతే, వార్షిక అద్దె చెల్లింపుపై అతని నుంచి రాతపూర్వకంగా డిక్లరేషన్ తీసుకోవాలి. ఇంటి యజమాని పేరు, చిరునామా, సంతకం కూడా ఆ డిక్లరేషన్‌లో ఉండాలి. అద్దె రసీదుల్లో పేర్కొన్న మొత్తాన్ని అద్దెదారు నిజంగానే చెల్లించాడా, లేదా అన్న విషయాన్ని ఈ డిక్లరేషన్ ధృవీకరిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: జనానికి భారీ షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి