RBI MPC Meeting June 2024: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) రిజర్వ్‌ బ్యాంక్‌ రెండో 'ద్రవ్య విధాన కమిటీ' (Monetary Policy Committee) సమావేశం కొనసాగుతోంది. మూడు రోజుల సమావేశం నిన్న (బుధవారం, 05 జూన్ 2024‌) నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో తీసుకున్న పాలసీ డెసిషన్స్‌ రేపు (శుక్రవారం, 07 జూన్ 2024) తెలుస్తాయి.


ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) ఈ సమావేశం ఫలితాలను శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రకటిస్తారు. దేశంలో వడ్డీ రేట్లను నిర్ణయించే అత్యంత కీలకమైన రెపో రేట్‌లో (Repo Rate) ఈసారి కూడా ఎలాంటి మార్పు చేయరని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. గత ఆర్‌బీఐ ఎంపీసీ భేటీ 2024 ఏప్రిల్‌లో జరిగింది. అప్పుడు (వరుసగా ఏడోసారి‌) కూడా రెపో రేట్‌, రివర్స్‌ రెపో రేట్‌, బ్యాంక్‌ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ మార్చలేదు. 2023 ఫిబ్రవరిలో రెపో రేట్‌ 6.50 శాతానికి చేరింది. అప్పటి నుంచి, గత 16 నెలలుగా అదే రేట్‌ను ఆర్‌బీఐ కొనసాగిస్తోంది. 


దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) ఆర్‌బీఐ సహన పరిమితి (2% - 6%) పరిధిలోనే ఉంది. 2024 ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ స్వల్పంగా తగ్గి 4.83 శాతానికి చేరుకుంది, మార్చిలో ఇది 4.85 శాతం ఉంది. ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ సహన పరిమితి పరిధిలోనే ఉన్నప్పటికీ... ప్రపంచ ఉద్రిక్తతలు, సరఫరా పరిమితుల కారణంగా అది ఇప్పటికీ ఆందోళన కలిగించే విషయమే. రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 4 శాతానికి దించాలని కేంద్ర బ్యాంక్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువకు జారడం ద్రవ్యోల్బణం విషయంలో ఆర్‌బీఐకి ఉపశమనం కలిగించే అంశం.


2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి (India's GDP) 8.2 శాతంగా ఉంది. ఇది అంచనాల కంటే ఎక్కువ. దేశంలో వడ్డీ రేట్లు ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఆర్థిక వృద్ధి రేటు అద్భుతంగా ఉంది. అయినప్పటికీ, RBI రెపో రేటును తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెపో రేట్‌ను తగ్గించకూడదని RBI ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకుంటే, పాలసీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఎనిమిదోసారి అవుతుంది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ‍‌(2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం) రెపో రేటు తగ్గింపును ఆశిస్తున్నట్లు SBI తన రీసెర్చ్ పేపర్‌లో పేర్కొంది. SBI చెప్పిన ప్రకారం... 2024 మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు దాదాపు 5 శాతంగా అంచనా వేశారు. ఇది జులైలో 3 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. SBI రీసెర్చ్ నోట్ ప్రకారం, 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ద్రవ్యోల్బణం రేటు 5 శాతం కంటే తక్కువగానే ఉంటుంది. 


మోర్గాన్ స్టాన్లీ కూడా,ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పును తాము ఆశించడం లేదని ప్రకటించింది. ఎందుకంటే, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. నగదును అందుబాటులో ఉంచడానికి అధిక వడ్డీ రేట్లు సాయం చేస్తాయి.


ఒకవేళ, వరుసగా ఎనిమిదోసారి కూడా రెపో రేట్‌ స్థిరంగా ఉంటే, దేశంలో అధిక వడ్డీ రేట్లు మరో రెండు నెలలపాటు కొనసాగుతాయి. అప్పటి వరకు EMI మొత్తాల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి