Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేసే సమయంలో పొరపాటు/పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. దీనివల్ల, 'డిఫెక్టివ్‌ రిటర్న్' (Defective Return) ఫైల్‌ చేయాల్సివస్తుంది. డిఫెక్టివ్‌ రిటర్న్‌ను సరి చేసి, మళ్లీ ఫైల్‌ చేయమంటూ ఆదాయ పన్ను విభాగం సెక్షన్ 139(9) ‍కింద నోటీసు జారీ చేస్తుంది. ఈ నోటీస్‌ను అర్థం చేసుకుని, తప్పును సరిదిద్దుకుంటే పెనాల్టీ భారం తప్పుతుంది. 


డిఫెక్టివ్ రిటర్న్ అంటే ఏంటి?


మీరు ఫైల్‌ చేసిన ITRలో తప్పులుంటే, దానిని లోపభూయిష్ట రిటర్న్‌ లేదా డిఫెక్టివ్‌ రిటర్న్‌గా పిలుస్తారు. డిఫెక్టివ్‌ రిటర్న్‌లో... కొంత సమాచారం మిస్‌ కావడం, విభిన్నమైన సమాచారం ఇవ్వడం, ఆదాయం & వ్యయాల లెక్కింపులో తప్పులు లేదా ఇతర సమస్యలు ఉండవచ్చు. డిఫెక్టివ్‌ రిటర్న్ కింద నోటీస్‌ వస్తే కంగారు పడొద్దు. తప్పులను సరి చేసి మళ్లీ ఫైల్‌ చేయమని సూచిస్తూ ఐటీ విభాగం పంపే నోటీస్‌ అది. ఆదాయ పన్ను విభాగం ఈ నోటీసును మీ రిజిస్టర్డ్ ఇ-మెయిల్ IDకి పంపుతుంది. ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్‌ అయి, నోటీస్‌ల విభాగంలోనూ దీనిని చూడవచ్చు.


ఇ-మెయిల్‌కి వచ్చే నోటీస్‌కు పాస్‌వర్డ్ ఉంటుంది. పాస్‌వర్డ్... మీ పాన్ లోయర్‌కేస్‌ అక్షరాలు, DDMMYYYY ఫార్మాట్‌లో మీ పుట్టిన తేదీ. ఉదాహరణకు... మీ PAN ABCD1234E & పుట్టిన తేదీ 01/12/1990 అయితే, మీ పాస్‌వర్డ్ bcd1234e01121990 అవుతుంది.


లోపభూయిష్ట రిటర్న్‌కు దారి తీసే పరిస్థితులు:


- పేరు సరిగా లేకపోవడం: ITRలో చెప్పిన పేరుకు, PAN కార్డ్‌పై ఉన్న పేరు మధ్య వ్యత్యాసాలు


- పన్ను చెల్లింపు వ్యత్యాసాలు: పాక్షికంగా చెల్లించిన పన్నులు లేదా చెల్లించిన పన్నులకు - ITRలో పన్ను బాధ్యతకు మధ్య వ్యత్యాసాలు


- ITRలో తప్పుడు వివరాలు: బిజినెస్‌ టర్నోవర్, ఆదాయాలు లేదా నిర్దిష్ట ఆదాయ విభాగాలను రిపోర్ట్‌ చేయడంలో తప్పులు


- అసంపూర్ణ ఐటీఆర్‌: అనుబంధాలు, స్టేట్‌మెంట్‌లు లేకపోవడం, లేదా, అన్ని సోర్స్‌ల నుంచి వచ్చే ఆదాయాలను సంబంధిత కాలమ్స్‌లో చూపించకపోవడం


- పన్ను సమాచారం: TDS, TCS, ముందస్తు పన్ను లేదా సెల్ఫ్‌-అసెస్‌మెంట్ టాక్స్‌ సహా చెల్లించిన పన్నులను వివరించకపోవడం


- TDS-ఆదాయంలో అసమానత: సంబంధిత ఆదాయం లేకుండా TDS క్లెయిమ్ చేయడం


- ఖాతాల నిర్వహణ సమస్య: ఖాతాలు లేదా పుస్తకాలను అసంపూర్తిగా సమర్పించడం


- టాక్స్‌ ఆడిట్‌ సంబంధమైనవి: సెక్షన్ 44AB కింద అసంపూర్ణ ఆడిట్‌ రిపోర్ట్స్‌ లేదా అన్ని ఆడిట్ నివేదికలను సమర్పించకపోవడం


- కాస్ట్ ఆడిట్ పాటించకపోవడం: కంపెనీల చట్టం, 2013 ప్రకారం 'కాస్ట్ ఆడిట్' వివరాలను సమర్పించడంలో వైఫల్యం


- ప్రిజంప్టివ్‌ టాక్సేషన్‌లో తప్పులు: ఊహాత్మక ఆదాయ గణనలో లోపాలు లేదా సంబంధిత వివరాలను బహిర్గతం చేయకపోవడం


సెక్షన్ 139(9) నోటీస్‌కు ఎంత సమయంలో ప్రతిస్పందించాలి?


సెక్షన్ 139(9) కింద నోటీస్‌ స్వీకరించిన 15 రోజుల లోపు ప్రతిస్పందించాలి, తప్పులు సరిచేసి కొత్త ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి. ఈ గడువు దాటితే మీరు ఐటీఆర్‌ ఫైల్‌ చేయనట్లే ఆదాయ పన్ను విభాగం పరిగణిస్తుంది, రిఫండ్‌ వంటివి ప్రయోజనాలను నిలిపేస్తుంది. కొన్నిసార్లు జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా ఉండవచ్చు. ఒకవేళ, ఇచ్చిన సమయంలోగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయలేకపోతే గడువు పొడిగింపు కోసం అభ్యర్థించే అవకాశం కూడా ఉంది. 


మరో ఆసక్తికర కథనం: ఒక్క SMS లేదా ఒక్క మిస్డ్‌ కాల్‌ - పీఎఫ్‌ బ్యాలెన్స్‌ క్షణాల్లో తెలుస్తుంది