Income tax Saving: మన ఆర్థిక ప్రణాళిక సరిగా ఉండాలంటే, ఆదాయ పన్ను రూపంలో చెల్లించే డబ్బును ఆదా చేయడం చాలా ముఖ్యం. చక్కటి ప్రణాళికతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు, భారీ మొత్తంలో డబ్బును మిగుల్చుకోవచ్చు. తద్వారా ఆర్థిక లక్ష్యాలను సాధించడం వేగవంతం, సులభం అవుతుంది.


పన్ను భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, అదనపు ఆర్థిక ప్రయోజనాలను అందుకునేందుకు సహాయపడే టాప్‌ టాక్స్‌ సేవింగ్‌ ఆప్షన్స్‌, స్ట్రాటెజీలు ఇవి:


1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident fund)
ఆదాయ పన్ను ఆదా కోసం ఎక్కువ మంది ఫాలో అవుతున్న వ్యూహం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం. పన్ను ఆదాతో పాటు దీర్ఘకాలిక పొదుపుగానూ ఉపయోగపడే స్కీమ్‌ ఇది. పోస్ట్‌ ఆఫీస్‌, ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్వారా మీరు PPF ఖాతా ప్రారంభించవచ్చు. PPF ఖాతాలో పెట్టే పెట్టుబడి మీద హామీతో కూడిన వడ్డీ రేటు లభిస్తుంది. ఈ డిపాజిట్లకు, సెక్షన్ 80C కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ఇన్‌కమ్‌ టాక్స్‌ మినహాయింపు లభిస్తుంది.


2. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ (Fixed Deposit)
ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టం- 1961లోని సెక్షన్ 80C ప్రకారం మీరు పన్ను భారం తగ్గించుకోవచ్చు. టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడుల రూపంలో ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 1.5 లక్షల వరకు మీరు తగ్గించి చూపవచ్చు. సాధారణంగా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు 5.5%-7.75% మధ్య ఉంటాయి. అంటే, పన్ను తగ్గింపు + ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద వడ్డీ, రెండూ కలిసి వస్తాయి.


3. సీనియర్ సిటిజన్ పొదుపు పథకం (Senior citizen savings scheme)
60 ఏళ్లు పైబడిన వారి కోసం డిజైన్‌ చేసిన ప్రభుత్వ ప్రాయోజిత పొదుపు పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని ఈ స్కీమ్‌ అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80C ప్రకారం... SCSS ఖాతాల్లో చేసిన డిపాజిట్ల మీద గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఉంటుంది. ఈ మినహాయింపు ప్రస్తుత పన్ను విధానంలో మాత్రమే వర్తిస్తుంది.


4. జీవిత బీమా ‍‌(Life Insurance)
ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం జీవిత బీమా పథకం. పాలసీదారుకి అకాల మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబానికి ఇది ఆర్థిక రక్షణ అందిస్తుంది. సాంప్రదాయ (ఎండోమెంట్) లేదా మార్కెట్ లింక్డ్ (ULIP - యులిప్‌) రూపాల్లోని జీవిత బీమా పథకాల కోసం చెల్లించిన ప్రీమియంల మీద పాలసీదార్లకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. మీ పన్నును ఆదా చేసే అనేక బీమా పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.


5. పెన్షన్ పథకాలు (Pension plans)
పెన్షన్ ప్లాన్స్‌ జీవిత బీమాకి మరొక రూపంగా చెప్పుకోవచ్చు. వృద్ధాప్య జీవితానికి ఇవి రక్షణ పథకాలు. ఇవి కూడా ప్రత్యేక ప్రయోజనం కోసం ఉద్దేశించిన స్కీమ్స్‌. పథకం కొన్న వ్యక్తికి, అతని జీవిత భాగస్వామికి ఆర్థిక భరోసా అందించడం పెన్షన్ ప్లాన్స్‌ లక్ష్యం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCC (సెక్షన్ 80Cకి సబ్‌ సెక్షన్) పెన్షన్ డిపాజిట్లను కవర్ చేస్తుంది. ఈ స్కీమ్స్‌ కోసం కట్టే డబ్బుకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది. 


సెక్షన్ 80Cలోని అన్ని సబ్ సెక్షన్‌ల కింద అనుమతించిన గరిష్ట మినహాయింపు రూ. 1.5 లక్షలు. మినహాయింపు కోరే మొత్తం దీని కంటే ఎక్కువైతే, ఆ ఎక్కువైన ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది.