Surrender charges on insurance policy: మన దేశంలో కోట్ల మందికి జీవిత బీమా (Life insurance) పాలసీలు ఉన్నాయి. దీర్ఘ కాలం పాటు ప్రీమియం కట్టలేక, పాలసీ వ్యవధి మధ్యలోనే పాలసీని సరెండర్‌ చేసే వాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి సందర్భంలో, అప్పటి వరకు పాలసీదారు కట్టిన డబ్బు పరిస్థితేంటి?. సదరు బీమా కంపెనీ.. సరెండర్‌ ఖర్చులు, ఛార్జీలు, టాక్స్‌లను మినహాయించుకుని మిగిలిన ప్రీమియం డబ్బును (Surrender of a life insurance policy) పాలసీదారుకు చెల్లిస్తుంది. అయితే, బీమా కంపెనీ తిరిగిచ్చే డబ్బు చాలా తక్కువగా ఉంటుంది, పాలసీదారు నష్టపోతాడు.


పాలసీదారుకు కలిగే ఆర్థిక నష్టాన్ని భారీగా తగ్గించడానికి, 'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (IRDAI - ఇర్డాయ్‌) రంగంలోకి దిగింది. నాన్-లింక్డ్ పాలసీల (సంప్రదాయ పాలసీలు) సరెండర్ విలువను ‍‌(Surrender value) పెంచేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ నెల 12న ఎక్స్‌పోజర్ డ్రాఫ్ట్‌ విడుదల చేసింది. 


ప్రీమియం థ్రెషోల్డ్ ప్రతిపాదన ‍‌(premium threshold proposal)
ముసాయిదా నిబంధనల్లో, ప్రతి బీమా పాలసీకి 'ప్రీమియం థ్రెషోల్డ్'ను ఇర్డాయ్‌ ప్రతిపాదించింది. ప్రీమియం థ్రెషోల్డ్ అంటే, ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన నిర్దిష్ట మొత్తం. ఈ పరిమితిని దాటి ప్రీమియం చెల్లించిన తర్వాత, ఆ పాలసీని ఎప్పుడు సరెండర్ చేసినా మిగిలిన ప్రీమియంపై సరెండర్ ఛార్జీలను బీమా కంపెనీలు విధించకూడదు. ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే, నిబంధనగా మారలేదు. ఈ ప్రతిపాదనపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు చెప్పాలనుకున్న వాళ్లు 2024 జనవరి 3లోగా వాటిని ఇర్డాయ్‌కి పంపొచ్చు.


పరిశ్రమ నుంచి వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, అందరికీ ఆమోద్యయోగ్యమైన నిబంధనను (premium threshold rule) ఇర్డాయ్‌ ప్రవేశపెడుతుంది. 


ప్రస్తుతం, రెండు సంవత్సరాల పాటు పూర్తి ప్రీమియంలు చెల్లించిన తర్వాత, ఆ పాలసీని పాలసీ మెచ్యూరిటీ గడువు లోపులో ఎప్పుడైనా సరెండర్ చేయొచ్చు. రెండేళ్ల కంటే ముందు పాలసీని సరెండర్ చేస్తే ఒక్క రూపాయి కూడా పాలసీదారుకు తిరిగి (refund) రాదు. 2 సంవత్సరాల తర్వాత, గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూని (Guaranteed Surrender Value) మాత్రమే బీమా కంపెనీ చెల్లిస్తుంది. ఇందులోనూ చాలా భారీ ఖర్చును చూపిస్తుంది. 


ప్రస్తుత పరిస్థితి ఇది
ఉదాహరణకు... రెండో సంవత్సరం తర్వాత మీ దగ్గరున్న ఇన్సూరెన్స్‌ పాలసీని సరెండర్ చేస్తే, బోనస్‌ వంటి ప్రయోజనాలను మినహాయించుకుని, మొత్తం ప్రీమియంలో 30-35% డబ్బును వాపసు చేస్తుంది. అంటే, మీరు ఈ రెండేళ్లలో రెండు లక్షలు కడితే, మీ చేతికి తిరిగి వచ్చేది కేవలం రూ.60,000-75,000. పాలసీని సరెండర్‌ చేసే టైమ్‌ను బట్టి ఈ నిష్పత్తి పెరుగుతుంది. అంటే, మీరు 3-8 సంవత్సరాల మధ్య పాలసీని సరెండర్ చేస్తే 60% డబ్బు, 10 సంవత్సరాలు దాటితే 80% డబ్బు, చివరి గత రెండు సంవత్సరాల్లో సరెండర్ చేస్తే 90% తిరిగి రావచ్చు. ఈ మొత్తాలు ఉదాహరణలు మాత్రమే, ఇవే కచ్చితమైన లెక్కలు కాదని గమనించాలి.


తాజాగా, మొదటి సంవత్సరంలో సరెండర్ చేసిన పాలసీకి కూడా మంచి సరెండర్ వాల్యూని అందించాలని ఇర్డాయ్‌ ప్రతిపాదించింది. ఉదాహరణకు, ఏడాదికి రూ.1 లక్ష ప్రీమియం కట్టేలా ఒక నాన్-లింక్డ్ సేవింగ్స్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు తీసుకున్నారని అనుకుందాం. ఇక్కడ ప్రీమియం థ్రెషోల్డ్‌ను రూ.30,000 అనుకుందాం. మొదటి ప్రీమియం కట్టిన తర్వాత పాలసీని సరెండర్‌ చేశారని భావిద్దాం. థ్రెషోల్డ్‌ను దాటి ప్రీమియం చెల్లించారు కాబట్టి, సర్దుబాటు చేసిన గ్యారెంటీడ్‌ సరెండర్ వాల్యూ మీకు దక్కుతుంది. అంటే... 1,00,000 – 30,000 x 1 సంవత్సరం = 70,000 మీ చేతికి తిరిగి వస్తుంది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ రూ.63,000 దాటిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి