Investing: ప్రజలు ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు, తమ డబ్బును ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలని చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు, మార్కెట్‌లో అనేక పెట్టుబడి మార్గాలకు తలుపులు తెరుచుకున్నాయి. ఆప్షన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, , ప్రజలు తమకు ఏది మంచిదో అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. మీకు కూడా పెట్టుబడి ఆలోచన ఉండి, SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) లేదా FD (ఫిక్స్‌డ్ డిపాజిట్)లో ఏది ఎంచుకోవాలో తేల్చుకోలేకపోతుంటే, ఈ వార్త మీ కోసం మాత్రమే. ఈ వార్త పూర్తిగా చదివితే మీరు మెరుగైన నిర్ణయం తీసుకోవచ్చు.


SIP అంటే ఏంటి?
SIP అంటే.. మ్యూచువల్ ఫండ్‌లో స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టే ప్రణాళిక. ఇది క్రమశిక్షణతో కూడిన పద్ధతి, దీనిలో ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో జమ చేస్తారు. SIPలో క్రమం తప్పని పెట్టుబడి ద్వారా మీరు మంచి రాబడిని పొందుతారు. ముఖ్యంగా మీరు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టినప్పుడు పెద్ద సంపద పోగవుతుంది. అంతేకాదు, చిన్న మొత్తం పెట్టుబడితోనూ SIPను ప్రారంభించవచ్చు. అంటే కేవలం రూ.500 ఉన్నా SIP స్టార్‌ చేయవచ్చు. స్టాక్‌ మార్కెట్‌ పెరుగుతుంటే, మీ పెట్టుబడి విలువ పెరుగుతుంది.


SIP ప్రతికూలతలు
వాస్తవానికి, SIP పనితీరు పూర్తిగా స్టాక్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ క్షీణిస్తే మీ పెట్టుబడి విలువ తగ్గుతుంది. ప్రత్యేకించి, మీరు స్వల్పకాలంలో మంచి మొత్తంలో డబ్బు సంపాదించాలనుకుంటే SIP నుంచి ఎక్కువ ప్రయోజనం పొందలేరు.


FD అంటే ఏంటి?
FD అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్. ఇది సాంప్రదాయ & సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఇందులో, మీరు బ్యాంకులో నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. FDలో పెట్టుబడికి రిస్క్ ఉండదు, మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. SIP వలె ఇది స్టాక్‌ మార్కెట్ హెచ్చుతగ్గులకు ప్రభావితం కాదు. ముఖ్య విషయం ఏటంటే, FDలో వడ్డీ రేటు ముందుగానే నిర్ణయమవుతుంది, ఆ రేటు ప్రకారం స్థిరమైన వడ్డీ ఆదాయం లభిస్తుంది. అంటే మీ రిటర్న్‌లో ఎటువంటి మార్పు ఉండదు. అంతేకాదు, FD కాల పరిమితిని మీరే నిర్ణయించుకోవచ్చు. అంటే, మీ సౌలభ్యం ప్రకారం టెన్యూర్‌ ఎంచుకోవచ్చు. ఈ కాల పరిమితి కొన్ని రోజుల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. 


FD ప్రతికూలతలు
FDలో ఉన్న అతి పెద్ద ప్రతికూలత దానిపై వచ్చే రాబడి. స్థిరమైన వడ్డీ రేటు ఉన్నప్పటికీ ఇది పరిమితమైన రాబడి. స్టాక్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడి పథకాలతో పోలిస్తే FD రాబడి తక్కువ. FDలో చక్రవడ్డీ ప్రయోజనం అందదు. ఇది కాకుండా, ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని నిర్ణీత వ్యవధి (టెన్యూర్‌) కంటే ముందే వెనక్కు తీసుకుంటే కొంత పెనాల్టీ చెల్లించాలి. అంటే, కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. SIPలో నిర్వహణ ఛార్జీలు తప్ప విత్‌డ్రా ఛార్జీలు ఉండవు.


ఈ రెండు ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లను అర్ధం చేసుకున్న తర్వాత, ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది మీరు స్వేచ్ఛగా నిర్ణయించుకోవచ్చు. మా సలహా ఏమిటంటే.. ఎందులోనైనా ఇన్వెస్ట్‌ చేసే ముందు, మంచి పరిజ్ఞానం ఉన్న ఆర్థిక సలహాదారు సలహా తీసుకోవడం ఉత్తమం.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ పైచూపులు చూస్తున్న స్వర్ణం - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ