Aadhaar Card Free Update Deadline: ఆధార్‌ కార్డులను జారీ చేసే ఉడాయ్‌ (Unique Identification Authority of India - UIDAI), దేశ ప్రజలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు, ఆధార్‌ కార్డులో తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరో మూడు వారాలు సమయం ఇచ్చింది. అంటే, ఈ ఏడాది డిసెంబరు 14 వరకు "ఫ్రీ అప్‌డేషన్‌" గడువు ఇచ్చింది. దీనివల్ల ప్రజలతు మరింత టైమ్‌ దొరికినట్లైంది. ప్రజలు హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు.


"కోట్ల కొద్దీ ఆధార్ కార్డ్‌ హోల్డర్‌లకు ప్రయోజనం చేకూర్చేలా, ఉచితంగా ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 వరకు పొడిగించాం. ఈ ఉచిత సేవ కేవలం మైఆధార్‌ (myAadhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రజలు తమ ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేయమని ఉడాయ్‌ ప్రోత్సహిస్తోంది" అని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో ఉడాయ్‌ పోస్ట్ చేసింది.


ఆధార్‌ వివరాలను ఎందుకు అప్‌డేట్ చేయాలి?
ఆధార్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి, చివరిసారిగా అప్‌డేట్ చేసి 10 సంవత్సరాలు పైగా గడిచినవాళ్లు తమ ఆధార్‌ అప్‌డేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలి. వివరాలను అప్‌డేటెడ్‌గా ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు బడిలో చేరడం దగ్గర నుంచి ఉద్యోగంలో చేరడం వరకు ప్రతిచోటా ఆధార్‌ అవసరం. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు, రైతులు, మత్స్యకారులు ఇలా ఏ వర్గంవారైనా సరే... స్కాలర్‌షిప్‌లు, రాయితీలు, పింఛన్లు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లోనే కాదు, ప్రైవేటు రంగం నుంచి లబ్ధి పొందాలన్నా ఇప్పుడు ఆధార్‌ ఉండాల్సిందే. కాబట్టి, ఆధార్‌లో ఖచ్చితమైన & తాజా సమాచారం ఉండడం ముఖ్యం. దీనివల్ల ప్రభుత్వ & ప్రైవేట్ సేవలు, ప్రయోజనాల్లో ఇబ్బందులు రావు.



ఆన్‌లైన్‌లో ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడం చాలా సులభం. ఈ స్టెప్స్‌ ఫాలో అయితే, మీ ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఈజీగా అప్‌డేట్ చేయొచ్చు.


--- https://uidai.gov.in/en/ లింక్‌ ద్వారా ఉడాయ్‌ అధికారిక ఆధార్ పోర్టల్‌లోకి వెళ్లండి. 


--- మెయిన్‌ మెనూలో కనిపించే 'My Aadhaar' సెక్షన్ కింద, 'Update Your Aadhaar'పై క్లిక్ చేయండి.


--- 'Update Aadhaar Details (Online)' ఎంచుకోండి. తర్వాత, 'Document Update' ఆప్షన్‌ మీద క్లిక్‌ చేయండి.


--- ఇప్పుడు, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను కూడా ఎంటర్‌ చేయాలి. తర్వాత, 'Send OTP' మీద క్లిక్ చేయండి.


--- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని సంబంధిత గడిలో పూరించండి.


--- మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న (పేరు, చిరునామా వంటివి) వివరాలను ఎంచుకోండి.


--- ధృవీకరణ కోసం రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయండి.


--- అప్‌డేట్ అభ్యర్థనను ఇక్కడ 'Submit'  చేయండి. అప్లికేషన్‌ ట్రాకింగ్ కోసం స్క్రీన్‌ మీద కనిపించే అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)ను సేవ్ చేసుకోండి. ఇది మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు కూడా వస్తుంది.


మీకు కావాలంటే, ఈ పోర్టల్‌ను తెలుగులోకి మార్చుకోవచ్చు. హోమ్‌ పేజీలో కుడి వైపు పైన కనిపించే 'English' మీద క్లిక్‌ చేస్తే డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్ అవుతుంది. దానిలో వివిధ భాషలు కనిపిస్తాయి, మీరు 'తెలుగు' మీద క్లిక్‌ చేస్తే పోర్టల్‌ తెలుగులోకి మారుతుంది. లేదా, https://uidai.gov.in/te/ లింక్‌ ద్వారా నేరుగా తెలుగులోనే పోర్టల్‌ను ఓపెన్‌ చేయొచ్చు. 


ఆధార్‌ ఉచిత అప్‌డేషన్‌ను అవకాశాన్ని ఉడాయ్‌ పలుమార్లు పొడిగించింది. చివరిసారిగా, సెప్టెంబర్‌ 14, 2024 వరకే సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ గడువును డిసెంబర్ 14, 2024 వరకు ఎక్స్‌టెండ్‌ చేసింది. ఈ తేదీ తర్వాత మీ ఆధార్‌ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలనుకుంటే కొంత డబ్బు చెల్లించాలి.


మరో ఆసక్తికర కథనం: ఇక నుంచి QR కోడ్‌తో కొత్త పాన్ కార్డ్‌లు - "ఫ్రీ"గా తీసుకోవచ్చు