Benefits Of Personal Loan Prepayment: ప్రజలు బ్యాంక్‌ల నుంచి తీసుకునే రుణాల్లో వ్యక్తిగత రుణాల సంఖ్య చాలా ఎక్కువ. పర్సనల్ లోన్ ఒక అసురక్షిత రుణం (Unsecured Loan). ఈ లోన్‌ కోసం ఏ ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. రుణం చాలా సులభంగా లభిస్తుంది. పేపర్ వర్క్ కూడా తక్కువ. 


అయితే.. మిగిలిన బ్యాంక్‌ లోన్లతో పోలిస్తే వ్యక్తిగత రుణం కాస్త ఖరీదైనది, దీనిలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంటే, రుణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యయాన్ని పరిమితం చేయడానికి పర్సనల్‌ లోన్‌ ముందస్తు చెల్లింపు (Prepayment Of Personal Loan) ఒక సరైన మార్గం.


ముందస్తు చెల్లింపు అంటే ఏంటి?
పర్సనల్ లోన్ ప్రిపేమెంట్ అంటే లోన్ అగ్రిమెంట్‌లో చెప్పిన సమయం లేదా లోన్‌ టెన్యూర్‌ కంటే ముందే మొత్తం బాకీని లేదా లోన్‌లో కొంత భాగాన్ని చెల్లించడం. మీరు తీసుకున్న వ్యక్తిగత రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించినప్పుడు, బ్యాంకులు ఔట్‌ స్టాండింగ్ అమౌంట్‌కే (మిగిలివున్న రుణ మొత్తం) ఛార్జీ విధిస్తాయి. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ (Foreclosure charge) అంటారు. రుణం తీసుకోవడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉన్నట్లే, రుణాన్ని మూసివేయడానికి కూడా ఫోర్‌క్లోజర్ ఛార్జీలు చెల్లించాలి.


ఫోర్‌క్లోజర్ ఛార్జ్ ఎంత ఉంటుంది?
ఇది, తీసుకున్న రుణం, రుణదాత (బ్యాంకు) నిబంధనలు & షరతులపై ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు, మరో బ్యాంక్‌కు ముందస్తు చెల్లింపుపై ఛార్జీ మారుతుంది. చాలా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) లోన్ ప్రి-పేమెంట్‌పై లాక్-ఇన్ పీరియడ్‌ను (Lock-in period on loan prepayment) విధిస్తాయి. ఈ లాక్‌-ఇన్‌ పిరియడ్‌లో లోన్‌ క్లోజ్‌ చేయడానికి ఉండదు, బ్యాంక్‌ను బట్టి ఇది కొన్ని నెలలు ఉంటుంది. ఈ వ్యవధి తర్వాత రుణం పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించొచ్చు. ఈ కేస్‌లో, ఔట్‌ స్టాండింగ్‌ అమౌంట్‌ మీద 2 నుంచి 5 శాతం వరకు ప్రి-పేమెంట్ పెనాల్టీ లేదా ఫోర్‌క్లోజర్ ఛార్జీని వసూలు చేస్తారు. 


ఇప్పుడు కొన్ని బ్యాంక్‌లు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. అంటే.. లాక్‌-ఇన్‌ పిరియడ్‌ ముగిసిన తర్వాత మిగిలిన ఔట్‌స్టాండింగ్‌ మొత్తాన్ని కట్టేస్తే చాలు. బ్యాంక్‌లు అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు.


వడ్డీ డబ్బు ఆదా 
వ్యక్తిగత రుణాన్ని ముందుగానే తిరిగి చెల్లించడం వల్ల వడ్డీ రూపంలో ఖర్చు చేసే డబ్బు తగ్గుతుంది. మీరు ఎంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే అంత తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, వివిధ బ్యాంకుల వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు (Interest rates on personal loans) 9.99% నుంచి 24% మధ్య ఉన్నాయి. అధిక వడ్డీకి లోన్‌ తీసుకున్న వ్యక్తులు, అ అప్పును ముందుగానే తిరిగి చెల్లించడం మంచిది. పర్సనల్ లోన్ ప్రి-పేమెంట్ వల్ల, వడ్డీ రూపంలో చెల్లించే డబ్బు ఆదా అవుతుంది.


మరికొన్ని ప్రయోజనాలు
వ్యక్తిగత రుణాన్ని గడువుకు ముందే తిరిగి చెల్లించడం వల్ల లోన్‌ EMI మిగులుతుంది, మీ నెలవారీ బడ్జెట్ మెరుగుపడుతుంది. ఇతర రుణం తీసుకోవడానికి డౌన్ పేమెంట్‌ రూపంలో పొదుపు చేయడం, పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించడం లేదా పదవి విరమణ ప్రణాళిక వంటి ఇతర ఆర్థిక లక్ష్యాల కోసం మీరు ఆ డబ్బును ఉపయోగించవచ్చు. 


పర్సనల్ లోన్ ప్రి-పేమెంట్ తర్వాత మీ క్రెడిట్ స్కోర్‌పై తక్షణం ఉండదు. అయితే, మొత్తం లోన్‌ను ముందుగానే చెల్లించినందున దీర్ఘకాలంలో క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందొచ్చు.


మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో తుపాను తర్వాత నిశ్శబ్ధం - మెరిసిన అదానీ షేర్లు