Stock Market News Today in Telugu: కొత్త ఆర్థిక సంవత్సరాన్ని తుపానులా ప్రారంభించి, బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు బీఎస్ఈ సెన్సెక్స్ & ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీని సరికొత్త గరిష్టాలకు చేర్చిన స్టాక్‌ మార్కెట్లు.. ఈ రోజు నిశ్శబ్దంగా, ఫ్లాట్‌గా (మంగళవారం, 02 ఏప్రిల్‌ 2024) ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే, సెన్సెక్స్ 128 పాయింట్లు పడిపోయి 73,885 స్థాయికి దిగి వచ్చింది. అంటే, కీలకమైన 73,900 స్థాయి నుంచి జారిపోయింది. ఈ రోజు మార్కెట్‌లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ & నిఫ్టీ ఉత్థానపతనాల మధ్య ఊగిసలాడుతున్నాయి.


2024 మార్చి నెలలో GST వసూళ్లు 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి, ఇది రెండో అత్యధిక మొత్తం. అంతకుముందు, 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. తాజా గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థలో బలాన్ని సూచిస్తున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (సోమవారం) 74,015 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 7.75 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 74,022.30 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. సోమవారం 22,462 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 3 పాయింట్లు తగ్గి 22,458.80 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లు ఈ రోజు కూడా పాజిటివ్‌గా పెర్ఫార్మ్‌ చేస్తున్నాయి. BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.5 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.7 శాతం పెరిగాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 13 షేర్లు గ్రీన్‌ జోన్‌లో ట్రేడవుతుండగా, 17 స్టాక్స్ రెడ్‌ జోన్‌లో చిక్కుకున్నాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ముందంజలో కొనసాగుతోంది, 1.39 శాతం పెరిగింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.32 శాతం, టైటన్ 0.85 శాతం, టాటా మోటార్స్ 0.55 శాతం లాభపడ్డాయి. నెస్లే 0.51 శాతం, ఎన్‌టీపీసీ 0.31 శాతం బలం ప్రదర్శించాయి.


నిఫ్టీ50 ప్యాక్‌లో 22 షేర్లు లాభపడగా, 28 స్టాక్స్‌ పతనావస్థలో కనిపించాయి. నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌లో... బీపీసీఎల్‌ 2.70 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్ 2.09 శాతం, బజాజ్ ఆటో 1.96 శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.39 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.36 శాతం పెరిగాయి. మరోవైపు... ఐసీఐసీఐ బ్యాంక్ 1.63 శాతం, విప్రో 1.01 శాతం క్షీణించాయి. బజాజ్ ఫైనాన్స్ 0.98 శాతం, టీసీఎస్ 0.95 శాతం బలహీనతను చూపాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 0.84 శాతం తగ్గింది.


డీమెర్జర్ ప్లాన్‌తో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ షేర్లు 15% పెరిగాయి.


ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 77.09 పాయింట్లు లేదా 0.10% తగ్గి 73,937.46 దగ్గర; NSE నిఫ్టీ 16.65 పాయింట్లు లేదా 0.07% తగ్గి 22,445.35 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
2022 సెప్టెంబర్‌ తర్వాత US తయారీ రంగం మొదటిసారిగా పెరిగిందని డేటా రావడంతో, అగ్రరాజ్యంలో ముందస్తు రేటు తగ్గింపు ఆశలు సన్నగిల్లాయి. US ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కనిపిస్తోంది కాబట్టి రేటు తగ్గింపు త్వరలో ప్రారంభం కాకపోవచ్చని విశ్లేషకులు నమ్ముతున్నారు. దీంతో సోమవారం US మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. డౌ జోన్స్ 0.6 శాతం, S&P 500 0.2 శాతం క్షీణించగా, నాస్‌డాక్ 0.1 శాతం పెరిగింది. 


ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం తైవాన్ 1 శాతం ఎగబాకగా, నికాయ్‌, కోస్పి ఫ్లాట్ నోట్‌లో ట్రేడ్ అయ్యాయి.


అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ కొద్దిగా పెరిగి 4.30 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $88 సమీపానికి చేరాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి