Sukanya Samriddhi Yojana Details In Telugu: ఈ రోజుల్లో, ఆడపిల్ల పుడితే, ఆమె చదువు & పెళ్లి, ఇతర ఖర్చుల గురించి పేద & మధ్య తరగతి కుటుంబాల్లోని తల్లిదండ్రులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఆడపిల్ల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళనలు దూరం చేసేందుకు భారత ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోంది. అలాంటి ఒక పథకం పేరు "సుకన్య సమృద్ధి యోజన" (SSY). ఇది చిన్న మొత్తాల పొదుపు పథకం (Small Saving Scheme). పెట్టుబడి పథకంగానూ దీనిని చూడొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన వల్ల... అసలు + బలమైన వడ్డీ రాబడి కలిపి ఆడపిల్లకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. అంతేకాదు, ఆదాయ పన్ను ఆదా రూపంలోనూ ఆ కుటుంబానికి చాలా డబ్బు ఆదా అవుతుంది. ఈ పథకంలో ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, మీ కుమార్తెకు 21 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి భారీ ప్రయోజనాలు పొందొచ్చు.
అధిక వడ్డీ ప్రయోజనం
2024 జులై - సెప్టెంబర్ కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను భారత ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. అయితే, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు, 2024 ఏప్రిల్-జూన్ కాలంలోని వడ్డీ రేట్లనే ఈసారి కూడా కొనసాగించింది. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజన ఖాతా డిపాజిట్లపై 8.20 శాతం వార్షిక వడ్డీ రేటును (Interest Rate On Sukanya Samriddhi Yojana) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. మిగిలిన అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాల కంటే SSYలోనే అధిక వడ్డీ రేటు లభిస్తుంది.
SSY పథకం కింద, ప్రతి ఖాతాదారు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ పథకం కింద, ఖాతాదారులు డిపాజిట్ చేసిన మొత్తంపై చక్రవడ్డీ వడ్డీ ప్రయోజనం పొందుతారు. అమ్మాయి పుట్టిన నాటి నుంచి ఆమెకు 15 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఆమెకు 21 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పెట్టుబడి డబ్బు లాక్ అవుతుంది.
ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది?
ఒక వ్యక్తి, ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి సుకన్య సమృద్ధి యోజనలో ఏటా 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ఆడబిడ్డకు 15 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి ఆమె ఖాతాలో జమ అయ్యే మొత్తం రూ. 15 లక్షలు అవుతుంది. ముందే చెప్పుకున్నట్లు ఆమెకు 21 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆ డబ్బు లాక్ అవుతుంది. SSY కాలిక్యులేటర్ ప్రకారం, అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినప్పుడు, ఆమె ఖాతాలో ఉన్న మొత్తం 46 లక్షల 18 వేల 385 రూపాయలు (రూ. 46,18,385) అవుతుంది. ఇందులో... ఇన్వెస్ట్ చేసిన రూ. 15 లక్షల మొత్తంపై రూ. 31,18.385 వడ్డీ జమ అయింది.
ఆదాయ పన్ను ఆదాయ ప్రయోజనం
సుకన్య సమృద్ధి యోజనను కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, ఒక ఆర్థిక సంవత్సరంలో, ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఖాతా మెచ్యూరిటీ సమయంలో ఖాతాదారు అందుకున్న మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం (Tax-free). ప్రత్యేక పరిస్థితుల్లో, డిపాజిట్ చేసిన మొత్తాన్ని అకౌంట్ మెచ్యూరిటీకి ముందే ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాత, ఆమె చదువుల కోసం ఈ ఖాతా నుంచి 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు, ఖాతా తెరిచిన తర్వాత ఏవైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఎదురైతే, ఖాతా నుంచి డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: రెండుగా విడిపోతున్న రేమండ్ - సింగిల్ మీటింగ్‌లో అడ్డగీత