Sukanya Samriddhi Yojana Benefits: మీ కుమార్తెకు నాణ్యమైన ఉన్నత చదువు చెప్పించాలని మీరు అనుకుంటుంటే, ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ వార్త కచ్చితంగా కోసమే. నిర్దిష్ట సమయానికి చాలా చిన్న మొత్తాలను పెట్టుబడిగా పెడితే చాలు, మీ కుమార్తెకు 70 లక్షల రూపాయలను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు.
మీ కుమార్తెకు రూ.70 లక్షలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని చేరడంలో కేంద్ర ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీకు ఉన్న మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో సుకన్య సమృద్ధి యోజన (SSY) ఒకటి. దీనిలో పెట్టుబడి పెడితే.. మీ అమ్మాయి కళాశాల చదువులకు లేదా వివాహానికి లేదా ఇతర అవసరాలకు చాలా పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది.
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు
సుకన్య సమృద్ధి యోజన ఒక చిన్న మొత్తాల పొదుపు పథకం (Small Saving Scheme). కేంద్ర ప్రభుత్వం 2014లో ఈ పథకాన్ని ప్రారంభించింది. పేరుకు తగ్గట్లే, బాలికల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి & నిర్వహిస్తున్న స్కీమ్ ఇది. ఈ పథకం కింద మీరు జమ చేసే మొత్తంపై కొంత వడ్డీని సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజన ఖాతా మీద ఏడాదికి 8.20% వడ్డీ రేటును (Sukanya Samriddhi Account Interest Rate 2024) కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపదికన మారవచ్చు.
ప్రతి నెల ఐదో తేదీ నుంచి ఆ నెలాఖరు వరకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కిస్తారు. ఆ వడ్డీని ఆ ఆర్థిక సంవత్సరం తర్వాత అకౌంట్‌లో జమ చేస్తారు.
SSY ప్రయోజనాలు (Sukanya Samriddhi Yojana Benefits)
- సుకన్య సమృద్ధి యోజన ప్రభుత్వ పథకం కాబట్టి, దీనిలో జమ చేసే డబ్బుకు నష్ట భయం ఉండదు.
- ఈ అకౌంట్ మీద ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది.
- ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C of the Income Tax Act) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో SSY అకౌంట్‌లో జమ చేసిన మొత్తంపై రూ.1.50 లక్షల వరకు టాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
- సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా వచ్చే వడ్డీ మీద పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు (Tax-free).
SSY ఇతర వివరాలు (Sukanya Samriddhi Yojana Details)
- సుకన్య సమృద్ధి యోజన కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడపిల్లల కోసం బ్యాంక్/పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు.
- ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ట పరిమితి 21 సంవత్సరాలు.
- ఆడపిల్లకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకే SSY ఖాతాలో పెట్టుబడి పెట్టడం వీలవుతుంది. ఆ తర్వాత డబ్బు జమ చేయలేరు.
- సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
- SSY ఖాతాలో జమ చేసిన డబ్బును ఆడపిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పాక్షికంగా, 21 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.
SSY ద్వారా రూ.70 లక్షలు సంపాదించడం ఎలా? (How to earn Rs.70 Lakhs through SSY?)
-మీ కుమార్తెకు ఏడాది వయస్సున్నప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచి, ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు (నెలకు రూ.12,500) పెట్టుబడి పెట్టాలి.
- SSY కాలిక్యులేటర్ ప్రకారం, అకౌంట్ మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.70 లక్షలు (ప్రస్తుత రేట్ ప్రకారం కచ్చితంగా రూ.69.27 లక్షలు) మీ చేతికి వస్తుంది.
- ఇందులో మీ పెట్టుబడి మొత్తం రూ.22.50 లక్షలు.
- 8.20% రేట్ ప్రకారం రూ.46.77 లక్షలు వడ్డీ వస్తుంది.
- మొత్తం కలిపితే, రూ.69.27 లక్షలు అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: స్టాక్ మార్కెట్‌లో ప్రారంభ లాభాలు ఆవిరి, సపోర్ట్‌గా నిలిచిన నిఫ్టీ స్టాక్స్