Personal Loan Vs Gold Loan: మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి. కొందరికి అత్యవసరంగా డబ్బు కావలసివస్తుంది. అలాంటి అర్జెన్సీలో, రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి.. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం, రెండోది.. వ్యక్తిగత రుణం తీసుకోవడం. మొదటిదాన్ని సురక్షిత రుణంగా (Secured loan), రెండో దాన్ని అసురక్షిత రుణంగా (Unsecured loan) బ్యాంక్‌లు/ఆర్థిక సంస్థలు భావిస్తాయి. అర్హతల ఆధారంగా ఈ రెండు లోన్లూ తక్షణమే లభిస్తాయి, ఆర్థిక అవసరాలను తీరుస్తాయి.
పర్సనల్ లోన్ Vs గోల్ లోన్‌లో దేనిని ఎంచుకోవడం ఉత్తమం అన్నది.. లోన్ ఆమోదం, వడ్డీ రేటు, రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలం వంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది.
1. రుణం ఇచ్చే అవకాశాలు
ఇంతకముందే చెప్పుకున్నట్లు, వ్యక్తిగత రుణం అనేది అసురక్షిత రుణం కిందకు వస్తుంది. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, నెలవారీ ఆదాయం, చేసే పని, బ్యాంక్/ఆర్థిక సంస్థతో సంబంధాలు, తీసుకునే లోన్ మొత్తం, తిరిగి చెల్లించే కాలం, EMI వంటి విషయాలపై ఆధారపడి లోన్ మంజూరు కావచ్చు/కాకపోవచ్చు. గోల్డ్ లోన్ దీనికి విరుద్ధం. మన బంగారాన్ని తాకట్టు పెడతాం కాబట్టి, బ్యాంక్‌లు మరోమాట మాట్లాడకుండా లోన్ శాంక్షన్ చేస్తాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్లకు ఇది సరైన ఆప్షన్.
2. రుణం మంజూరు సమయం
బ్యాంక్/ఆర్థిక సంస్థలో రద్దీ లేకపోతే, గోల్డ్ లోన్‌ను అరగంటలో తీసుకోవచ్చు. రద్దీ ఎక్కువగా ఉంటే కొన్ని గంటలు పట్టొచ్చు. ఇక.. ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ ఉంటే, కేవలం 5 నిమిషాల్లో వ్యక్తిగత రుణం మంజూరవుతుంది. ప్రి-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ లేకపోతే, బ్యాంక్‌కు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. ఆ తర్వాత 2 నుంచి 7 రోజుల్లో లోన్ వస్తుంది.
3. వడ్డీ రేటు
సాధారణంగా, వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు 10.5% నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా రుణగ్రహీత క్రెడిట్ స్కోర్, నెలవారీ ఆదాయం వంటి విషయాలపై ఆధారపడుతుంది. గోల్డ్ లోన్ వడ్డీ రేటు బ్యాంక్‌ను బట్టి మారుతుంది. ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి, సాధారణంగా వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. పైగా, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే బంగారం రుణాలు తక్కువ వడ్డీకి దొరుకుతాయి. అయితే.. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవాళ్ల విషయంలో.. ఈ రెండు వడ్డీ రేట్ల మధ్య పెద్దగా తేడా ఉండకపోవచ్చు.
4. రుణం మొత్తం
సాధారణంగా, వ్యక్తిగత రుణం రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు లభిస్తాయి. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఈ పరిమితిని రూ.50 లక్షల వరకు కూడా బ్యాంక్‌లు పొడిగిస్తాయి. బంగారం రుణం విషయంలో.. లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిపై లోన్ అమౌంట్ ఆధారపడి ఉంటుంది. అంటే... తాకట్టు పెట్టి తీసుకునే బంగారం మార్కెట్ విలువలో నిర్దిష్ట శాతాన్ని లోన్ రూపంలో బ్యాంక్ ఇస్తుంది. RBI రూల్ ప్రకారం, LTV నిష్పత్తి 75%గా ఉంది. దీనికి మించి లోన్ రాదు.
5. రుణం తిరిగి చెల్లించే వ్యవధి
సాధారణంగా, వ్యక్తిగత రుణాన్ని తిరిగి తీర్చే గడువు ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల మధ్య ఉంటుంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా కొంతమందికి 7-8 వరకు ఈ గడువు ఇస్తారు. బంగారం రుణాలు దీనికి విరుద్ధం. ఒక ఏడాదిలో తిరిగి చెల్లించాలి. ఈలోగా బాకీ కట్టలేకపోతే, లోన్‌ను రెన్యువల్ చేయించుకోవాలి.
6. తిరిగి చెల్లింపు
రుణగ్రహీత చూసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం నెలవారీ వాయిదా మొత్తం (EMI). తీసుకునే లోన్ మొత్తం, తిరిగి చెల్లించే కాలం ఆధారంగా EMI నిర్ణయమవుతుంది. ఇందులోనే అసలు + వడ్డీ కలిసి ఉంటుంది. నెలనెలా తక్కువ మొత్తాన్ని చెల్లించాలనుకుంటే, మొత్తం EMIల నంబర్ పెరుగుతుంది. ప్రతినెలా ఎక్కువ మొత్తం చెల్లిస్తే, మొత్తం EMIల సంఖ్య తగ్గుతుంది. రుణగ్రహీత సౌలభ్యం మేరకు EMIని ఎంచుకోవచ్చు.
గోల్డ్ లోన్, పర్సనల్ లోన్‌లో ఏది బెస్ట్ ఆప్షన్ అన్నది.. రుణగ్రహీత అర్హత, అవసరం, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: ఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్న క్రెడిట్ కార్డ్‌లు, భలే ఛాన్స్!