Types of Discounts on Health Insurance Premiums: ప్రస్తుతం, సంపన్నులు కూడా భరించలేని స్థాయిలో ఆరోగ్య ద్రవ్యోల్బణం (Health inflation) ఉంది. సామాన్యుల భాషలో చెప్పాలంటే... ఆసుపత్రికి వెళితే ఆస్తులు రాయించుకుంటున్నారు. కాబట్టి, ఈ రోజుల్లో ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి అవసరం. ఒక వ్యక్తి, కాస్త పెద్ద జబ్బుతో 6 రోజులు ఆసుపత్రిలో ఉంటే చాలు... అతని 60 కష్టార్జితం హారతి కర్పూరం అవుతోంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే... ఒకవైపు ఒళ్లు గుల్ల, మరోవైపు ఆస్తిపాస్థులన్నీ ఆసుపత్రి పాలు.
తడిసి మోపెడయ్యే బిల్లులు భారం ఆ కుటుంబం మీద పడకుండా, భయపడకుండా చేసేదే ఆరోగ్య బీమా. అత్యవసర అనారోగ్య ఇబ్బందుల నుంచి రక్షణ కవచంలా నిలుస్తుంది ఒక సంపూర్ణ ఆరోగ్య బీమా (Comprehensive health insurance). ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, తీసుకోవాలనుకుంటున్నా... తక్కువ ఖర్చయ్యే తూతూమంత్రపు ప్లాన్‌తో కాకుండా, ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవడం చాలా ముఖ్యం. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు - కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు మధ్య ప్రీమియంలో పెద్ద తేడా ఉండదు.
ఆరోగ్య బీమా ప్రీమియం రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో, మన దేశంలో మెజారిటీ ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీకి దూరంగా ఉంటున్నారు. చాలా మంది ఆర్థిక పరిస్థితులు నిజంగానే దీనికి సహకరించకపోవచ్చు. కానీ... హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేని వ్యక్తికి హెల్త్ ఎమర్జెన్సీ వస్తే... సేవింగ్స్/ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కరిగిపోయి, ఆ కుటుంబంలోని పిల్లల భవిష్యత్ మీద కూడా నీలినీడలు కమ్ముకుంటాయని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు, చాలా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల మీద వివిధ రకాల రాయితీలు (Discounts on Health Insurance Premiums) అందిస్తున్నాయి. వాటిని సరిగ్గా వాడుకుంటే, తక్కువ ధరకే మంచి ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు.
ఆరోగ్య బీమా రాయితీల రకాలు (Types of Health Insurance Discounts)
1) నో క్లెయిమ్ బోనస్ (No Claim Bonus)
నో క్లెయిమ్ బోనస్ లేదా NCB అంటే... ఒక పాలసీదారు, ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేయకపోతే, ఆ ఆరోగ్య బీమా పాలసీని రెన్యువల్ చేసే సమయంలో (తర్వాతి సంవత్సరం కూడా కొనసాగించే సమయంలో) ప్రీమియం మీద డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ 5% నుంచి 100% వరకు ఉండొచ్చు. ప్రతి సంవత్సరం ఈ డిస్కౌంట్ రేట్ పెరుగుతూ వెళ్లే అవకాశం కూడా ఉంది.
2) ఫ్యామిలీ ప్లాన్‌లో తగ్గింపు (Family Discount)
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యుల కోసం ఒక వ్యక్తి పాలసీని కొనుగోలు చేస్తే, చెల్లించాల్సిన ప్రీమియంలో రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు... ఇద్దరు కుటుంబ సభ్యుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే 5%, ముగ్గురి కోసం కొనుగోలు చేస్తే 10% తగ్గింపు పొందొచ్చు. ఇలా.. ప్లాన్‌పై ఆధారపడి 5% నుంచి 20% వరకు రాయితీ లభిస్తుంది.
3) దీర్ఘకాలిక తగ్గింపు/ బహుళ-సంవత్సరాల తగ్గింపు (Long-term Discount/ Multi-year Discount)
ఒకేసారి ఎక్కువ సంవత్సరాల కోసం పాలసీ తీసుకుంటే డిస్కౌంట్ లభిస్తుంది. ఉదాహరణకు... 2-సంవత్సరాల పాలసీ తీసుకుంటే 5%, 3-సంవత్సరాల పాలసీ కొంటే 10% డిస్కౌంట్ అందుబాటులో ఉండొచ్చు. కొనుగోలు చేసే ప్లాన్‌ను బట్టి ఇది 4% నుంచి 12.5% వరకు ఉంటుంది.
4) వెల్‌నెస్ డిస్కౌంట్/ ఫిట్‌నెస్ డిస్కౌంట్ (Wellness Discount/ Fitness Discount)
కంపెనీ నిర్దేశించిన ఫిట్‌నెస్ లక్ష్యాలు సాధించే పాలసీదార్లకు ప్రీమియంలో డిస్కౌంట్ లభిస్తుంది. ఉదాహరణకు.. ప్రతి రోజూ నడవడం, జిమ్‌కు వెళ్లడం, యోగా చేయడం వంటివి చేస్తే చాలు. రెన్యువల్ ప్రీమియం మీద 100% వరకు ఫిట్‌నెస్ డిస్కౌంట్ తీసుకోవచ్చు. అంటే, దాదాపు ఫ్రీగా ప్లాన్‌ను రెన్యువల్ చేసుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా కవరేజ్‌లో ఉండొచ్చు. దీనిపై పూర్తి వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా చూడొచ్చు.
మరో ఆసక్తికర కథనం: మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని 'ఫ్రీ'గా పొందొచ్చు, చాలా కంపెనీల్లో ఆఫర్స్
5) ఆన్‌లైన్ డిస్కౌంట్/డైరెక్ట్ బిజినెస్ డిస్కౌంట్ (Online Discount/ Direct Business Discount)
ఏజెంట్‌తో సంబంధం లేకుండా, ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో నేరుగా హెల్త్ పాలసీని కొనుగోలు చేస్తే, ప్రీమియం చెల్లింపుపై తగ్గింపు పొందొచ్చు. సాధారణంగా, బీమా కంపెనీలు 5% నుంచి 10% వరకు ఆన్‌లైన్ డిస్కౌంట్ ఇస్తాయి.
6) లాయల్టీ డిస్కౌంట్ (Loyalty Discount)
ఒకే బీమా సంస్థ నుంచి రెండు, మూడు రకాల పాలసీలు తీసుకుంటే లాయల్టీ డిస్కౌంట్ దొరుకుతుంది. ఉదాహరణకు.., మీరు A అనే బీమా కంపెనీ నుంచి కార్ ఇన్సూరెన్స్ పాలసీ (car insurance) తీసుకున్నారనుకుందాం. అదే బీమా సంస్థ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తే లాయల్టీ డిస్కౌంట్ పొందొచ్చు. సాధారణంగా, బీమా కంపెనీలు 5% నుంచి 10% వరకు ఈ రకమైన రాయితీ ఇస్తాయి.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కొనేందుకు గుడ్ ఛాన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే