Special Benefit Of Women Home Loan Borrowers: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ కోత ప్రారంభించడంతో ప్రజల దృష్టి బ్యాంక్ లోన్లపైకి మళ్లింది. గృహ రుణాల కోసం బ్యాంక్‌ల దగ్గర గతం కంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలవుతున్నాయి. స్థిరాస్తుల ధరలు పెరుగుతుండడంతో పాటు మరిన్ని రేటు కోతలు ఉంటాయన్న అంచనాలతో ఎక్కువ మంది హోమ్ లోన్‌ల కోసం అప్లై చేసుకుంటున్నారు.
మన దేశంలో, మహిళల పేరిట తీసుకునే హోమ్ లోన్‌లు లాభదాయకంగా ఉంటాయి. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంక్‌లు కూడా మహిళా రుణగ్రహీతలను ప్రోత్సహించడానికి కొన్ని ప్రయోజనాలు అందిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్టాంప్ డ్యూటీలో రాయితీ, ఆదాయ పన్ను ప్రయోజనాలు, ప్రత్యేక రుణ పథకాలు వంటివి ఆఫర్ చేస్తున్నాయి. ఈ తరహా ప్రోత్సాహకాలతో, మహిళల ఆధ్వర్యంలో, సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు. మనకంటూ ఓ సొంత ఇల్లు ఉంటే దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది.
తక్కువ వడ్డీ రేట్లు
గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునే మహిళ సింగిల్‌గా లేదా కో-అప్లికెంట్ ఉన్నా వడ్డీ రేటు తగ్గుతుంది. చాలా బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మహిళా రుణగ్రహీతలకు వడ్డీ రేట్లపై 0.05 శాతం నుంచి 0.10 శాతం రాయితీ ఇస్తున్నాయి. చూడడానికి ఇది చిన్న వ్యత్యాసంగా అనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో కొన్ని లక్షల రూపాయలు ఆదా అవుతాయి. అంత డబ్బు ఆదా అవుతుంది.
ఉదాహరణకు... ఒక వ్యక్తి 8.70 శాతం వడ్డీ రేటుతో 30 సంవత్సరాల కాలానికి రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడనుకుందాం. మంత్లీ EMI దాదాపు రూ.39,157 అవుతుంది, వడ్డీతో కలిపి బ్యాంక్‌కు తిరిగి చెల్లించే మొత్తం దాదాపు రూ.1.40 కోట్లకు చేరుతుంది. మహిళ పేరిట అప్లై చేసినప్పుడు వడ్డీ రేటు 8.60 శాతానికి తగ్గిందనుకుందాం. ఇప్పుడు, EMI కూడా రూ.38,801కి తగ్గుతుంది, తిరిగి చెల్లించే మొత్తం రూ.1.39 కోట్లు అవుతుంది. వడ్డీలో ఈ స్వల్ప మార్పు ఫలితంగా సుమారు రూ.1.28 లక్షలు ఆదా అవుతుంది. అంతేకాదు, ఒక మహిళ కో-అప్లికెంట్‌గా ఉంటే, బ్యాంక్ ఇచ్చే లోన్ మొత్తం కూడా పెరుగుతుంది. ఓ మహిళ తోడుగా ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది.
రెట్టింపు ఆదాయ పన్ను ప్రయోజనాలు
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, హోమ్ లోన్ అసలుపై సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సెక్షన్ 24(b) కింద వడ్డీపై సంవత్సరానికి రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఆ లోన్‌లో మహిళా పేరు కూడా ఉంటే, రుణగ్రహీత & సహ-రుణగ్రహీత ఇద్దరూ వ్యక్తిగతంగా తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు, పన్ను ప్రయోజనాలను రెట్టింపు చేసుకోవచ్చు. ఇద్దరూ చెరిసగం EMI కడుతుంటేనే ఇది వర్తిస్తుంది.
ప్రభుత్వ మద్దతు
మహిళల ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ స్టాంప్ డ్యూటీ ప్రయోజనాలను అందిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు, మహిళలు కొనుగోలు చేసిన ఆస్తులకు స్టాంప్ డ్యూటీలో 1-2 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నాయి. దీనివల్ల రూ.1.50 కోట్ల విలువైన ఆస్తిపై రూ.2.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వం కూడా మహిళల ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి వివిధ గృహ పథకాలు అమలు చేస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద మహిళా దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మొదటిసారి ఇల్లు కొనే మహిళతో కలిసి ఈ పథకం కింద అప్లై చేసుకుంటే, క్రెడిట్ సబ్సిడీ కూడా లభిస్తుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, వడ్డీ రేటులో 6.5 శాతం వరకు రాయితీ సహా కొన్ని రకాల ప్రయోజనాలు అందుకోవాలంటే మహిళా సహ-దరఖాస్తుదారు ఉండటం తప్పనిసరి.
అధిక రుణ అర్హత
పొదుపు విషయంలో మహిళలు క్రమశిక్షణ, తెలివిని బ్యాంక్‌లు ఇప్పటికే గుర్తించాయి. అంతేకాదు, పురుషులతో పోలిస్తే మహిళా రుణగ్రహీతలలో లోన్‌లు ఎగ్గొట్టేవాళ్లు అతి స్వల్పం. కాబట్టి, మహిళల పేరిట గృహ రుణాలు మంజూరు చేయడానికి బ్యాంక్‌లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. అంతేకాదు, మహిళకు స్థిరమైన ఆదాయం & మంచి క్రెడిట్ స్కోరు ఉంటే, లోన్ రూల్స్ సరళంగా మారతాయి. ఇది, ఆమెతో పాటు కో-అప్లికెంట్‌కు కూడా ప్రయోజనమే.
సొంతింటి కలను నిజం చేయడంలో మగవారికి సాయం చేయడంలోనే కాదు.. ఇంటిని & సమాజాన్ని చక్కదిద్దడంలోనూ ముందడుగులో ఉన్న మగువలందరికీ 'abp దేశం' తరపున 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు'.
మరో ఆసక్తికర కథనం: ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు - ఈ నెలాఖరు వరకే గోల్డెన్ ఛాన్స్!