No Change In Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశ ప్రజలకు ముచ్చటగా మూడోసారి కూడా ఊరట ప్రకటించింది. మార్కెట్ ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే రెపో రేట్‌ను పెంచకుండా, యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో, మళ్లీ జరిగే MPC మీటింగ్ వరకు రెపో రేట్ 6.50% వద్దే కొనసాగుతుంది. రెపో రేట్ పెరగలేదు కాబట్టి బ్యాంకులు కూడా లోన్ల మీద వడ్డీ రేట్లు పెంచకపోవచ్చు. ఫలితంగా... ఇప్పటికే తీసుకున్న, కొత్తగా తీసుకోబోతున్న అప్పులపై వడ్డీల భారం పెరిగే అవకాశం దాదాపుగా ఉండదు. అయితే, రెపో రేట్ తగ్గిస్తారోమోనని ఎదురు చూసిన ప్రజలకు మాత్రం నిరాశ ఎదురైంది.
ఈ నెల 8న ప్రారంభమై ఈరోజు (ఆగస్టు 10) ముగిసిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) ప్రకటించారు.
ద్రవ్యోల్బణం తగ్గించడంపై దృష్టి
మళ్లీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై ఆర్‌బీఐ ఫోకస్ పెట్టిందని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి యథాతథంగా ఉంటుందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. దేశంలో ఇన్‌ఫ్లేషన్, RBI లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, దానిని 4 శాతానికి తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ కృషి చేస్తోందన్నారు. ప్రధాన ద్రవ్యోల్బణం రేటు తగ్గుతోంది, దీని ప్రభావం పాలసీ రేట్లపై కూడా కనిపిస్తుందని చెప్పారు. జులై-ఆగస్టులో ఇన్‌ఫ్లేషన్ రేటు ఎక్కువగా ఉంటుందని, ప్రధానంగా, కూరగాయల ద్రవ్యోల్బణం పెరగడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
ద్రవ్యోల్బణం అంచనా పెంచిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్, 2024 ఆర్థిక సంవత్సరానికి (2023-24) ద్రవ్యోల్బణం అంచనాను పెంచింది. 2023-24లో CPI ఇన్‌ఫ్లేషన్ రేట్ 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది, గతంలో 5.1 శాతం వద్ద అంచనా ప్రకటించింది. ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భారత ఆర్థిక వ్యవస్థ బాగా పని చేసిందని, మంచి పురోగతిని సాధించిందని శక్తికాంత దాస్ చెప్పారు.
GDP వృద్ధిపై RBI అంచనా
FY24లో భారత GDP వృద్ధి 6.50 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. RBI గవర్నర్ చెబుతున్న ప్రకారం, ఈ గ్రోత్ రేట్ చాలా దేశాల కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రపంచ స్థాయిలో అనిశ్చితులు ఉన్నప్పటికీ... భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు, దేశ స్థూల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంది. భారతదేశం, ప్రపంచ ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్‌గా మారిందని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కోవడంలో ఇతర దేశాల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. అందుకే, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.50 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ లెక్క కట్టింది.
రెపో రేట్‌తో పాటు రివర్స్ రెపో రేట్‌ను కూడా ఆర్‌బీఐ మార్చలేదు, 3.35% వద్దే కంటిన్యూ చేసింది. MSF బ్యాంక్ రేట్ కూడా 6.75 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంది.
తదుపరి MPC మీటింగ్ ఈ ఏడాది అక్టోబర్ 4,5,6 తేదీల్లో జరుగుతుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో (FY23), RBI మొత్తం ఆరు సార్లు రెపో రేటును పెంచింది. ఈ ఆరు దఫాల్లో కలిపి మొత్తం 2.50 శాతం (250 బేసిస్ పాయింట్లు) పెంచింది, రెపో రేటును 4,00 శాతం నుంచి 6.50 శాతానికి తీసుకెళ్లింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు (ఏప్రిల్, జూన్, ఆగస్టు) క్రెడిట్ పాలసీ మీటింగ్స్‌లోనూ రెపో రేట్లలో రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి మార్పు చేయలేదు.
తేదీ రేపో రేటు మార్పు (బేసిస్ పాయింట్లు)
10-ఆగస్టు-2023 6.50% 0
08-జూన్-2023 6.50% 0
06-ఏప్రిల్-2023 6.50% 0
08-ఫిబ్రవరి-2023 6.50% 25
07-డిసెంబర్-2022 6.25% 35
30-సెప్టెంబర్-2022 5.90% 50
05-ఆగస్టు-2022 5.40% 50
08-జూన్-2022 4.90% 50
04-మే-2022 4.40% 40
09-అక్టోబర్ 2022 4.00% 0
మరో ఆసక్తికర కథనం: కొండ దిగుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి