Insurance Policy New Rules: ప్రతి ఇన్సూరెన్స్‌ పాలసీలో కొన్ని ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు ఉంటాయి. పాలసీని అమ్మే సమయంలో ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు (Insurance Agents) లాభాల గురించి మాత్రమే చెబుతారు, ఇబ్బందులు గురించి చెప్పరు. ఆ పాలసీని క్లెయిమ్‌ ‍‌(Policy Claim) చేసుకునే సమయంలోనే కష్టనష్టాల గురించి పాలసీదారుకు తెలుస్తాయి. అప్పటికే పాలసీదారు ఆ పాలసీని కొనుగోలు చేసి ఉంటారు కాబట్టి, బాధ పడడం తప్ప మరో మార్గం ఉండదు. ఇకపై, పాలసీ ఏజెంట్ల తప్పుడు పప్పులు ఉడకవు.


భవిష్యత్‌లో, బీమా ఏజెంట్లు మిమ్మల్ని మోసం చేయలేరు. ఏదైనా ప్లాన్ గురించి మీకు చెబుతున్నప్పుడు ఆడియో-వీడియో రికార్డ్‌ ‍‌(Audio-Video Recording) చేయాలి, పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలి. దీనివల్ల 'మిస్ సెల్లింగ్‌' కేసులకు అడ్డుకట్ట పడుతుంది. 


భారీగా పెరిగిన మిస్ సెల్లింగ్ (Miss selling) కేసులు
తప్పుడు సమాచారం అందించి ప్రజలకు బీమా పాలసీలను అంటగడుతున్న కేసులు ఇటీవలి కాలంలో  విపరీతంగా పెరిగాయి. వీటివల్ల, వినియోగదార్ల ఫోరంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వీటిని తగ్గించేందుకు త్వరలో కొత్త నిబంధన రావచ్చు. దీనిపై, కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. బీమా పాలసీల అమ్మకాలకు సంబంధించిన నిబంధనలను మార్చాలని సూచించింది. బీమా ఏజెంట్లు పాలసీ పూర్తి నిబంధనలు & షరతులు (Insurance Policy Terms & Conditions) లేదా సారాంశాన్ని చదవేలా రూల్‌ తీసుకురావాలని వినియోగదార్ల వ్యవహారాల శాఖ ఆ లేఖలో కోరింది.


T&C తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వివాదాలు
వినియోగదార్ల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ సింగ్‌కు లేఖ రాశారు. నిబంధనలు & షరతుల (T&C) గురించి తప్పుడు అవగాహన వల్లే వినియోగదార్లు - బీమా ఏజెంట్ల మధ్య చాలా వివాదాలు చోటు చేసుకుంటున్నాయని లేఖలో రాశారు. బీమా ఏజెంట్లు పాలసీలోని సానుకూల అంశాలను మాత్రమే వినియోగదారులకు చెబుతున్నారని, ప్రతికూల విషయాలను దాస్తున్నారని, భవిష్యత్తులో అనేక వివాదాలకు ఇదే కారణం అవుతోందని పేర్కొన్నారు. బీమా పాలసీ నిబంధనలు & షరతుల్లో అస్పష్టమైన, గంభీమైన భాష గురించి కూడా రోహిత్ కుమార్ సింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు. కష్టమైన భాష అర్ధం కాక వల్ల వినియోగదార్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని, బీమా పాలసీ నిబంధనలు & షరతులను స్థానిక భాషల్లో కూడా వివరించాలని రోహిత్ కుమార్ సింగ్ రాశారు.


చాలా సందర్భాల్లో, పాలసీ హోల్డర్‌ క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసినప్పుడు, బీమా కంపెనీలు వారికి కొత్త నిబంధనలు చెబుతున్నాయి. దీంతో వివాదాలు తలెత్తి వినియోగదార్ల కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. 


వైద్య బీమా విషయంలో, 24 గంటల అడ్మిషన్ రూల్‌ను (24 గంటలకు తగ్గకుండా ఇన్‌ పేషెంట్‌గా ఆసుపత్రిలో ఉంటేనే పాలసీ వర్తింపు నిబంధన) రద్దు చేయాలని 'జాతీయ వినియోగదార్ల వివాదాల పరిష్కార కమిషన్' అధ్యక్షుడు జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సిఫార్సు చేశారు.


ఈ సమస్యపై తుది నిర్ణయాన్ని 'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (IRDAI) తీసుకోవాలి. బీమా రంగంలో నిబంధనలను IRDAI నిర్ణయిస్తుంది. 


మరో ఆసక్తికర కథనం: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు పెంచిన పెద్ద బ్యాంకులు, కొత్త సంవత్సరంలో ఎక్కువ ఆదాయం