Insurance With Debit Card: మన దేశంలో మెజారిటీ జనాభాకు బ్యాంక్ అకౌంట్లు, ATM కార్డులు (డెబిట్ కార్డ్) ఉన్నాయి. డెబిట్ కార్డ్‌తో ATMల నుంచి డబ్బులు తీసుకుంటాం, ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం ఉపయోగిస్తాం. అయితే, ఈ కార్డ్‌తో ఇంతకుమించిన బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం చాలామందికి తెలీదు.
ATM కార్డ్ విషయంలో ఎక్కువ మందికి తెలీని కీలక ఉపయోగాల్లో ఒకటి "ఉచిత బీమా కవరేజ్". ఒక బ్యాంకు తన కస్టమర్‌కి ఏటీఎం కార్డు జారీ చేసిన క్షణం నుంచి, ఆ ఖాతాదారు ప్రమాద బీమా, జీవిత బీమా కవర్‌లోకి వస్తాడు. దీని కోసం కస్టమర్ ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన పని లేదు, ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకులే ఆ పని చూసుకుంటాయి. ఏటా, ATM కార్డ్‌హోల్డర్‌తో సంబంధం లేకుండా బ్యాంకులే దానిని రెన్యువల్ చేస్తుంటాయి. ఒకవేళ, ATM కార్డ్‌హోల్డర్‌కు ఏదైనా జరిగి, ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే... బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకోవడమే గానీ, అదనంగా చేయాల్సిన పనేమీ ఉండదు.
ATM కార్డ్ హోల్డర్ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైతే, ఆ కార్డ్‌పై ఉన్న ఇన్సూరెన్స్ డబ్బు అతని వైద్య ఖర్చులకు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుంది. కార్డ్ యజమాని ప్రమాదంలో ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోతే... బాధితుడికి రూ. 50,000 ప్రమాద బీమా లభిస్తుంది. రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోతే లక్ష రూపాయల బీమా మొత్తం లభిస్తుంది. దురదృష్టవశాత్తు కార్డ్‌హోల్డర్ మరణిస్తే, లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు బీమా మొత్తం అతని కుటుంబానికి అందుతుంది.
ATM కార్డ్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఒక నిబంధన ఉంది. ప్రమాదానికి గురైన కార్డుదారు, ఆ ప్రమాదానికి కనీసం 45 రోజుల ముందు ఆ ATM కార్డ్‌ను ఒక్కసారైనా ఉపయోగించి ఉండాలి. అప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది.
కార్డు రకాన్ని బట్టి ఇన్సూరెన్స్ కవర్
బ్యాంకులు తమ కస్టమర్లకు చాలా రకాల డెబిట్ కార్డులు జారీ చేస్తాయి. కార్డ్ కేటగిరీని బట్టి దాని వల్ల లభించే ఇన్సూరెన్స్ కవర్ మారుతుంది. కస్టమర్లకు, ATM క్లాసిక్ కార్డ్ మీద రూ. 1 లక్ష, ప్లాటినం కార్డ్ మీద రూ. 2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డ్ మీద రూ. 50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డ్ మీద రూ. 5 లక్షలు, వీసా కార్డ్ మీద రూ. 1.5-2 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతాదార్లకు అందిన రూపే కార్డు మీద రూ. 1 నుంచి 2 లక్షల వరకు బీమా ఉంటుంది.
ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలి?
ATM కార్డ్ మీద ప్రమాద బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి, సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు కార్డుదారు దరఖాస్తు చేసుకోవాలి. ప్రమాదం జరిగిందని నిర్ధరించే FIR కాపీ, హాస్పిటల్ ట్రీట్‌మెంట్ పేపర్లు సమర్పించాలి. ఒకవేళ కార్డుదారు మరణిస్తే, అతని నామినీ సంబంధిత బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డుదారు మరణ ధృవీకరణ పత్రం, FIR కాపీ, డిపెండెంట్ సర్టిఫికేట్ వంటి పేపర్లు ఇందుకు అవసరం అవుతాయి. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదిస్తే, దీని గురించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ బెనిఫిట్ గురించి మీ బంధుమిత్రులందరికీ చెప్పండి. ఆపద సమయంలో వాళ్లకూ ఇది ఉపయోగపడుతుంది.
మరో ఆసక్తికర కథనం: కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం - మనకు బాగానే ఉంటుంది, మిగిలిన ప్రపంచమంతా ఏడుస్తుంది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial