Income Tax Saving Tips: 2023-24 ఆర్థిక సంవత్సరం క్లైమాక్స్‌లో మనం ఉన్నాం. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుని & ఆదాయ పన్నును ఆదా చేసే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ కోసం చూస్తుంటే, మీకు ఇదే చివరి అవకాశం. పన్ను ఆదా చేసే పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు 31 మార్చి 2024 వరకే టైమ్ ఉంది. ఉంది. ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడితో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. విశేషం ఏంటంటే.. ఆదివారం అయినప్పటికీ మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంటాయి, ఈ తరహా లావాదేవీలను అనుమతిస్తాయి.
ఆదాయ పన్ను ఆదా చేసే పెట్టుబడులు/పథకాలు (Income tax saving investments/schemes):
1. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)
నేషనల్ పెన్షన్ సిస్టమ్ బాగా పాపులర్ అయిన పెట్టుబడి పథకం. దీనిలో డబ్బు డిపాజిట్ చేయడం ద్వారా పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో సంపద సిద్ధం చేసుకోవచ్చు. NPSలో పెట్టుబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా పొందుతారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C of the Income Tax Act) కింద, రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఈ మినహాయింపు లభిస్తుంది.
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
PPF అని షార్ట్‌కట్‌లో పిలుచుకునే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కూడా బాగా జనాదరణ పొందిన పథకాల్లో ఒకటి. దీనిలో డబ్బు జమ చేస్తూ పోతే, దీర్ఘకాలంలో బలమైన ఫండ్‌ను సృష్టించడంతో పాటు ఏటా ఆదాయ పన్ను భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఈ పథకం కింద, ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం లాక్ ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ఈ పథకంలో జమ చేసే డబ్బు కూడా ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ. 1.50 లక్షల మినహాయింపు పొందొచ్చు.
3. బీమా ప్రీమియం ద్వారా పన్ను మినహాయింపు (Tax exemption through insurance premium payment)
ఈ నెలాఖరు (మార్చి 31) లోగా బీమా ప్రీమియం చెల్లించినట్లయితే, ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24) ITR ఫైల్ చేసే సమయంలో ఆ మొత్తాన్ని మినహాయింపు కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద. బీమా ప్రీమియం చెల్లింపులపై రూ. 1.50 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. పాత పన్ను పాలన (Old tax regime) విధానానికే ఇది వర్తిస్తుంది, కొత్త పన్ను విధానానికి (New tax regime) కాదు.
4. పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ (Tax saving fixed deposit)
మంచి పెట్టుబడి ఎంపికల్లో.. ఆదాయ పన్నును ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి ద్వారా మంచి వడ్డీ ఆదాయం, పన్ను మినహాయింపు రెండూ అందుతాయి. టాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ స్కీమ్ కింద, సాధారణంగా, అన్ని బ్యాంకులు 5 సంవత్సరాల FDలను అందిస్తాయి. ఇంతకంటే తక్కువ కాల పరిమితితో ఉండే ఎఫ్‌డీలకు పన్ను ప్రయోజనం లభించదు. పన్ను ఆదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఆదాయ పన్ను సెక్షన్ 80C కిందకు వస్తాయి, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి