Financial Matters: సాధారణంగా, ఒక ఆర్థిక సంవత్సరంలో ముగించాల్సిన కార్యక్రమాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. గడువులోగా వాటిని పూర్తి చేయకపోతే ఆర్థికం నష్టం కలగొచ్చు లేదా ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఇప్పుడు, 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. ఈ ఏడాదిలోనూ కొన్ని డబ్బు సంబంధ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజయిన మార్చి 31 (ఆదివారం) వరకే దీనికి గడువుంది. నిర్లక్ష్యం చేసినా, మర్చిపోయినా జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. మీ కోసం ఈ శని, ఆదివారాల్లో బ్యాంక్‌లు, ఎల్‌ఐసీ ఆఫీస్‌లు తెరిచే ఉంటాయి.


2024 మార్చి 31 లోగా పూర్తి చేయాల్సిన పనులు:


- PPF ఖాతాదార్లు ప్రతి ఆర్థిక సంవత్సరం తన ఖాతాలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే, ఆ ఖాతాను తాత్కాలికంగా నిలిపేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో PPF అకౌంట్‌లో డబ్బులేవీ డిపాజిట్‌ చేయకపోతే, మార్చి 31 లోగా కనీసం రూ.500 జమ చేయాలి. మినిమమ్‌ డిపాజిట్‌ చేయని ఖాతా ఇన్‌-యాక్టివ్‌గా మారతుంది. అప్పుడు ఆ ఖాతా నుంచి విత్‌డ్రా చేయలేరు, రుణం తీసుకోలేరు. నిష్క్రియంగా మారిన PPF ఖాతాను తిరిగి క్రియాశీలం (Activate) చేసుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి రూ. 50 చొప్పున జరిమానా చెల్లించాలి. జరిమానాతో పాటు, వార్షిక కనీస డిపాజిట్‌ రూ. 500 కూడా డిపాజిట్ చేయాలి. 


- సుకన్య సమృద్ధి యోజన ఖాతాకు (SSY) కూడా కనీస డిపాజిట్‌ రూల్‌ వర్తిస్తుంది. మీకు SSY అకౌంట్‌ ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 డిపాజిట్ చేసి ఉండాలి. మీరు ఇప్పటికీ ఈ డబ్బును డిపాజిట్ చేయకపోతే మీ ఖాతా తాత్కాలికంగా ఫ్రీజ్‌ అవుతుంది. ఖాతాను తిరిగి క్రియాశీలం చేయడానికి ఏడాదికి రూ. 50 చొప్పున జరిమానా + కనీస మొత్తం రూ. 250 చొప్పున డిపాజిట్ చేయాలి. 


- మీకు మ్యూచువల్‌ ఫండ్స్‌లో (Mutual Fund) మదుపు చేస్తుంటే, మీ KYCని అప్‌డేట్‌ చేయాలి. కేవైసీ కోసం ఇప్పటికీ అధికారిక గుర్తింపు పత్రాలు సమర్పించకపోతే, ఈ రోజే తగిన వివరాలు సమర్పించడం ఉత్తమం.


- మీకు బ్యాంక్‌ అకౌంట్‌ (Bank Account) ఉంటే.. ఆ ఖాతాకు సంబంధించి కూడా KYC అప్‌డేట్‌ చేయాలి. ఇందుకోసం మీ ఆధార్‌, పాన్‌ కార్డ్‌ జిరాక్స్‌లు తీసుకుని బ్యాంక్‌కు వెళ్లాలి. KYC అప్‌డేషన్‌ కోసం బ్యాంక్‌లు కూడా తమ కస్టమర్లకు ఫోన్లు చేస్తున్నాయి.


- సొంతిల్లు కొనడం కోసం హోమ్‌ లోన్‌ (Home Loan) తీసుకోవాలనుకుంటుంటే.. చాలా బ్యాంక్‌లు, హోమ్‌ లోన్‌ ఇచ్చే సంస్థలు ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. మార్చి 31 వరకే ఈ ప్రత్యేక అవకాశం.


- స్టేట్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం అమృత్‌ కలశ్‌ (SBI Amrit Kalash FD) గడువు ముగింపునకు వచ్చింది. ఈ స్పెషల్‌ ఎఫ్‌డీ కాల వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు మరో అరశాతం అదనంగా 7.6 శాతాన్ని బ్యాంక్‌ చెల్లిస్తోంది.


- ఆదాయపు పన్ను అప్‌డేటెడ్‌ రిటర్న్‌ (Income Tax Updated Return) దాఖలు చేయడానికి మార్చి 31 వరకే సమయం ఉంది. అప్‌డేటెడ్‌ రిటర్న్‌ సమర్పించే సమయంలో, అదనంగా కట్టాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.


- ఆదాయ పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టేందుకు మార్చి 31 వరకే మీకు టైమ్‌ ఉంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం గరిష్టంగా రూ. 1.5 లక్షలు వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మార్చి 31 లోపు పెట్టుబడులు పెట్టాలి. అయితే, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ELSS) మాత్రం ఎంచుకోలేరు. శని, ఆదివారాలు స్టాక్‌ మార్కెట్‌ పని చేయదు కాబట్టి, ELSS అప్లికేషన్‌ను ఫండ్‌ కంపెనీలు ఆమోదించలేవు. ఈ తరహా స్కీమ్స్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టినా, అవి కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) కిందకే వస్తాయి.


మరో ఆసక్తికర కథనం: నగల మీద మోజు వదిలేయండి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి