Tax Saving Options: మీరు పాత పన్ను విధానాన్ని ఫాలో అవుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను భారాన్ని తప్పించుకోవాలని ప్లాన్ చేస్తుంటే, మీకు పెద్దగా సమయం లేదు మిత్రమా!. మీరు ఏ ప్లాన్స్‌ వేసినా మార్చి 31, 2023 లోపు వాటిని అమలు చేయాలి. ఒకవేళ మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉంటే, ఇంకా ఏ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టకపోతే, పన్ను ఆదా చేసే అనేక ఆప్షన్లు మీ కోసం సిద్ధంగా ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే వీటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ పన్ను భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.


ఆదాయపు పన్ను సెక్షన్ 80C, 80CCC & 80CCD (1) కిందకు వచ్చే పన్ను మినహాయింపు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు పన్ను నుంచి తప్పించుకోవచ్చు, పెద్ద మొత్తంలో ఆదాయం కూడా పొందవచ్చు.


ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS)
ELSS మ్యూచువల్ ఫండ్‌ అనేది సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసే పథకం. దీంతో పాటు, పెట్టుబడిదారులు మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. అయితే, ఇది స్టాక్‌ మార్కెట్‌తో ముడిపడిన పథకం. స్టాక్‌ మార్కెట్‌తో పాటు ఈ పథకంలో లాభనష్టాలను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ స్కీమ్‌లో మీ డబ్బును పెట్టుబడి పెట్టాలి.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)
ప్రముఖ చిన్న పొదుపు పథకాల్లో PPF ఒకటి. పన్ను ఆదా కోసం చాలా మంది ఈ పథకంలో పెట్టుబడి పెడతారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. PPFలో ఎక్కువ కాలం డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు. ఇందులో మీ డబ్బుకు ఎలాంటి ప్రమాదం ఉండదు.


జాతీయ పెన్షన్ పథకం (NPS)
ఈ పథకంలో పెట్టుబడులకు ఆదాయ పన్ను సెక్షన్ 80CCD (1) కింద రూ. 50,000 వరకు మినహాయింపు తీసుకోవచ్చు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.


EPFలో డిపాజిట్ చేయవచ్చు
జీతం అందుకునే ఉద్యోగులకు PF కంట్రిబ్యూషన్ మంచి పన్ను ఆదా ఎంపిక. మీ జీతంలో 12% ఇందులో జమ చేస్తారు. దానిపై ఎటువంటి పన్ను విధించరు. PF ఖాతా మీద ప్రభుత్వం వడ్డీ కూడా ఇస్తుంది.


పన్ను ఆదా చేసే FD
ఫిక్స్‌డ్ డిపాజిట్ ‍‌(FD) స్కీమ్‌ను పోస్టాఫీసు ఐదేళ్లపాటు అందిస్తుంది. ఈ టర్మ్ డిపాజిట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల పన్నును ఆదా చేసుకోవచ్చు.


వివిధ పోస్టాఫీసు పథకాల ద్వారా పన్ను మినహాయింపు
సుకన్య సమృద్ధి యోజన (SSY) పొదుపు పథకం కింద ఏడాదికి 7.6% వడ్డీని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. సెక్షన్ 80C కింద దీనిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ద్వారా కూడా రూ. 1.5 లక్షల పన్ను ఆదా కూడా చేయవచ్చు. సీనియర్ సిటిజన్లకు కూడా 1.5 లక్షల రూపాయల పొదుపు పథకం అందుబాటులో ఉంది.