Income Tax Saving Investments How to plan your income tax smartly in the new financial year: కొత్త ఆర్థిక ఏడాది 2022-2023 (FY-Financial Year) వచ్చేసింది. చాలామంది టాక్స్‌ ప్లానింగ్‌ను (Tax Planning) ఆఖరి నిమిషంలో చేస్తారు. ఐటీఆర్‌ (ITR) ఫైల్‌ చేసే ముందర కొన్ని ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఇలా కాకుండా ఏడాది మొదట్లోనే సరైన ప్రణాళికతో ప్లాన్‌ చేసుకుంటే చాలావరకు పన్ను భారం తప్పించుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టం 1961 (Income Tax Act) ప్రకారం మినహాయింపులు పొందొచ్చు.


* FY 2022-23కి ఆదాయ పన్ను స్లాబ్‌ రేట్లు (Income tax slabs) ఏమీ మారలేదు. గతేడాది మాదిరిగానే ఉంచారు. అత్యధిక పన్ను రేటు 30 శాతంగా ఉండనుంది. హెల్త్‌, ఎడ్యుకేషన్‌ సెస్‌ 4 శాతం అదనం. గరిష్ఠంగా 42.744 శాతం వరకు మార్జినల్‌ టాక్స్‌ ఉంటుంది.


* ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF- Provident Fund), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (Public Provident Fund), యూనిట్‌ లింకుడ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ (ULIPS), ఈక్విటీ లింకుడు సేవింగ్స్‌ స్కీమ్‌ (ELSS), సుకన్య సమృద్ధి యోజన (SSY- Sukanya Samriddhi Yojana), ఐదేళ్ల టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీములు (Tax saving deposits), ఇతర పెట్టుబడి సాధనాల్లో 80C ప్రకారం మినహాయింపు పొందొచ్చు. రూ.1,50,000 వరకు మినహాయింపు ఉంటుంది.


* వ్యక్తులు సైతం నేషనల్‌ పెన్షన్‌ స్కీములో (NPS - National Pension Scheme)  పెట్టుబడి పెట్టి 80CCD (1B) ప్రకారం రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది.


* వ్యక్తిగతం, జీవిత భాగస్వామి, పిల్లల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం (Medical insurance premium) రూ.25,000 వరకు, తల్లిదండ్రుల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం రూ.25,000 వరకు మినహాయింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లైతే రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది.


* ఎడ్యుకేషన్‌ లోన్స్‌పై (Education Loans) చెల్లించే వడ్డీకి మినహాయింపు ఉంటుంది. ఎనిమిదేళ్లు లేదా వడ్డీ చెల్లించిన మొత్తం కాలం, రెండింట్లో ఏది తక్కువైతే ఆ కాలానికి మినహాయింపు ఉంటుంది.


* కొన్ని గుళ్లు, ధార్మిక సంస్థలు, ఎన్‌జీవోలకు చెల్లించే డొనేషన్లకూ (Donations) మినహాయింపు వర్తిస్తుంది. ఆర్గనైజేషన్‌ను బట్టి 50 నుంచి 100 శాతం వరకు డిడక్షన్‌ ఉంటుంది.


* ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీలకు మినహాయింపు ఉంటుంది. సెల్ఫ్‌ ఆక్కుపైడ్‌ ప్రాపర్టీ అయితే రూ.200,000 వరకు ఇది వర్తిస్తుంది. లెట్‌ ఔట్‌ ప్రాపర్టీస్‌కు పరిమితి లేదు.


* ఆర్‌ఈసీ, ఎన్‌హెచ్‌ఏఐ, భూమి, భవంతులపై వచ్చే దీర్ఘకాలిక మూలధన రాబడిపై (LTCG) కొన్ని మినహాయింపులు ఉన్నాయి.


* వేతనంలో తీసుకుంటున్న హెచ్‌ఆర్‌ఏపై (HRA) మినహాయింపు ఉంటుంది. కరోనా చికిత్స, ఔషధాలకు అయ్యే ఖర్చులపై మినహాయింపు ఉంది.