Tax Saving Fixed Deposits: 2022-23 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేయడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఆదాయ పన్ను ఆదా కోసం పోస్ట్ ఆఫీస్ నుంచి NPS, హోమ్ లోన్, మ్యూచువల్ ఫండ్స్ వరకు అనేక పెట్టుబడి ఎంపికలను మీరు ఇప్పటికే ఎంచుకుని ఉండవచ్చు. ఇంకా పన్ను ఆదా ఆప్షన్ల కోసం చూస్తున్నట్లయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉత్తమంగా ఉంటుంది.
చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద పన్ను మినహాయింపు (Income Tax Saving Fixed Deposits) ఆప్షన్లను అందిస్తున్నాయి. మీరు ఈ FDలలో గరిష్ట పన్నును ఆదా చేయవచ్చు. పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ పోస్ట్ ఆఫీస్ (Post Office Tax Saving Fixed Deposit) కూడా అందిస్తుంది, దీని మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పన్ను తరహాలోనే ఇలాంటి FDల పైనా పన్ను ఆదా ఉంటుంది.
పన్ను ఆదా చేసే FDలపై ఎంత వడ్డీ వస్తుంది?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI Tax Saving FD), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank Tax Saving FD) వంటి దేశంలోని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు సాధారణ పౌరులకు పన్ను ఆదా పెట్టుబడులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ తరహా పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద 6.50% వడ్డీని అవి చెల్లిస్తున్నాయి. ఈ విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank Tax Saving Fixed Deposit), ఐసీఐసీఐ బ్యాంకులు 7% వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. DCB బ్యాంక్ 7.60 శాతం, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank Tax Saving FD) 7.20 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి.
ఎంత పన్ను ఆదా చేయవచ్చు?
పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి మీరు పెట్టే ఆలోచనలో మీరు ఉంటే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద మీరు పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఎలాంటి సెక్షన్లూ ఉండవు. ఒక వ్యక్తి పన్ను విధించదగిన మొత్తం ఆదాయం రూ. 7 లక్షలు దాటితే, స్లాబ్ రేట్ ప్రకారం అతను పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాత పన్ను విధానంలో, సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.
పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాలు తెలుసుకోండి:
వ్యక్తులు (Individuals), HUFలు (Hindu Undivided Family) మాత్రమే ఇలాంటి పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టగలరు. మైనర్‌కు కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. అతను, తన తల్లిదండ్రుల సహాయంతో FDలో పెట్టుబడి పెట్టవచ్చు.
పన్ను ఆదా FDల్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. మీరు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఆదా చేయవచ్చు.
వీటికి 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. కాల గడవుకు ముందే ఉపసంహరణకు అనుమతి లేదు.
పన్ను ఆదా FDల మీద లోన్ తీసుకోవడానికి అనుమతి లేదు.