Inheritance Tax On Property: వారసత్వంగా లేదా వీలునామా ప్రకారం ఆస్తిని పొందడం సర్వసాధారణం. ప్రజలు వారసత్వంగా లేదా తాతలు, తల్లిదండ్రులు అంటే పాత తరం నుంచి ఆస్తులు పొందుతారు. ఇలా, వారసత్వంగా సంక్రమించిన ఆస్తులపై కూడా పన్ను కట్టాలా అనే ప్రశ్న ప్రజల మనస్సుల్లో మెదులుతుంటుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిపై ఏయే సందర్భాల్లో పన్ను చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత చట్టం ఏం చెబుతోంది?
సాధారణంగా, ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని వారసుడు ఆస్తిని పొందుతాడు. వీలునామా ద్వారా లేదా పర్సనల్ లా (Personal Law) ప్రకారం వారసుడికి ఆస్తి దక్కుతుంది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణించినప్పుడు పర్సనల్ లా వర్తిస్తుంది. ముందుగా ఒక విషయం తెలుసుకుందాం. భారతదేశంలో వారసత్వపు పన్ను/ఎస్టేట్ పన్ను (Inheritance Tax/ Estate Tax) రద్దు చేశారు. కాబట్టి, తల్లిదండ్రులు లేదా కుటుంబం నుంచి సంక్రమించిన ఆస్తి ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు. అది పూర్వీకుల ఆస్తిగా లేదా వీలునామాగా పరిగణనిస్తారు. అయితే, కొన్ని పరిస్థితులలో మాత్రం పన్ను బాధ్యత వర్తిస్తుంది.
ఇండెక్సేషన్ ప్రయోజనం
మీరు వీలునామా లేదా వారసత్వం ద్వారా ఆస్తిని స్వీకరించినప్పుడు దానిపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఆ ఆస్తిని విక్రయించినప్పుడు, మూలధన లాభం నిబంధన ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే... ఆస్తిని కొనుగోలు చేసిన సమయం నుంచి ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని (indexation benefit) మీరు పొందుతారు. ఆ ఆస్తి 2001 సంవత్సరానికి ముందు ఉంటే, ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తూ 2001లో ఆస్తి విలువ ఎంత ఉందో మదింపు చేసి, అది పూర్తయిన తర్వాత ఆస్తి ధరను పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల ఆ ఆస్తి కొత్త విలువ తెలుస్తుంది. తద్వారా మీపై పన్ను బాధ్యత తగ్గుతుంది.
వారసత్వ ఆస్తిపై పన్ను ఎప్పుడు వర్తిస్తుంది?
మీరు ఆ ఆస్తిని ఎవరి నుంచి పొందారు, అతను ఎప్పుడు కొన్నాడు, ఎంతకు కొన్నాడు అన్న విషయాలపై మీ పన్ను బాధ్యత ఆధారపడి ఉంటుంది. కొన్న నాటి నుంచి హోల్డింగ్ వ్యవధిని లెక్కిస్తారు. 2 సంవత్సరాల హోల్డింగ్ వ్యవధి తర్వాత మీరు ఆ ఆస్తిని విక్రయిస్తే, మీకు వచ్చిన లాభం మీద దీర్ఘకాలిక మూలధన లాభం పన్ను (long term capital gain tax - LTCG Tax) వర్తిస్తుంది. 2 సంవత్సరాల హోల్డింగ్ వ్యవధి కంటే తక్కువ సమయంలోనే మీరు ఆ ఆస్తిని అమ్మితే, స్వల్పకాలిక మూలధన లాభం పన్ను (Short term capital gain tax - STCG Tax) వర్తిస్తుంది.
ఆస్తి అమ్మకంపై పన్ను ఎంత ఉంటుంది?
ఒక వ్యక్తి ఆస్తిని కొనుగోలు చేసిన 2 సంవత్సరాల లోపు మరణిస్తే, ఆ ఆస్తిని అతని వారసుడికి బదిలీ చేస్తే, ఆ ఆస్తి అమ్మకం స్వల్పకాలిక మూలధన లాభం పన్నుకు లోబడి ఉంటుంది. అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము ఆ వారసుడి ఆదాయానికి యాడ్ అవుతుంది. ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాల్సి ఉంటుంది. హోల్డింగ్ వ్యవధి రెండేళ్ల కంటే ఎక్కువ ఉంటే, ఇండెక్సేషన్ ప్రయోజనం పొందిన తర్వాత, 20 శాతం చొప్పున దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.