Income Tax Rule:


బతుకు దెరువు కోసం జగిత్యాల కుర్రాడు అజయ్‌ దుబాయ్‌కి వెళ్లాడు. అదృష్టం కలిసి రాకపోతుందా అని లాటరీ టికెట్‌ కొన్నాడు. లక్ష్మీదేవి కటాక్షంతో భారత కరెన్సీలో రూ.30 కోట్ల విలువ చేసే లాటరీ అతడి సొంతమైంది. ఇక అతడు డ్రైవింగ్‌ వృత్తి మానేసి భారత్‌కు తిరిగొచ్చే అవకాశాలే ఎక్కువ! అలాంటప్పుడు లాటరీ సొమ్ముపై అతడెంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? మన దేశంలో టాక్స్‌ రూల్స్‌ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం!


బిగ్‌బాస్‌ విజేతకూ తప్పదు!


మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లాటరీకి చట్టబద్ధత ఉంది. కేరళ, పశ్చిమ్‌ బంగాల్‌ వంటి రాష్ట్రాల్లో లాటరీ అధికారికమే! కొందరికి కార్లు, బైకులు లక్కీ డ్రాలో వస్తుంటాయి. ఇక కౌన్‌ బనేగా కరోడ్‌పతి, ఇండియన్‌ ఐడల్‌, రోడీస్‌, సరిగమపా, డాన్స్‌ ఇండియా డాన్స్‌, బిగ్‌బాష్ వంటి రియాల్టీ షోల్లో విజేతలకు భారీగా బహుమతులు దక్కుతాయి. ఈ మధ్యే జరిగిన బిగ్‌బాష్‌ తెలుగు విజేత రేవంత్‌ రూ.10 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన భూమి, రూ.10 లక్షల విలువ చేసే మారుతీ విటారా బ్రెజా కైవసం చేసుకున్నాడు. రన్నరప్ శ్రీహాన్‌ రూ.40 లక్షల నగదు అందుకున్నాడు. మరి వీరికి టాక్స్‌ను ఎలా లెక్కిస్తారో అంచనా వేద్దాం!


30.9%తో ఆగదు!


ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం సెక్షన్‌ 52(2)(ib) ప్రకారం 'ఇతర వనరుల ద్వారా పొందిన ఆదాయం' పన్ను పరిధిలోకి వస్తుంది. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి, గేమింగ్‌ యాప్స్‌ విజేతలు దీని పరిధిలోకి వస్తారు. లాటరీ, లక్కీ డ్రా, రేసులు, కార్డ్‌ గేమ్స్‌, గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌, క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌, టీవీ, ఎలక్ట్రానిక్‌ కాంపిటీటివ్‌ గేమ్‌ షోల ద్వారా పొందిన ఆదాయానికి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఈ విజేతలు పొందే నగదుపై నిర్వాహకులే 30 శాతం టీడీఎస్‌ రూపంలో కట్‌ చేస్తారు. దీనికి తోడు విద్యా సుంకం 3 శాతం ఉంటుంది. అంటే మొత్తం 30.9 శాతం టీడీఎస్‌ ఉంటుంది. గెలుచుకున్న మొత్తం రూ.10 లక్షలు దాటితే మరో 10 శాతం సర్‌ఛార్జ్‌ ఉంటుంది.


ఆదాయపన్ను నిబంధనలు



  • ఎవరైనా సరే తమ రెగ్యులర్‌ ఆదాయంతో సంబంధం లేకుండా గెలుచుకున్న మొత్తంలో 30.9 శాతం పన్ను చెల్లించాల్సిందే.

  • గెలుపొందిన మొత్తంపై ఫ్లాట్‌గా 30.9 శాతం పన్ను వేస్తారు. ఇది మీ ఆదాయంలో జత చేయరు. ఆదాయపన్ను శ్లాబుల కిందకు రాదు.

  • సేవింగ్స్‌, సెక్షన్‌ 80C నుంచి 80U వరకు వర్తించే సాధనాల్లో డబ్బు మదుపు చేసినా లాటరీ ఆదాయంపై మినహాయింపులు ఇవ్వరు.

  • ఒకవేళ మీరు కారు, నగలు, ఇల్లు, స్థిర, చర ఆస్తులు గెలిచినా దానిని అందుకోకముందే 30.9 శాతం టీడీఎస్‌ చెల్లించాలి. ఉదాహరణకు

  • మీరు రూ.8 లక్షలు కారు గెలిస్తే దానిని ఇంటికి తెచ్చే ముందే రూ.2,47,200 పన్ను చెల్లించాలి.

  • ఒక చిన్న మినహాయింపు మాత్రం ఉంది. మీరు గెలిచిన డబ్బులో కొంత లేదా మొత్తం విరాళంగా ఇచ్చేస్తే దానిపై పన్ను ఉండదు.


ఎవరికి ఎంత పన్ను పోటు!


పై నిబంధనలు అనుసరించి బిగ్‌బాస్‌ విజేత రేవంత్‌ ఎంత పన్ను చెల్లించాడో అంచనా వేద్దాం! రూ.10 లక్షలకు 30.9శాతం పన్ను అంటే రూ.3,20,000 వరకు టీడీఎస్‌ ఉంటుంది. రూ.20 లక్షల ఫ్లాట్‌కు 30.9 శాతం టీడీఎస్‌, అదనంగా 10 శాతం సర్‌ఛార్జ్‌ ఉంటుంది. విటారా బ్రెజా కారుకు ముందే టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. శ్రీహాయిన్‌ అయితే  రూ.12 లక్షలకు పైగా టీడీఎస్‌, 10 శాతం సర్‌ఛార్జ్‌ చెల్లించాల్సిందే. జగిత్యాల కుర్రాడు లాటరీ గెలిచింది దుబాయ్‌లో! కాబట్టి అక్కడి నిబంధనల ప్రకారం టీడీఎస్‌ ఉంటుంది.