ITR Refund Fake Message:
సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరతీశారు. ఈసారి ఆదాయ పన్ను రీఫండ్ పేరుతో సందేశాలు పంపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్‌ను అప్‌డేట్ చేసుకొంటేనే మీ ఖాతాలో డబ్బులు పడతాయని వల వేస్తున్నారు. తొందరపాటులో సందేశాన్ని తెరిచి లింక్ ఓపెన్ చేస్తే బ్యాంకు ఖాతాలో డబ్బుల్ని కొట్టేస్తున్నారు.
'డియర్ సర్, మీకు రూ.15,490 ఆదాయపన్ను రీఫండ్ ఆమోదించారు. త్వరలోనే ఈ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. దయచేసి మీ ఖాతా నంబర్ 5XXXXX6755ను వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఇది మీ నంబర్ కాకపోతే వెంటనే https://bit.ly/20wpYK6 లింకును క్లిక్ చేసి మీ బ్యాంకు ఖాతా సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోండి' అని ఈ మధ్యన చాలా మందికి మెసేజులు వస్తున్నాయి.
ఇలాంటి సందేశాలను అస్సలు నమ్మొద్దని ఆదాయపన్ను శాఖ, పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ప్రజలకు సూచించాయి. అలాంటి సందేశాలు తెరిచి లింక్ క్లిక్ చేస్తే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ ట్వీట్ సైతం చేసింది.
రెండు నెలల క్రితం మొదలైన ఆదాయపన్ను రిటర్నుల ఫైలింగ్ ప్రక్రియ జులై 31న ముగిసింది. సాధారణంగా ఆఖరి పది రోజుల్లో ఐటీ శాఖ వెబ్‌సైట్‌కు రద్దీ ఎక్కువగా ఉంటుంది. సైబర్ నేరగాళ్లు దీనిని అవకాశంగా మార్చుకున్నారు. స్పామ్ మెసేజులు చేయడం మొదలుపెట్టారు.
నిజానికి ఆదాయపన్ను శాఖ ఇలాంటి సందేశాలను నేరుగా పంపించదు. ఐటీఆర్ ఫైల్ చేసే ముందే బ్యాంకు ఖాతాను వ్యాలిడేట్ చేసుకోవాలని కోరుతుంది. ఆ ఖాతా వ్యాలిడేట్ అయ్యాకే తర్వాత ప్రక్రియ మొదలవుతుంది. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు వీలవుతుంది. ఆ వ్యాలిడేట్ చేసిన బ్యాంకు ఖాతాకే ఐటీ శాఖ రీఫండ్ మొత్తాన్ని పంపిస్తుంది. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే, పొరపాట్లు ఫోన్‌కు సందేశం ఇవ్వదు. నేరుగా ఆ వ్యక్తి రిజిస్టర్ ఈమెయిల్ పంపిస్తుంది.
సైబర్ నేరగాళ్లు మళ్లీ పంజా విసురుతుండటంతో ఆదాయపన్ను శాఖ అలర్ట్ అయింది. పన్ను చెల్లింపుదారులు, సామాన్యులను దీని గురించి హెచ్చరించింది. కాగా ఈసారి ఐటీఆర్ ఫైలింగ్‌లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. జులై 31 అర్ధరాత్రి 12 గంటల వరకు, 6,77,42,303 కోట్ల ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. అంటే, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి మన దేశంలో 6.77 కోట్లకు పైగా ఐటీఆర్స్ ఫైల్ అయ్యాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు (individual tax payers), యూనిట్ల విషయంలో ఇది పెద్ద రికార్డు.
ఆదాయ పన్ను విభాగం ట్వీట్ ప్రకారం, గత సంవత్సరం, అంటే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్/2022-23 అసెట్‌మెంట్ ఇయర్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు & యూనిట్ల కేటగిరీలో మొత్తం 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. దీంతో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు ఒక కోటి టాక్స్ రిటర్న్స్ ఎక్కువ ఫైల్ అయ్యాయి. ఈ ఏడాది జులై 31 వరకు, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి 3,44,16,658 కోట్ల ఐటీఆర్‌లు వెరిఫై అయ్యాయి, ప్రాసెస్ పూర్తయింది. 5,62,59,216 కోట్ల రిటర్నులను ధృవీకరించారు.
ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైలింగ్, టాక్స్ పేమెంట్, రిఫండ్ సహా రిటర్న్ ఫైలింగ్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించడానికి ఐటీ డిపార్ట్‌మెంట్ వివిధ రూపాల్లో సాయం చేస్తోంది. టాక్స్ పేయర్ల కోసం ఐటీ డిపార్ట్‌మెంట్ హెల్ప్‌డెస్క్ 24x7 ప్రాతిపదికన పనిచేస్తోంది. ఫోన్ కాల్స్, లైవ్ చాట్, వెబ్‌ఎక్స్ సెషన్లు, సోషల్ మీడియా ద్వారా సాయం వంటి రూట్లలో తాము అందుబాటులో ఉన్నామని ఆదాయ పన్ను శాఖ విభాగం ప్రకటించింది. టాక్స్ ఫైలింగ్‌కు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని సూచించింది.