Advance Tax Payment: ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి తన ఆదాయంలో కొంత భాగాన్ని పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. మీరు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ముందస్తు పన్ను చెల్లింపు (Advance Tax Payment) చేయాలనుకుంటే, ఈ రోజే ఈ పని పూర్తి చేయండి. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, అడ్వాన్స్ ట్యాక్స్ నాలుగో విడత డిపాజిట్‌ చేయడానికి చివరి తేదీ (Advance Tax Payment Deadline) మార్చి 15, 2023. 


ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10,000 కంటే ఎక్కువ పన్ను బాధ్యత ఉన్నవాళ్లు, విడతల వారీగా ముందస్తుగానే పన్ను చెల్లించవచ్చు. ఈ పన్ను మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించవచ్చు. ఉద్యోగులు, తమ జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం ముందుగానే కట్‌ అయ్యేలా ఆప్షన్‌ పెట్టుకోవచ్చు.


ముందస్తు పన్నును ఆన్‌లైన్‌ ద్వారా ఎలా చెల్లించాలి?
మీరు ఇంకా ముందస్తు పన్నును డిపాజిట్ చేయకపోతే, సులభంగా ఆ పని పూర్తి చేయవచ్చు.
పన్ను చెల్లింపుదారుల ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్ www.tin-nsdl.com ని సందర్శించాలి.
సర్వీసెస్‌ విభాగంపై క్లిక్ చేసి, ఆన్‌లైన్ పన్ను చెల్లించుపై క్లిక్ చేయండి.
దీని తర్వాత, అడ్వాన్స్‌ టాక్స్‌ పేమెంట్‌ కోసం సరైన చలాన్‌ను ఎంచుకోవాలి.
ఆ తర్వాత, ఆర్థిక సంవత్సరం, అసెస్‌మెంట్ ఇయర్, చిరునామా, మొబైల్ నంబర్ మొదలైన సమాచారాన్ని పూరించాలి. ఈ-మెయిల్ సమాచారాన్ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
అన్ని వివరాలను క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆపై నెట్ బ్యాంకింగ్ పేజీ ఓపెన్‌ అవుతుంది.
మీరు చెల్లించాలనుకుంటున్న ముందస్తు చెల్లింపు మొత్తం, ఇతర వివరాలు నమోదు చేసి పేమెంట్‌ పూర్తి చేయండి. ఇప్పుడు మీకు పన్ను చెల్లింపు రసీదు వస్తుంది.
ముందస్తు పన్ను చెల్లింపు జరిగిందని ఈ రసీదు ధృవీకరిస్తుంది.


ఆఫ్‌లైన్‌లో కూడా జమ చేయవచ్చు
పన్ను చెల్లింపుదార్లు ఆఫ్‌లైన్‌లో కూడా పన్ను చెల్లింపు చేయవచ్చు. దీని కోసం, మీరు ముందుగా బ్యాంకుకు వెళ్లి చలాన్ 280 నింపాలి.
ఆ తర్వాత అసెస్‌మెంట్ సంవత్సరం, చిరునామా మొదలైన సమాచారాన్ని నమోదు చేయాలి.
ఆ చలాన్‌తో పాటు నగదు లేదా చెక్‌ను (ఎంత మొత్తం డిపాజిట్ చేయాలో అంత మొత్తం) డిపాజిట్‌ కౌంటర్‌లో ఇవ్వాలి.
డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత, బ్యాంక్ మీకు రసీదు ఇస్తుంది. తద్వారా మీ ముందస్తు పన్ను డిపాజిట్ అవుతుంది.


ముందస్తు పన్ను కట్టకపోతే ఏమవుతుంది?
ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను బాధ్యత రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే, ముందస్తు పన్నును డిపాజిట్ చేయాలి. ఒక వ్యక్తి అలా చేకపోతే, అతను అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి మూడు వాయిదాలపై 3%, చివరి వాయిదాపై 1% చొప్పున వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 23B, 24C కింద ఈ పెనాల్టీని వసూలు చేస్తారు. 


ఒకవేళ మీ పన్ను బాధ్యత కంటే ఎక్కువ మొత్తాన్ని ముందస్తు పన్ను రూపంలో మీరు డిపాజిట్ చేసినట్లయితే, అధికంగా ఉన్న మొత్తాన్ని ఆదాయ పన్ను విభాగం మీకు తిరిగి చెల్లిస్తుంది. ఈ వాపసు పొందడానికి, మీరు ఫారమ్ 30ని పూరించి, సమర్పించాలి. అదనపు మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది.