Tax-savings Investments:
ఐటీ రిటర్న్ గడువు దగ్గర పడగానే చాలామంది ఆందోళనకు గురవుతారు. పన్ను ఆదా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టలేదని దిగులు చెందుతారు. అప్పటికప్పుడు తొందరపాటుతో పెట్టుబడులు పెట్టి స్వల్ప ప్రయోజనమే పొందుతారు. ఇలా అనాలోచితంగా చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవడంతో పాటు అధిక పన్ను చెల్లించక తప్పదు! మరి టాక్స్ సేవింగ్స్ సాధనాల్లో పెట్టుబడికి చివరి తేదీ ఉంటుందా? వేటిల్లో మదుపు చేస్తే బెటర్.. మీ కోసం!
చివరి తేదీ ఇదే!
2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి పన్ను ఆదా పనులు మొదలు పెట్టలేదా? అయితే వెంటనే చేసేయండి. 2023, మార్చి 31 ఇందుకు చివరి తేదీ. ఆ లోపు పన్ను ఆదా సాధనాల్లో పెట్టుబడులు పెట్టకపోతే, అవసరమైన ఖర్చులు చేయకపోతే చెల్లించాల్సిన పన్ను పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2020-21 నుంచి ఆదాయ పన్ను చెల్లించేందుకు రెండు విధానాలున్న సంగతి తెలిసిందే. 2022-23కు పాత పన్ను విధానమే ఎంచుకుంటే హౌజ్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC), సెక్షన్ 80సీ కింద మినహాయింపులు, 80డీ కింద మెడికల్ పాలసీ ప్రీమియం, 80ఈ కింద విద్యారుణంపై వడ్డీకి మినహాయింపులు పొందొచ్చు.
పన్ను ఆదా ఎంత?
పన్ను ఆదా ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల పన్ను భారం ఎలా పెరుగుతుందో గమనిద్దాం. ఉదాహరణకు ఏడాదికి మీ ఆదాయం రూ.10 లక్షలు అనుకుందాం. సెక్షన్ 80సీ పరిధిలోని పీపీఎఫ్, ELSS మ్యూచువల్ ఫండ్లు, ఐదేళ్ల డిపాజిట్లు, సుకన్య వంటి పథకాల్లో రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టలేదనుకుందాం. అలాంటప్పుడు పాత విధానంలో 4 శాతం సెస్‌తో కలిపి మీ పన్ను భారం రూ.1.17 లక్షలు అవుతుంది. అదే మీరు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు చూపిస్తే చెల్లించాల్సిన పన్ను రూ.1,06,600కు తగ్గుతుంది. రూ.10,400 వరకు ఆదా చేసుకోవచ్చు.
తెలివిగా ఎంపిక!
కొత్త పన్ను విధానం ఎంచుకుంటే పన్ను రేటు తక్కువగా ఉంటుంది. అయితే పన్ను మినహాయింపులేమీ ఉండవు. అయితే సెక్షన్ 80సీసీడీ (2) కింద ఎన్‌పీఎస్ ఖాతాలో యజమాని జమచేసే డబ్బుపై మినహాయింపు పొందొచ్చు. ఈ లెక్కన మీరు 4 శాతం సుంకం కలుపుకొని మీరు చెల్లించాల్సిన పన్ను రూ.78,000 అవుతుంది. అయితే మీరు క్లెయిమ్ చేసే డిడక్షన్లు రూ.2.5 లక్షలు మించితే పాత పన్ను విధానమే ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కనీస డిపాజిట్లు!
ఇప్పటికీ మీరు పన్ను ఆదా చేసే ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులు పెట్టకపోతే ఇప్పుడైనా ఆ పని చేయండి. ఐదేళ్ల బ్యాంకు డిపాజిట్లు, ఇంటి రుణం ప్రీ పేమెంట్లు, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎల్ స్కీముల్ల పెట్టుబడులు ఆన్‌లైన్‌లో చేపట్టొచ్చు. ఒకవేళ వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు మీ వద్ద డబ్బు లేకుంటే పిల్లల ట్యూషన్ ఫీజులు, ఇంటి రుణం చెల్లింపు, రుణంపై వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపులు పొందొచ్చు. వీలుంటే మార్చి 31లోపు పీపీఎఫ్, సుకన్య వంటి స్కీముల్లో కనీస డిపాజిట్లైనా చేయండి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.